వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి పోరాడబోతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో చంద్రబాబు నాయుడుతో ములాఖత్ తర్వాత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు భద్రతపై తమకు అనుమానాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. విడివిడిగా పోటీ చేస్తే వైసీపీ ఎదుర్కోవడం కష్టమే అని అన్నారు. రేపటినుండి టీడీపీ-జనసేన కలిసి పని చేస్తాయని అన్నారు పవన్ కళ్యాణ్. ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తున్నామని అన్నారు.
ఏపీలో అరాచక పాలన సాగుతోందని.. రాష్ట్రం బాగుపడాలన్నదే జనసేన పార్టీ లక్ష్యమన్నారు పవన్ కళ్యాణ్. తాను ఏ నిర్ణయం తీసుకున్నా దానికి చివరివరకు కట్టుబడి ఉంటానని చెప్పారు. ఈ రోజే నిర్ణయం తీసుకున్నాను. వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి వెళ్తాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ,జనసేన కలిసి వెళ్ళాలనేది తన కోరికని పవన్ అన్నారు. వైసీపీ అరాచకాలను అడ్డుకోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే కుదరదన్నారు. వైసీపీకి అనుకూలంగా ఉండే క్రిమినల్స్‌ను హెచ్చరిస్తున్నానని, వైసీపీ క్రిమినల్స్‌ను వదలబోమన్నారు. జగన్ అరాచకాలను డీజీపీ, చీప్ సెక్రటరీ, అధికారులు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. జగన్ నీకు ఆరు నెలలే. యుద్దమే కావాలంటే యుద్దమే ఇస్తాం. ఖచ్చితంగా ఏ ఒక్కర్ని వదలం. మాజీ ముఖ్యమంత్రినే కూర్చోబెడితే మీ పరిస్థితే అర్థం చేసుకోండని పవన్ హెచ్చరించారు.
చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టారని జనసేనాని అన్నారు. చంద్రబాబు నాయుడును అనవసరంగా రిమాండ్‌లో పెట్డడం బాధాకరమని పవన్ కళ్యాణ్ అన్నారు. 2014లో దేశానికి బలమైన నాయకుడు కావాలని అనుకున్నానని.. అందుకే మోదీకి మద్దతిచ్చినట్లు తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అనుభవమున్న వ్యక్తి సీఎం కావాలని అనుకున్నానని అందుకే చంద్రబాబుకు మద్దతిచ్చానని వెల్లడించారు. కొన్ని సార్లు చంద్రబాబు ప్రభుత్వంపైనా విమర్శలు చేశానని గుర్తుచేశారు. తప్పు చేసినప్పుడు ఎవరినైనా ప్రశ్నిస్తానని.. అక్రమంగా అరెస్ట్‌లు చేసినప్పుడు బాధితుల పక్షాన కూడా తప్పకుండా నిలబడుతానని చెప్పారు. మాతో బీజేపీ కూడా కలసి వస్తుందని భావిస్తున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు.