ఆఖరి శ్వాస వరకూ రాజకీయాల్లోనే ఉంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఒకవేళ ఈ పోరాటంలో తాను ప్రాణాలు కోల్పోతే తన మట్టిని దేశం నలుమూలలా చల్లాలంటూ జనసైనికులకు పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో జనసేన గెలుపు తథ్యమని.. మార్పు కోసమే మనమంతా తపిస్తున్నామని చెప్పారు. ధవళేశ్వరంలో లక్ష మందితో జరగాల్సిన కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకుందని 4 వేలకు పైగా వాహనాలను అడ్డుకున్నారని అన్నారు. జనసేనను చూసి ప్రభుత్వం ఎంత భయపడుతోందన్న దానికి ఇదే నిదర్శనమని అన్నారు. ప్రతి జనసైనికుడిలో ఎంత కోపం ఉందో తనకు తెలుసని అయితే అందరూ ఆ కోపాన్ని దాచుకోవాలని చెప్పారు. కోపాన్ని తారాజువ్వలా వదిలేస్తే ఆ తర్వాత వెంటనే కిందకు పడుతుందని.. కోపాన్ని దాచుకోవడం రాయలసీమ ప్రజలను చూసి నేర్చుకోవాలని చెప్పారు. సీమ ప్రజలు తమ కోపాన్ని రెండు, మూడు తరాలు కూడా దాచుకుంటారని అన్నారు. గోదావరి జిల్లాల ప్రజలు కూడా కోపాన్ని దాచుకునే విద్యను అభ్యసించాలని… అందుకోసం మిమ్మల్ని రాయలసీమకు ట్రైనింగ్ కు పంపుతానని చెప్పారు.
రాజకీయాల్లో అందరినీ కలుపుకుని పోవాల్సిన అవసరం ఉంటుందని పవన్ చెప్పారు. కమ్మవారికి వ్యతిరేకం కాదని చెప్పడానికే 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చానని.. ఇప్పుడు టీడీపీ సత్తా సరిపోవడం లేదని అన్నారు. అందుకే తాను రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెప్పారు.
రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి బహిరంగ సభ ప్రాంగణానికి వెళ్లేంత వరకూ అడగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించడంతో పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి ‘ఎలా అడ్డుకుంటారో చూద్దాం.. శ్రమదానం చేసి తీరుతాం.. సభ నిర్వహించే ఇక్కడ్నుంచి కదులుతాం’ అంటూ పోలీసులకు సవాల్ విసిరారు. ప్రశ్నించే వాడంటే అధికార పక్షానికి భయం పట్టుకుందన్న పవన్.. అందుకే నేనంటే వైసీపీ భయమన్నారు. ప్రశ్నించాలంటూ మొదట్నుంచీ నేను ప్రజలను మొత్తుకునేది అందుకేనన్నారు పవన్. సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు జనసేనాని. తనకు అన్నం పెట్టిన ప్రజల రుణం తీర్చుకోవడానికే పాలిటిక్స్‌లోకి వచ్చానన్నారు.
రాష్ట్ర రాజకీయాలు రెండిళ్ల మధ్య జరిగితే కుదరదన్న పవన్.. ఒక కులాన్ని వర్గ శత్రువుగా చేసుకుని వైసీపీ రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. అందుకే రోడ్లు లేవు, జీతాలు పెన్షన్లు రావని ఎద్దేవా చేశారు. బైబిల్ చేత్తో పట్టుకుని తిరిగే వాడిని కాదు, గుండెల్లో పెట్టుకుంటానన్నారు. కాపు, ఒంటరి, తెలగలు, బలిజలు ముందుకు వస్తే తప్ప రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రాదని సూచించారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవరూ అడ్డుకోలేరన్నారు. ప్రజలకు ఉన్న హక్కును ఎవరూ ఆపలేరు. తొక్కే కొద్దీ పైకిలేస్తాం తప్ప.. తగ్గేది లేదని స్పష్టం చేశారు. రాజకీయాలు నాకు సరదా కాదు.. బాధ్యత. నేను సీఎం కావాలని మనసులో కోరుకోండి. రాజకీయాలు నాకు వ్యాపారం కాదు. త్వరలోనే అధికారంలోకి వస్తామని వెల్లడించారు.