విశాఖ పరిధిలోని రుషికొండపై ప్రభుత్వ నిర్మాణాలపై ప్రతి పక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే..! రిషికొండను మింగేస్తున్న వైసీపీ ప్రభుత్వ తీరును కనులారా వీక్షించిన పవన్ కళ్యాణ్ అంటూ జనసేన ఒక వీడియోను విడుదల చేసింది. విశాఖపట్నం పర్యటనలో భాగంగా రుషికొండ ను పరిశీలించడానికి వెళ్లగా, కొండ చుట్టూ బారికేడ్లు పెట్టి లోపల పనులు చేస్తుండటంతో బయట నుంచి కొండపై జరుగుతున్న పనులను పవన్ కళ్యాణ్ పరిశీలించినట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. జనసేనకు చెందిన స్థానిక నేతలను కొందరిని వెంటేసుకుని రిషికొండ చేరుకున్న పవన్ కొండపై జరుగులున్న పనులేమిటన్న దానిపై ఆరా తీశారు. వైసీపీ నేతలు అక్రమ తవ్వకాలకు పాల్పడుతూ ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అడ్డగోలు తవ్వకాలతో రుషికొండను మింగేస్తున్నారని.. పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు.
పవన్ కళ్యాణ్ రుషికొండ పరిశీలనకు వెళ్లడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రిషికొండను చూసేందుకు ఓ సెలెబ్రిటీ వచ్చారని.. అక్కడ ఏదో జరిగిపోతోందని అనవసర హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. రుషికొండలో ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతోందని.. గతంలో అక్కడ గెస్ట్ హౌస్ ఉండేదని, ఇప్పుడు దాన్ని తొలగించి మరో భవనం నిర్మిస్తున్నామని.. అందులో తప్పేముందని పవన్ ను ప్రశ్నించారు మంత్రి బొత్స. విజయనగరం గుంకలాం వద్ద రాష్ట్రంలోనే అతిపెద్ద టౌన్‌షిప్ నిర్మిస్తున్నాం. గుంకలాంలో జగనన్న కాలనీ పూర్తి చేయడానికి నాలుగేళ్లు పడుతుందని బొత్స అన్నారు. ప్రధాని సభలో రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్ అని మంత్రి బొత్స అన్నారు.