జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..! జనసేన ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని అన్నారు. బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని స్థాపించడం…. బీజేపీతో పాటు టీడీపీని కూడా కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని స్థాపించడం… జనసేన ఒక్కటే ప్రభుత్వాన్ని స్థాపించడం తమ ముందున్న అవకాశాలని పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం అనేది పార్టీల మధ్య ఐక్యతపై ఆధారపడి ఉంటుందని అన్నారు. 2014లో రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ, టీడీపీతో కలిశామని, విజయం సాధించామని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పార్టీ చాలాసార్లు తగ్గిందని, ఇప్పుడు మిగతా పార్టీలు తగ్గితే బాగుంటుందని అన్నారు. “టీడీపీ నేతలకు నేను ఒకటే చెబుతున్నా… బైబిల్ సూక్తిని మీరు కూడా పాటించండి. తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడును అని బైబిల్ లో ఉంది. జనసేన పార్టీ ఎప్పుడూ తగ్గే ఉంటుంది. పొత్తుల విషయాన్ని జనసేన పార్టీ శ్రేణులు తీవ్రంగా పరిగణించవద్దు. ఈసారి ప్రజలే విజయం సాధించాలని కోరుకుంటున్నా” అని అన్నారు.
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ ఏపీలో బీజేపీ, జనసేన కలిసి ముందుకు అడుగులు వేస్తాయని, మెట్టు ఎవరు ఎక్కుతారో, ఎవరు దిగుతారో త్వరలోనే తెలుస్తుందని అన్నారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన మూడు ఆప్షన్లలో మొదటి దానిని తామే పరిగణనలోకి తీసుకుంటామని, రెండో ఆప్షన్ గురించి టీడీపీనే అడగాలని అన్నారు. పవన్ వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని, ఆత్మకూరు ఉప ఎన్నిక ద్వారా దీనికి సమాధానం చెబుతామని అన్నారు.