అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామంటే కుదరదు: పవన్ కళ్యాణ్

0
755

జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు నిర్వహించిన జనసేన పార్టీ ఐటీ రాష్ట్ర స్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. జనసేన అధికారంలోకి వస్తే ఏపీకి పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకువస్తామని అన్నారు. అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామంటే రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి ఎలా సాధ్యమవుతుందని సూటిగా ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు అమలు ప్రజలకు మేలు చేసేలా ఉండాలే గాని, బలహీనపరిచేలా ఉండకూడదన్నారు.

సంక్షేమ పథకాలకు నేను వ్యతిరేకం కాదు..కానీ సంక్షేమ పథకాలతో ప్రభుత్వన్ని నడపడం సరికాదు. సంక్షేమ పథకాలు ప్రజలను బలోపేతం చేసినట్టు కాదు.. ప్రజలను బలహీనులు తయారుచేస్తునట్టే అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగిన తర్వాత హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో మాత్రమే ఐటీ అభివృద్ధి జరిగిందని పవన్ కళ్యాణ్ అన్నారు. రాయలసీమ ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి యువత బెంగళూరుకు వెళ్లిపోతున్నామని.. ఇక్కడ ఐటీ రంగాన్ని ఎందుకు అభివృద్ధి చేయరని అడిగారని గుర్తు చేశారు. ఈరోజు మాట ఇస్తున్నా.. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తే, మిగతా రాష్ట్రాల్లో కంటే ఎక్కువ స్థాయిలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

జాతీయ సమగ్రతాభావం కోల్పోకుండా మనందరం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని పవన్ వివరించారు. గత దశాబ్దన్నర కాలంలో ఎన్నో అనుభవాలు సంపాదించినట్టు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయాలని పవన్ పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలకు జనసేన పార్టీ వ్యతిరేకం కాదని.. సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించడాన్ని మాత్రం వ్యతిరేకిస్తుందని పవన్ స్పష్టం చేసారు.