మాజీ హోంమంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ పూజల చెన్నకేశవులు(45) ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుంటూరు నగరం బ్రాడీపేటలోని సుచరిత ఇంటి సమీపంలోనే ఓ బిల్డింగ్‌లో గది అద్దెకు తీసుకుని గన్మెన్లు ఉంటారు. సోమవారం రాత్రి సుచరిత సెక్యూరిటీ అధికారి రామయ్యతో కలిసి చెన్నకేశవులు విశ్రాంతి గదికి వచ్చారు. రామయ్య స్నానం చేసేందుకు తన 9 ఎంఎం పిస్టల్‌ను బయట ఉంచి బాత్రూంలోకి వెళ్లారు. ఆ సమయంలో చెన్నకేశవులు ఆ తుపాకి తీసుకొని నుదిటిపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శబ్ధం విని బయటకు వచ్చిన రామయ్య వెంటనే విషయాన్ని సుచరిత దృష్టికి తీసుకెళ్లారు. ఆమె జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌కు విషయం తెలియజేశారు. ఎస్పీ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది.
చెన్నకేశవులు ఆత్మహత్యకు అనారోగ్య సమస్యలే కారణమా.. లేక ఆర్థిక సమస్యలా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఆర్థిక ఇబ్బందులకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకవైపు అప్పులు మరోవైపు కుటుంబంలో ఆస్తిగొడవలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే ఆయన మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అంటున్నారు. ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్‌గా ఉంటూ సుచరితకు గత కొంతకాలం నుంచి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. మృతుడికి భార్య, డిగ్రీ చదివే వయస్సున్న కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరి కుటుంబం నగరంలోని ఏటీ అగ్రహరంలో నివాసం ఉంటోంది.