ఉత్తరప్రదేశ్‌లోని లక్నో విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.20.54 లక్షల విలువైన ఎయిర్ గన్లు, ఉపకరణాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో లక్నో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రయాణికుడిని అరెస్టు చేశారు. ఆ ప్రయాణీకుడు కస్టమ్స్‌కు ఎలాంటి డిక్లరేషన్ లేకుండా గ్రీన్ ఛానల్ గుండా వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు అధికారులు పట్టుకున్నారు.
“అతని లగేజీలో 10 ఎయిర్ గన్స్, టెలీస్కోపిక్ దృశ్యాలు, ఆయుధాలపై మౌంట్ చేయదగినవి. ఇతర ఆయుధాల ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణలో వీటిని తీసుకుని రావడానికి సరైన పత్రాలు లేవని తేలింది” అని అధికారిక ప్రకటనలో ఉంది. ఈ వస్తువులను అధికారులు సీజ్ చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.
ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (ఐజిఐ) విమానాశ్రయంలోని కస్టమ్స్ డిపార్ట్మెంట్ వియత్నాం నుండి వచ్చిన భారతీయ జంటను అరెస్టు చేసి, కనీసం రూ. 22 లక్షల కంటే ఎక్కువ విలువైన 45 తుపాకులను స్వాధీనం చేసుకుంది. ఈ జంట గతంలో రూ.12 లక్షల విలువైన 25 తుపాకులను అక్రమంగా తరలించినట్లు కస్టమ్స్ కమిషనర్ అధికారులు తెలిపారు.