పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం సోమవారం నాడు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. బడ్జెట్ సమావేశాల దృష్ట్యా సజావుగా సభలు సాగేందుకు సహకరించాలని విపక్షాలను కేంద్రం కోరనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్‌లకు ఇప్పటికే ఆహ్వానం పంపారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, వి.మురళీధరన్ హాజరయ్యారు. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్ ఇదేకానుంది.
మంగళవారం పార్లమెంట్ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో మొదలుకానున్నాయి. ప్రసంగం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. బుధవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి.