వర్షాకాల సమావేశాలకు ఏర్పాట్లను పరిశీలించిన స్పీకర్ ఓంబిర్లా.. రఘురామపై కూడా వ్యాఖ్యలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 19 నుంచి ప్రారంభం కానున్నాయని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. జూలై 19 నుంచి ఆగస్టు 13 సమావేశాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. 19 రోజుల పాటూ ఉభయసభల కార్యకలాపాలు జరుగుతాయని చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మొదలై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. సమావేశాల నేపథ్యంలో స్పీకర్ ఓంబిర్లా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి వచ్చే ఎంపీలు, మీడియా ప్రతినిధులు అందరినీ పార్లమెంటు లోపలికి అనుమతిస్తారని స్పీకర్ ఓం బిర్లా స్పష్టంచేశారు. ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్టు తప్పనిసరి కాదని అన్నారు. ఇప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోని వారు మాత్రం వ్యాక్సిన్లు వేయించుకోవాలని ఆయన కోరారు. పార్లమెంట్లో ఇప్పటివరకు మొత్తం 311 మంది ఎంపీలకు వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని ఆయన తెలిపారు. పార్లమెంటు కాంప్లెక్స్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన స్పీకర్ “311 మంది ఎంపీలకు పూర్తిగా టీకాలు వేయించగా.. 23 మంది కొన్ని వైద్య కారణాల వల్ల మొదటి డోస్ తీసుకోలేకపోయారు. అందరు సభ్యులను, మీడియాను కోవిడ్ నిబంధనల ప్రకారం అనుమతించబడతారు. ఆర్టిపిసిఆర్ పరీక్ష తప్పనిసరి కాదు. టీకాలు వేయని వారిని పరీక్ష చేయించుకోవాలని మేము అభ్యర్థిస్తాము” అని స్పీకర్ అన్నారు.
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ కోరుతుండడం పట్ల స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. వైసీపీ దాఖలు చేసిన రఘురామ అనర్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకునేందుకు ప్రక్రియ ఉంటుందని.. నిర్ణయం తీసుకునే ముందు ఇరుపక్షాలతో చర్చిస్తామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించాకే తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. పిటిషన్ పరిశీలన తర్వాత సభాహక్కుల కమిటీకి పంపిస్తామని ఓం బిర్లా వివరించారు. సభలో నిరసన తెలిపేందుకు ఎవరికైనా హక్కు ఉంటుందని.. సభలో ఏదైనా అంశం ప్రస్తావనకు కొన్ని నిబంధనలు పాటించాలని అన్నారు. రఘురామ అనర్హత పిటిషన్ పై రన్నింగ్ కామెంటరీ చేయలేమని తేల్చి చెప్పారు.
కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి పార్లమెంటు మూడు సమావేశాలను కుదించారు. గత సంవత్సరం శీతాకాల సమావేశాలను రద్దు చేయవలసి ఉంది. మహమ్మారి కారణంగా సాధారణంగా జూలైలో ప్రారంభమయ్యే రుతుపవనాల సెషన్ గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే..! పలువురు ఎంపీలకు కరోనా సోకినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. ఫ్లోర్ లీడర్లతో వర్షాకాల సమావేశాలకు ఒక్క రోజు ముందు జులై 18న సమావేశం నిర్వహించనున్నారు.