తోటి జవాన్లపైకి సైనికుడు కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి గుజరాత్ వెళ్లిన జవాను ఈ దారుణానికి తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో బుల్లెట్ తగిలి ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోర్ బందర్ సమీపంలోని తుక్డా గోసా గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
గుజరాత్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పారామిలిటరీ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లలో భాగంగా పోర్ బందర్ చేరుకున్న జవాన్లకు అధికారులు దగ్గర్లోని తుఫాను పునరావాస కేంద్రంలో విడిది ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా శనివారం రాత్రి కొంతమంది జవాన్లు బస్సులో వెళుతున్నారు. ఆ సమయంలో జవాన్ల మధ్య వివాదం మొదలైంది. కానిస్టేబుల్ ఎస్ ఇనౌచాసింగ్ తన ఏకే 47 తో కాల్పులు జరపడంతో ఇద్దరు జవాన్లు తోయిబా సింగ్, జితేంద్ర సింగ్ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు చోరాజిత్, రోహికానా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం వీరిని జామ్ నగర్ లోని ఆసుపత్రికి తరలించారు.