More

  ఇప్పటికే 350కు పైగా తాలిబాన్ల హతం.. పంజా విప్పుతున్న పంజ్ షీర్ దళం

  పంజ్ షీర్.. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ ప్రాంతం గురించి మాట్లాడుకుంటూ ఉంది. తాలిబాన్లు మొత్తం ఆఫ్ఘనిస్తాన్ ను తమ చేతుల్లోకి తీసుకున్నా పంజ్ షీర్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోతున్నారు. బుధవారం నాడు తాలిబాన్లు పంజ్‌షీర్ లోయను సొంతం చేసుకోలేకపోతున్నామని గుర్తించారు. ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకోలేకపోతున్నామనే అంచనాకు వచ్చేయడంతో తాలిబాన్లు అక్కడ తమ ఆయుధాలను విడిచిపెట్టాలని పిలుపునిచ్చారు. తాలిబాన్ వ్యతిరేక దళాలు తీవ్రంగా ఎదురు తిరుగుతూ ఉండడంతో తాలిబాన్లు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. రాజధాని కాబూల్‌కు ఉత్తరాన 80 కిలోమీటర్ల (50 మైళ్ళు) దూరంలో మంచుతో కప్పబడిన శిఖరాలతో కూడిన పర్వత లోయ అయిన పంజ్ షేర్ ను సాయుధ తాలిబాన్ వ్యతిరేక దళాలు రక్షిస్తూ వస్తున్నాయి. తాలిబాన్లకు వ్యతిరేకంగా నిలుస్తూ.. తాలిబాన్ల సొంతమైన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే పనిలో నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ నిమగ్నమై ఉంది.

  పంజ్ షీర్ ప్రాంతాన్ని ఇస్లామిస్ట్ గ్రూపు నుండి కాపాడుతామని నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రతిజ్ఞ చేసింది. చర్చలతో పంజ్‌షీర్ సమస్యను పరిష్కరించడానికి మేము మా వంతు ప్రయత్నం చేసాము … కానీ దురదృష్టవశాత్తు అన్నీ ఫలించలేదని తాలిబాన్ ప్రతినిధి అమీర్ ఖాన్ ముత్తాకీ ట్విట్టర్‌లో తెలిపాడు. “ఇప్పుడు చర్చలు విఫలమయ్యాయి మరియు ముజాహిద్దీన్ (తాలిబాన్) పంజ్‌షీర్‌ను చుట్టుముట్టారు, సమస్యలు శాంతియుతంగా పరిష్కరించబడాలని కోరుకోని వ్యక్తులు ఇంకా లోపల ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడటం మీ ఇష్టం” అని పంజ్‌షీర్ ప్రజలకు తాలిబాన్లు చెబుతున్నారని ట్వీట్ చేసిన ఆడియో మెసేజ్ లో ఉంది.

  ఆఫ్ఘనిస్తాన్ లో అన్నింటినీ స్వాధీనం చేసుకున్న తాలిబాన్లకు పంజ్ షీర్ మాత్రం దక్కడం లేదు. పంజ్ షీర్ ప్రావిన్స్ లోని ఖవక్ లో జరిగిన హోరాహోరీ పోరులో 350 మంది తాలిబాన్లు హతమైనట్టు పంజ్ షీర్ పోరాట దళంలోని నార్తర్న్ అలయన్స్ తెలిపింది. అంతేకాకుండా 40 మందికి పైగా బందీలుగా పట్టుకున్నామని తెలిపింది. వారి నుంచి అనేక అత్యాధునికమైన అమెరికా ఆయుధాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది. కమాండర్ మునీబ్ అమీరి ఆధ్వర్యంలో తిరుగుబాటు చేశామని తెలిపింది. పంజ్ షీర్ ను ఆక్రమించేందుకు తాలిబాన్లు గుల్బహర్ నుంచి దాడులు చేశారు. పంజ్ షీర్ పోరాట దళాలు వాటిని తిప్పికొడుతున్నాయి. గుల్బహర్ లోకి ఎవరూ రాకుండా తాలిబన్లు కంటెయినర్ తో రోడ్డును బ్లాక్ చేశారు. ఇప్పుడు అక్కడ రెండు వర్గాల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న బ్రిటన్ వాసులను తీసుకొచ్చేందుకు తాలిబాన్లతో ఆ దేశం చర్చలను మొదలుపెట్టింది. ఆఫ్ఘన్ శరణార్థులకు చోటు కల్పించేందుకు ‘ఆపరేషన్ వార్మ్ వెల్ కమ్’ను ప్రారంభించింది. ఖతార్ లోని దోహాలో చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది. విదేశీ దళాలు లేకుండా తొలిసారి ఆఫ్ఘన్లు తమ జీవితాన్ని ప్రారంభించారు. డబ్బులకు జనాలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఏటీఎంల ముందు క్యూ కట్టిన వారికి తక్కువ మొత్తంలోనే ఇస్తున్నారు.

  యుఎస్ సైనికులు సోమవారం అర్థరాత్రి కాబూల్ నుండి ఆఫ్ఘనిస్తాన్ ను వదిలి వెళ్లే సమయంలో పంజ్‌షీర్ పై తాలిబాన్లు దాడి చేశారు.”బహుశా వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు” అని పంజ్ షీర్ దళ అధికారి ఫాహిమ్ దష్తి వీడియోలో చెప్పారు. సోమవారం జరిగిన ఘర్షణల్లో ఒకటి లేదా ఇద్దరు రెసిస్టెన్స్ ఫైటర్లతో పాటు ఏడుగురు లేదా ఎనిమిది మంది తాలిబాన్ యోధులు మరణించారని పంజ్ షీర్ యోధులు తెలిపారు.

  లోయ భౌగోళిక స్వరూపం కారణంగా పంజ్ షీర్ ను సొంతం చేసుకోవాలంటేనే తాలిబాన్లు జంకుతున్నారు. సహజ సైనిక ప్రయోజనాన్ని కలిగి ఉండడమే కాకుండా.. డిఫెండింగ్ యూనిట్లు సమర్థవంతంగా దాడి చేసే దళాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉన్నత స్థానాలను ఉపయోగించవచ్చు. పంజ్‌షీర్ యోధులు బల ప్రదర్శనలో సైనిక శిక్షణను నిర్వహించారు. పురుషులు తమ భుజాలపై భారీ దుంగలను ఛాతీ-లోతైన మంచు నదులను దాటుతున్న వీడియోలను విడుదల చేశారు. వారి సాయుధ వాహనాల పైన, వారి స్థావరాలపై వారి జెండా రెపరెపలాడింది. తాలిబాన్ యొక్క పాలన పునరావృతం కావడంతో చాలా మంది ఆఫ్ఘన్ ప్రజలు భయపడుతున్నారు. బాలికలు, మహిళల పట్ల వారి ప్రవర్తన ఇప్పటికే కలవరపెడుతూ ఉంది. పంజ్ షీర్ లోయతో కమ్యూనికేషన్లు కష్టంగా ఉన్నాయి. తాలిబాన్ బలగాలు మూడు వైపులా ఉన్నాయి. ఇటీవలి రోజుల్లో పంజ్‌షీర్‌లో ఇంటర్నెట్ పదేపదే ఆన్ మరియు ఆఫ్ చేయబడింది.

  Related Stories