2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన ఆనాటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ .. క్యాపిటల్ హిల్‌పై దాడికి పన్నాగం వేసినట్లు అమెరికా ప్రజాప్రతినిధుల ప్యానెల్ తన విచారణలో తెలిపింది. 2021, జనవరి ఆరో తేదీన క్యాపిటల్ హిల్‌పై నిరసనకారులు దాడి చేసి విధ్వంసానికి పాల్పడ్డారు.
క్యాపిటల్ హిల్ వద్దకు వేల సంఖ్యలో జనాన్ని సమీకరించింది ట్రంపే అన్న అభిప్రాయాన్ని ప్యానల్ తన విచారణలో వ్యక్తం చేసింది. ఇక క్యాపిటల్ హిల్‌పై దాడికి విద్వేష ప్రసంగంతో అభిమానుల్ని ఉసిగొల్పినట్లు కూడా ప్యానల్ విచారణలో వెల్లడైంది. క్యాపిటల్ హిల్ దాడికి ఆజ్యం పోసింది ట్రంపే అని కమిటీ వైస్ చైర్మెన్ రిపబ్లికన్ నేత లిజ్ చెనాయ్ అన్నారు. క్యాపిటల్ హిల్ అల్లర్లు అమెరికా ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసినట్లు డెమోక్రాట్ బెన్నీ థాంప్సన్ తెలిపారు.
నిజానికి ట్రంప్, బైడెన్ మధ్య జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలు ఉత్కంఠ రేపాయి. అయితే ఓటమి తట్టుకోలేని ట్రంప్ తన మద్దతుదారుల్ని రెచ్చగొట్టినట్లు కమిటీ తెలిపింది. ఏడాది పాటు జరిగిన దర్యాప్తు వివరాలను హౌజ్ కమిటీ గురువారం విచారణలో వెల్లడించింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు ట్రంప్ చేసిన ఆరోపణలు నిరాధారమని అమెరికా అటార్నీ జనరల్ బిల్ బ్రార్ చెప్పిన వీడియోను కూడా కమిటీ రిలీజ్ చేసింది. అటార్నీ జనరల్ ఇచ్చిన నివేదికను ట్రంప్ కుమార్తె ఇవాంకా కూడా ఆమోదించినట్లు ప్యానల్ తన విచారణలో తెలిపింది. ప్యానెల్ విచారణను ఓ రాజకీయ బెదిరింపుగా ట్రంప్ ఆరోపించారు. 2024లోనూ అధ్యక్ష పదవికి బరిలోకి దిగనున్నట్లు ట్రంప్ చెప్పారు.