National

పండోరా పేపర్స్ పై కీలక నిర్ణయం తీసుకున్న మోదీ సర్కార్

దేశంలో తాజాగా ‘పండోరా పేపర్స్’ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ‘పండోరా పేపర్స్’ పేరుతో సంపన్నులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖుల ఆస్తులు, ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన రహస్య పత్రాలను ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసీఐజే) బహిర్గతం చేసింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల పేర్లతో పాటు దేశంలోని ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 115 దేశాలు, 150 మీడియా సంస్థలు, 6 వందలమంది జర్నలిస్టుల నుంచి సమగ్ర దర్యాప్తు అనంతరం ఈ వివరాల్ని వెలువరించింది ఐసీఐజే సంస్థ. ధనవంతుల కంపెనీలు, ట్రస్టులకు సంబంధించి 12 మిలియన్ల పత్రాల్ని సేకరించినట్టు సంస్థ తెలిపింది.

పండోరా పేపర్స్‌లో ఉన్న పేర్లలో 300పైగా పేర్లు భారతీయులవే అనే కథనాలు మనదేశంలో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. పండోరా పేపర్స్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ డేటాపై భారత ప్రభుత్వం దర్యాప్తు చేయనున్నట్లు తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సేషన్ (సీబీడీటీ) నేతృత్వంలో ఈ పత్రాల్లోని అంశాలపై దర్యాప్తు చేయనున్నట్లు ప్రకటించింది. బహుళ ఏజెన్సీల బృందాలతో విచారణ జరపనున్నాయి. జాబితాలోని అతికొద్ది మంది పేర్లు మాత్రమే బయటకు వస్తున్నాయని, అసలు ఈ పత్రాలను విడుదల చేసిన ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) వెబ్‌సైటులో కూడా పూర్తి వివరాలు లేవని సీబీడీటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పత్రాలపై దర్యాప్తు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

Related Articles

Back to top button