ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చింది. 23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి, 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి.
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వందశాతం ఓటింగ్ నమోదయింది. ఒక్కో అభ్యర్థి విజయానికి 22 ఓట్లు కావాలి. మొదటి ప్రాధాన్యత ఓట్లు ముందుగా లెక్కిస్తున్నారు. అవసరమైతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఏడు స్థానాల్లోనూ గెలుస్తామని ఫలితాలు రాకముందు వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. కానీ ఫలితాల్లో మాత్రం టీడీపీకి చెందిన అభ్యర్థి విజయం సాధించారు. ఓ అభ్యర్థి గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు ఓటేయాలి. వైసీపీ సొంత బలం 151 ఉండగా.. టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతిస్తుండడంతో బలం 155కు చేరింది. వైసీపీకి చెందిన కొందరు మాత్రం క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు.