National

అమెజాన్ ఒక ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’: పాంచజన్య

ప్రముఖ జాతీయవాద హిందీ వారపత్రిక పాంచజన్యలో ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్ ను ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చారు. అమెజాన్‌ సంస్థ ‘ఈస్ట్‌ ఇండియా కంపెనీ 2.0’లా తయారైందంటూ పాంచజన్య లో కవర్‌ స్టోరీని ప్రచురించింది. 18వ శతాబ్దంలో భారత్‌ను ఆక్రమించుకోవడానికి ఈస్ట్‌ ఇండియా కంపెనీ చేసిన పనులనే ఇప్పుడు అమెజాన్‌ కూడా చేస్తోందని పాంచజన్యలో తీవ్ర విమర్శలు చేసింది. ప్రభుత్వ విధానాలను కంపెనీకి అనుకూలంగా మార్చుకోవడానికి అమెజాన్‌ కోట్లాది రూపాయల ముడుపులు చెల్లించిందని సంచలన ఆరోపణలు చేసింది పాంచజన్య . ఈ సంచిక అక్టోబరు 3న మార్కెట్లోకి విడుదల కానుంది. దేశంలో పాగా వేసి దేశీయ కంపెనీల‌ను దెబ్బ‌కొట్టాల‌ని, దేశంలో గుత్తాధిప‌త్యం సంపాదించాల‌ని అమెజాన్ చూస్తోంద‌ని విమర్శలు గుప్పించింది పాంచజన్య.

భారత మార్కెటుపై ఏకఛత్రాధిపత్యం కోసం ప్రయత్నాల్లో భాగంగా అమెజాన్ మన పౌరుల వ్యక్తిగత, అర్థిక, రాజకీయ స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నట్లు పాంచజన్య ఆందోళన వ్యక్తం చేసింది. అమెజాన్ యొక్క వీడియో ప్లాట్‌ఫామ్ అయిన ప్రైమ్ వీడియోపై కూడా తీవ్ర విమర్శలు చేసింది. భారతీయ సంస్కృతికి విరుద్ధంగా సినిమాలు మరియు టెలివిజన్ సిరీస్‌లను అమెజాన్ విడుదల చేస్తున్నట్లు పాంచజన్యలో ఆరోపిస్తోంది. ఇప్పటికే ప్రైమ్ వీడియోలో వచ్చిన సినిమాలు, సిరీస్ లపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ విషయాన్నే పాంచజన్యలో ప్రస్తావించారు. అమెజాన్ అనేక ప్రాక్సీ సంస్థలను స్థాపించిందని తనకు అనుకూలంగా ఉన్న పాలసీల కోసం కోట్ల లంచాలను పంపిణీ చేసినట్లు నివేదికలు ఉన్నాయని కూడా ఆరోపించింది.

గ‌త మూడేళ్ల‌లో అమెజాన్ రూ.8500 కోట్ల మేర లీగ‌ల్ ఖ‌ర్చులు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వచ్చాయి. త‌మ‌కు అనుకూల‌మైన విధానాల కోసం అమెజాన్ ప్ర‌భుత్వ అధికారుల‌కు కోట్ల‌లో లంచాలు చెల్లించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఇప్పటికే అమెరికా హెడ్ క్వార్టర్ కంపెనీ అమెజాన్ అంత‌ర్గ‌తంగా విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ విషయంలో అమెజాన్ ప్రమేయంపై ప్రత్యేకించి పూర్తిస్థాయిలో విచారణ జరుగనున్నట్టు కేంద్రం గతవారమే పేర్కొంది. ఈ నేపథ్యంలో కంపెనీ సీనియర్ కార్పొరేట్ కౌన్సిల్ ను సెలవుపై పంపినట్టు తెలుస్తోంది. ఫ్యూచర్ గ్రూప్ స్వాధీనం విషయంలో అమెజాన్ వివాదంలో చిక్కుకుంది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) విచారణను కూడా ఎదుర్కొంటోంది. స్వదేశీ జాగరణ్ మంచ్ కూడా ఈ కామర్స్ సైట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాపారుల ప్రయోజనాలకు హాని కలిగించే చట్టాలను అధిగమించి, అనైతిక వ్యాపార పద్ధతులకు పాల్పడుతున్నందుకు అమెజాన్ వంటి ఈ-కామర్స్ ప్లేయర్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

13 − 8 =

Back to top button