పాకిస్థాన్ కు చెందిన ఓ మహిళను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. ఆ మహిళను 33 సంవత్సరాల ఖదీజా మెహ్రీన్ గా గుర్తించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మొహిద్దీన్ రుక్కుద్దీన్ ను 2014 లో దుబాయ్ లో పెళ్లి చేసుకుందట. ఆ తర్వాత 2015లో భారత్ కు వచ్చేసింది. ఇక్కడే ఉంటోంది. 2015 నుండి ఉత్తర కన్నడ జిల్లాలోని భత్కల్ లో తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి అక్రమంగా ఉంటున్న పాకిస్తాన్ జాతీయురాని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమెను జుడీషియల్ కస్టడీకి తరలించారు.
ఉత్తర కన్నడ పోలీసు సూపరింటెండెంట్ శివప్రకాష్ దేవరాజు ఆమె అరెస్టును ధ్రువీకరించారు. “ఆమె అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి భత్కల్ లోని నయాయత్ కాలనీలో తన భర్తతో కలిసి ఉంటోంది. దుబాయ్‌లో మొహిద్దీన్ రుక్కుద్దీన్‌తో వివాహం తరువాత, ఖదీజా 2015 లో అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించారు. ఆమె 2015 లో మూడు నెలలు భారతదేశానికి పర్యాటక వీసాపై వచ్చి.. చట్టవిరుద్ధంగా ఉండిపోయింది. ఆమె ఇక్కడ ఉన్న సమయంలో, ఆమె ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిందని ” శివప్రకాష్ దేవరాజు తెలిపారు.
నకిలీ పత్రాలతో ఖదీజా మెహ్రీన్ భారత్ లో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు వంటివాటిని కూడా పొందారని పోలీసులు తెలిపారు. ఇలా పాకిస్తాన్ కు చెందిన మహిళ ఆ ప్రాంతంలో ఉంటోందనే సమాచారం నేపథ్యంలో పోలీసులు మహిళను అరెస్టు చేశారు. విదేశీయుల చట్టం, 1946 లోని నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు శివప్రకాష్ దేవరాజు తెలిపారు.