పాకిస్తాన్‌ను ‘గ్రే లిస్ట్’ నుంచి బయటకు తీసేయడానికి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఎటిఎఫ్) నిరాకరించింది. ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చేయడంలో పాకిస్తాన్ మరోసారి విఫలమైందని ఎఫ్‌ఎటిఎఫ్ వెల్లడించింది. పాకిస్తాన్ ను మరోసారి అత్యధిక నిఘా ఉండే దేశాలతో కూడిన గ్రే లిస్టులోనే కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. 26/11 నిందితులు హఫీజ్ సయీద్, జెఎమ్ చీఫ్ మసూద్ అజార్ వంటి యుఎన్ గుర్తించిన ఉగ్రవాదులపై తగిన చర్యలు తీసుకోవడంలో పాకిస్తాన్ విఫలమైందని శుక్రవారం నాడు తెలిపింది. గ్లోబల్ మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ బాడీ పాకిస్తాన్ సాధించిన కొంత పురోగతిని గుర్తించినప్పటికీ.. పాక్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ముఖ్యమైన లోపాలను పరిష్కరించడానికి కృషి కొనసాగించాలని తెలిపింది. పారిస్ లో ఎఫ్ఏటీఎఫ్ సమావేశాలు ముగిశాయి. ఉగ్రవాద చర్యలకు నిధులను నియంత్రించడంలో పాక్ మరోసారి విఫలమైందని టాస్క్ ఫోర్స్ గుర్తించింది.
మునుపటితో పోల్చితే పాక్ తీరు గణనీయంగా మెరుగైందని వివరించింది. 27 అంశాలకు గాను 26 అంశాల్లో పాక్ తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగానే ఉన్నట్టు ఎఫ్‌ఎటిఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ మార్కస్ ప్లీయర్ తెలిపారు. గత మూడేళ్లుగా పాక్ గ్రే జాబితాలో ఉంటోంది. ఈ జాబితాలో ఉన్న దేశాలకు అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు తీసుకునే వీలుండదు. ఈ జాబితా నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పాకిస్తాన్ కు వరుసగా భంగపాటు ఎదురవుతూనే ఉంది.
పారిస్‌కు చెందిన ఈ సంస్థ వర్చువల్ ప్లీనరీ ముగింపులో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్‌ఎటిఎఫ్ అధ్యక్షుడు మార్కస్ ప్లీయర్ తెలిపారు. పాకిస్తాన్ పెరిగిన పర్యవేక్షణ జాబితాలో కొనసాగుతోందని అన్నారు. “పెరిగిన పర్యవేక్షణ జాబితా” అనేది గ్రే జాబితాకు మరొక పేరు మాత్రమే..! 2018 లో ఇచ్చిన 27 యాక్షన్ ఐటెమ్‌లలో 26 ని పాకిస్తాన్ పూర్తి చేసిందని.. ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని ఎఫ్‌ఎటిఎఫ్ పాకిస్థాన్‌ను కోరిందని ప్లీయర్ చెప్పారు.
పాకిస్తాన్ కేంద్రంగా జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ అజార్, లష్కర్-ఎ-తైబా వ్యవస్థాపకుడు సయీద్, దాని “కార్యాచరణ కమాండర్” జాకియూర్ రెహ్మాన్ లఖ్వీ జీవిస్తూ ఉన్నారు. ఈ ముగ్గురూ అనేక ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారు. భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు. ఎంతో మంది తీవ్ర వాదులకు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తూనే ఉంది. వారిని జైలులో పెడుతున్నట్లు పాకిస్తాన్ కలరింగ్ ఇస్తున్నా కూడా.. అక్కడి నుండే అన్ని కార్యకలాపాలు జరుగుతున్నాయన్నది ఇంటెలిజెన్స్ సమాచారం. ఓ వైపు పాకిస్తాన్ ఆర్థికంగా కూడా చితికిపోతూ ఉంది. ఎలాగైనా నిధులు రావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా గ్రే లిస్టులోనే పాకిస్తాన్ కొనసాగుతూ ఉండడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎఫెక్ట్ చూపనుంది.