ఉగ్రవాద దేశానికి కష్టాలు ఎక్కువ అయ్యాయి. ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. రానురాను ఆ దేశ మరింత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతోంది.
దేశంలోని విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో పాటు విపరీతమైన అప్పుల కారణంగా పాకిస్తాన్, మరో శ్రీలంకగా మారబోతోంది. శ్రీలంక పరిస్థితి రావడం ఖాయం కానీ.. ఎన్ని రోజుల్లో అనేదే తేలాలి. పాకిస్తాన్ ఈ ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకోవడానికి ఐఎంఎఫ్ సాయం కోరుతోంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ లో విద్యుత్ సంక్షోభం నెలకొంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్రమైన విద్యుత్ కోతలు నెలకొన్నాయి. విద్యుత్ ఉత్పత్తి కోసం పాక్ ఎక్కువగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ పై ఆధారపడింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ ఎల్‌ఎన్‌జిని కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇంధన వనరులను ఆదా చేసేందుకు పాకిస్తాన్ విపరీతమైన కోతలు విధిస్తోంది.
ఇప్పటికే కరెంట్ ను ఆదా చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు పనిగంటలను తగ్గించింది, కరాచీతో పాటు ఇతర నగరాల్లో షాపింగ్ మాల్స్, కర్మాగారాలు త్వరగా మూసివేయాలని ఆదేశించింది. మార్కెట్లు సాయంత్రం వరకే తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. బంకుల్లో పెట్రోల్ లేక, ఏటీఎంలలో డబ్బులు లేక అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు రాత్రి 8గంటలకే వ్యాపార సముదాయాలు మూసి వేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే రాత్రి 10 దాటితే పెళ్లి వేడుకలు నిర్వహించకూడదని ఆంక్షలు విధించింది. ఇక అక్కడి ప్రజలు చాయ్ తాగడం తగ్గించాలని ఏకంగా ఓ మంత్రి కోరాడంటే అక్కడి పరిస్థితి అర్ధం చేస్తోవచ్చు.
తీవ్రమైన కరెంట్ సంక్షోభాన్ని ఎదురుకొంటున్న పాకిస్తాన్ కు అక్కడి టెలికాం ఆపరేటర్లు వార్నింగ్ ఇచ్చారు. ఎక్కువ గంటలు విద్యుత్ అంతరాయం కారణంగా మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తామని.. అంతరాయం కారణంగా మొబైల్ నెట్వర్క్ కార్యకలాపాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డ్ ట్విట్టర్ లో వెల్లడించింది. పాక్ దేశ ఆవిర్భావం తర్వాత ఈ స్థాయిలో విద్యుత్ కోతలు ఎదుర్కొవడం ఇదే ప్రథమం. ఇక విద్యుత్ సంక్షోభం మునుముందు మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రధాని షెహబాబ్ షరీఫ్ ముందస్తు ప్రకటనలు చేయడం గమనార్హం. ఎల్‌ఎన్‌జీ సరఫరా ఇబ్బందికరంగా మారిందని, అయితే ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు. మరోవైపు మునుపెన్నడూ లేని విధంగా జూన్ నెలలో.. నాలుగు ఏళ్ల తర్వాత అధికంగా చమురు ఇంధనాలను పాక్ దిగుమతి చేసుకుంది. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో సహజవాయువు విషయంలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఇంధన సంక్షోభాన్ని అధిగమించేందుకు ఖతార్ తో పాక్ చర్చలు జరుపుతోంది. ఇంధనాన్ని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ పెట్రోలియం మంత్రి ముసాదిక్ మాలిక్, ఖతార్ ఇంధన వ్యవహారాల సహాయ మంత్రి, ఖతార్ ఎనర్జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సాద్ అల్-కాబీతో దోహాలో భేటీ అయ్యారు. పాకిస్తాన్ ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు వేగంగా క్షీణించాయి. ద్రవ్యోల్భణం పెరిగింది. జూన్ లో పాకిస్తాన్ లో రెండంకెల ద్రవ్యోల్భణం నమోదు అయింది. అయితే ఈ పరిస్థితి కారణం మీరంటే మీరంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పించుకోవడం కొసమెరుపు.