More

  మనం మనం క్రికెట్ ఆడుకుందాం: పాక్ ను కోరిన తాలిబాన్లు

  పాకిస్తాన్ లో క్రికెట్ ఆడటానికి ఏ దేశం కూడా ముందుకు రావడం లేదన్నది అందరికీ తెలిసిన విషయమే..! న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఆఖరి నిమిషంలో సెక్యూరిటీ ఇబ్బందులను సాకుగా చూపించి స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయింది. ఇక ఇంగ్లండ్ జట్టు కూడా సిరీస్ కోసం రామని తేల్చి చెప్పేసింది. ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సోమవారం నాడు పాకిస్తాన్ పర్యటన నుండి పురుషులు మరియు మహిళలు, జట్లు రెండింటినీ ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకునట్లు తెలిపింది. ఇటీవలే 18 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్‌లో అడుగుపెట్టింది. కానీ ఒక్క మ్యాచ్ ను కూడా ఆడకుండానే భద్రతా సమస్యలను చూపించి వెనుదిరిగింది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇటీవలే సమావేశం నిర్వహించింది. పాకిస్తాన్‌కు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది. కివీస్ పర్యటన రద్దు అయిన మూడు రోజుల తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సోమవారం ఈ నిర్ణయం ప్రకటించింది. ఇంగ్లండ్ జట్లు అక్టోబర్ 13, 14 తేదీలలో రావల్పిండిలో రెండు ట్వంటీ 20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మహిళల జట్టు అక్టోబర్ 17-21 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఇవేవీ పాక్ లో నిర్వహించడం లేదు.

  ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ కు తాలిబాన్లు తామున్నామని చెబుతున్నారు. అఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఛైర్మన్ అజీజుల్లా ఫజ్లీ సెప్టెంబర్ 25 న పాకిస్తాన్ కు వెళ్లనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ కోసం వారిని ఆహ్వానించడానికి పాకిస్తాన్ సందర్శిస్తానని చెప్పాడు. ఇటీవలి కాలంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో ఎదగగలిగింది. ప్రపంచంలోని అగ్రశ్రేణి స్పిన్నర్ రషీద్ ఖాన్‌తో సహా జట్టులో కొంతమంది మంచి ఆటగాళ్లు ఉన్నారు. తాలిబాన్ దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి, పురుషుల క్రికెట్ జట్టును కూడా బహిష్కరించాలని పిలుపులు వచ్చాయి. అయితే మగవాళ్ల క్రికెట్ కు అండగా ఉంటామని తాలిబాన్లు హామీ ఇచ్చారు. అయితే తాలిబాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ను నియంత్రిస్తున్నందున, వారు మహిళా జట్టును రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిబంధనల ప్రకారం అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌లలో పాల్గొనదలచిన దేశాలు తప్పనిసరిగా.. మహిళా జట్టును కలిగి ఉండాలి. మహిళలు క్రీడలు ఆడటానికి అనుమతించమని తాలిబాన్లు ఇప్పటికే తమ విధానాన్ని ప్రకటించారు.

  ఆసక్తికరంగా కొత్తగా నియమించబడిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఛైర్మన్ పలు దేశాల క్రికెట్ బోర్డులను కలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. భారతదేశం సహా ఇతర దేశాలను సందర్శించాలనుకుంటున్నానని తెలిపాడు. “నేను సెప్టెంబర్ 25 నుండి పాకిస్థాన్ పర్యటనలో ఉంటాను. ఆ తర్వాత క్రికెట్ బోర్డ్ అధికారులను కలవడానికి ఇండియా, బంగ్లాదేశ్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్తాను.” అని స్పష్టం చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు సెప్టెంబర్‌లో పాకిస్థాన్‌తో శ్రీలంకలో సిరీస్ ఆడాల్సి ఉన్నా అది జరగలేదు. “నేను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజాను కలుస్తానని మేము శ్రీలంకలో సెప్టెంబర్‌లో ఆడాల్సిన సిరీస్ కోసం పాకిస్తాన్‌కు ఆతిథ్యం ఇస్తామని ఆఫర్ చేయనున్నానని” అని ఫజ్లీ చెప్పాడు. శ్రీలంకలో కోవిడ్ -19 వ్యాప్తి, లాజిస్టికల్ సమస్యల కారణంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ రద్దు చేయబడింది.”మేము ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌ను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాము అందుకు ఇతర దేశాల సహకారం అవసరం.” అని అతడు వెల్లడించాడు. అజీజుల్లా ఫజ్లీ పర్యటనను పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా కూడా ధృవీకరించారు. అజీజుల్లా ఫజ్లీ సెప్టెంబర్ 2018, జూలై 2019 మధ్య ఒకసారి బోర్డుకు ఛైర్మన్‌గా పనిచేశారు. ఏది ఏమైనా అటు పాకిస్తాన్ క్రికెట్ కు ఇప్పుడు తాలిబాన్లు తాము అండగా ఉంటామని.. మ్యాచ్ లు ఆడతామని హామీ ఇస్తున్నారు.

  మహిళలు క్రికెట్ ఆడటానికి అనుమతించకూడదనే తాలిబాన్ నిర్ణయానికి వ్యతిరేకంగా కఠిన వైఖరిని అవలంబించనుంది ఆస్ట్రేలియా. నవంబర్‌లో బ్రిస్బేన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగాల్సిన టెస్ట్ మ్యాచ్‌ను రద్దు చేస్తామని ఆస్ట్రేలియా హెచ్చరించింది. ఆడవారికి క్రికెట్ ఆడే స్వేచ్ఛను కల్పిస్తేనే ఆఫ్ఘనిస్తాన్ తో మగవాళ్లకు కూడా మ్యాచ్ ఆడే అవకాశం కల్పిస్తామని ఆస్ట్రేలియా తేల్చి చెప్పింది.

  Related Stories