More

    పాక్ లో ప్రతిపక్ష నాయకుడిపై రాకెట్ బాంబు.. అతిఫ్ మున్సిఫ్ ఖాన్ సహా ఏడుగురు మృతి..!

    పాకిస్తాన్ లో పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా మారాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య ఘర్షణలు మరింత ముదిరాయి. ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. వారిని ఇమ్రాన్ మద్దతుదారులు అడ్డుకోవటంతో ఆ దేశంలో శాంతి భద్రతలు మరింత క్షిణించాయి. ఐతే పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా నుంచి పెద్ద వార్త బయటకు వచ్చింది. ఇక్కడ జరిగిన బాంబు దాడిలో ఒక పీటీఐ నాయకుడు మరణించాడు. అతనితో పాటు మరో 7 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. పీటీఐ నాయకుడు అతిఫ్ మున్సిఫ్ ఖాన్, మరో 7 మంది ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని దుండగులు బాంబు దాడి చేశారు.

    వాహనాన్ని టార్గెట్‌గా చేసుకుని రాకెట్ బాంబ్‌ని వదిలేశారు. దీంతో వాహనం మంటల్లో కాలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. అందులో వాహనం పొగలో కాలిపోతున్నట్లు ఉంది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని అబోటాబాద్ జిల్లా హవేలియన్‌లో ఈ దాడి జరిగినట్లు సమాచారం. మరోవైపు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కు అక్కడి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై ఉగ్రవాద అభియోగాలతో కేసు నమోదైంది. పాకిస్తాన్ పోలీసులు ఈ కేసు ఫైల్ చేశారు. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు మరో డజను పీటీఐ నేతలపై కేసు నమోదైంది. అంతకుముందు జ్యుడీషియల్ కాంప్లెక్స్‌లో జరిగిన విధ్వంసం కారణంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

    ఐతే తోషఖానా కేసులో విచారణకు ఇమ్రాన్ ఖాన్ లాహోర్ నుంచి ఇస్లామాబాద్‌కు వచ్చారు. ఈ విచారణను అడ్డుకోవడానికి పీటీఐ నేతలు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన ఇస్లామాబాద్ జ్యుడీషియల్ కాంప్లెక్స్‌కు వెళ్లుతుండగా ఈ ఆందోళనలు తీవ్రంగా జరిగాయి. జ్యుడీషియల్ కాంప్లెక్స్‌ వద్ద భారీగా ఆందోళనలు చేపట్టారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పలు చోట్ల పోలీసులు గాల్లోకి కాల్పులు సైతం జరిపారు.

    ఈ కేసు విచారణ సందర్భంగా పీటీఐ నేతలు, కార్యకర్తలను అదుపులో పెట్టడానికి పాకిస్తాన్ పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆందోళనకారులను అదుపులో పెట్టడానికి పోలీసులు ప్రయత్నించగా చోటు చేసుకున్న ఘర్షణల్లో 25 మంది రక్షణ సిబ్బంది గాయపడ్డారు. దీంతో ఈ కేసు విచారణను అదనపు జిల్లా, సెషన్స్ జడ్జీ జాఫర్ ఇక్బాల్ మార్చి 30వ తేదీ వరకు వాయిదా వేశారు. ఇక ఈ అల్లర్లు ఒక్క లాహోర్ కే పరిమితం కాలేదు. ఇతర నగరాలకు సైతం విస్తరించాయి.

    ఈ అల్లర్లు, విధ్వంసం చేసిన వారిపై పోలీసులు కేసు పెట్టారు. పీటీఐ వర్కర్లు, వాంటెడ్ నేతలపై ఇస్లామాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు 17 మంది పీటీఐ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. ఈ విధ్వంసంపై పెట్టిన కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా ఆయన పార్టీ పీటీఐ నేతలు, వర్కర్లపైనా ఉగ్రవాద అభియోగాలను పోలీసులు మోపారు.

    Trending Stories

    Related Stories