More

  ఆకలి కేకలు.. కరెంటు కోతలు.. చితికిపోతున్న శత్రు దేశం..!

  శత్రు దేశం చితికి పోతోంది. మరో శ్రీలంకను తలపిస్తోంది. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. చాలా కాలంగా జీతాలు ఇవ్వకుండా నెట్టుకొస్తోంది. కొన్ని నెలలుగా జీతాల కోసం చూస్తున్న రైల్వే ఉద్యోగులు ఇప్పుడు ఆందోళనలకు దిగారు. పాకిస్థాన్.. భారత్‌ నుండి వేరే దేశంగా మారి.. ఉగ్రవాదుల ఉచ్చులో చిక్కి.. ఆర్థికంగా నరకం చూస్తోంది. ఆకలి కేకలే కాదు.. అక్కడ ఏమీ లేదు. తాజాగా కరెంటు కోతలు కూడా మొదలయ్యాయి. ఇదివరకు ఎప్పుడూ చూడనంత దారుణ ఆర్థిక ఇబ్బందుల్ని చూస్తోంది పాకిస్థాన్. చైనా కూడా ఆదుకోకుండా చేతులెత్తేసింది. ఇలా అన్ని రకాలుగా సమస్యలు చుట్టుముట్టాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ దేశం దివాలా అంచుల్లో ఉంది.

  శ్రీలంకలో సమస్యల్ని చూసి ప్రపంచం మొత్తం చలించిపోయింది. ఇప్పుడు ఆ లిస్టులో పాకిస్థాన్ కూడా చేరింది. ఆ దేశంలో అన్నీ సమస్యలే ఉన్నాయి. ముఖ్యంగా రైల్వేల పరిస్థితి దారుణంగా ఉంది. డీజిల్ కొనేందుకు కూడా రైల్వేల వద్ద డబ్బు లేదు. దీంతో రైళ్లు సక్రమంగా నడవడం లేదు. పాకిస్తాన్ రైల్వే శాఖకు చెందిన రైలు డ్రైవర్లు గత నెలలో తమకు జీతం రాకపోవడంతో దేశవ్యాప్తంగా నిరసన, సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత రైలు రాకపోకలు నిలిచిపోయాయి. చాలా నగరాల్లో రైల్వే ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఒకవైపు ప్రజలకు జీతాలు అందడం లేదు. మరోవైపు పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం కూడా అన్ని రికార్డులనూ బద్దలు కొట్టింది. అన్నింటి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం పిండి, చక్కెర, నెయ్యి ధరలను 25 నుండి 62 శాతం పెంచినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.

  ఏడాది కాలంలో పదవీ విరమణ పొందిన చాలా మంది అధికారులు, ఉద్యోగులకు గ్రాట్యుటీ రూపంలో సుమారు 25 వేల కోట్ల రూపాయల అప్పులను తిరిగి చెల్లించేందుకు ఆయా శాఖల వద్ద డబ్బు లేని పరిస్థితి ఉందని మీడియా కథనాలు చెబుతున్నాయి. దీంతో పాటు ఉద్యోగులకు నెలవారీ జీతం, రిటైర్డ్‌ అధికారుల పెన్షన్‌ కూడా ఇవ్వడం లేదు.

  ఇక చైనా నుంచి కొత్త కోచ్‌లు వచ్చినప్పటికీ, ప్యాసింజర్ రైలు కార్యకలాపాలలో సుమారు రూ. 20 నుండి 25 బిలియన్ల కొరత ఉంది. గతంలో సింధ్, బలూచిస్థాన్‌లలో వరదలు రావడంతో రైళ్ల రాకపోకలు దెబ్బతిన్నాయి. దీంతో ఆదాయం తగ్గిపోయింది. దీని తర్వాత రైల్వే ఉద్యోగుల నిరసనలు పాకిస్థాన్ వెన్ను విరిచాయి. గత వారం పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ కూడా నాసిరకం ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం, ఆహార కొరత, ఆర్థిక వినాశనానికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్, హైస్‌పూర్, ఒకారా, కసూర్ ఇతర నగరాల్లో నిరసన వ్యక్తం చేసింది. గిల్గిత్ బాల్టిస్థాన్‌లోనూ ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై నిరసన తెలిపారు.

  ఐతే ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు, ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాక్ ప్రజలకు మరో కష్టం వచ్చిపడింది. నేషనల్ గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అంధకారంలోనే గడిపారు. హోటళ్లు, రెస్టారెంట్లు దీపాల వెలుగులోనే నడిచాయి. సాధారణ పౌరులు ఇళ్లలో కొవ్వత్తులు వెలిగించుకొని జీవనం సాగించారు. నేషనల్ గ్రిడ్‌లో ఫ్రీక్వెన్సీ పడిపోడవంతో సోమవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీన్ని పునరుద్ధరించేందుకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే ఎట్టకేలకు ఇస్లామాబాద్, గుజ్రావాలా ప్రాంతాల్లో మాత్రం విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. మిగతా నగరాల్లో కూడా పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

  కానీ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌లో కరెంటు కోతలు సర్వసాధరణమైపోయాయి. హాస్పిటళ్లు, ఫ్యాక్టరీలు, ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు జనరేటర్ల సాయంతో నడుస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పాఠశాలల్లో కూడా వెలుతురు లేకుండానే పాఠాలు బోధిస్త్నున్నారు. కొన్ని చోట్ల బ్యాటరీతో నడిచే లైట్లను ఉపయోగిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సందర్భాలు మాత్రం చాలా తక్కువే. గతంలో 2021లో గ్రిడ్ ఫెయిల్యూర్‌ కారణంగా పాక్ మొత్తం విద్యుత్‌ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు మరోసారి ఇదే కారణంతో దేశం మొత్తం అంధకారంలోకి వెళ్లింది. కానీ ఈ సారి కోలుకునే పరిస్థితులు అక్కడ లేవు.

  Trending Stories

  Related Stories