పంజాబ్ క్యాబినెట్ లో సిద్ధూ ఉండాలని.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బలంగా కోరుకున్నారు

0
972

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూను రాష్ట్ర మంత్రివర్గం నుండి తొలగించిన తర్వాత తిరిగి రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనను అభ్యర్థించారని బాంబు పేల్చారు. తనకు పాకిస్తాన్ నుండి సమాచారం అందిందని.. ఇమ్రాన్ ఖాన్‌తో నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంచుకున్న పాత స్నేహాన్ని ఉటంకిస్తూ, అతన్ని రాష్ట్ర మంత్రివర్గంలో తిరిగి నియమించాలని కోరినట్లు అమరీందర్ సింగ్ చెప్పుకొచ్చారు. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ విషయాన్ని అమరీందర్ సింగ్ బయట పెట్టారు.

“నేను నా ప్రభుత్వం నుండి నవజ్యోత్ సిద్ధూను తొలగించిన తర్వాత.. సిద్ధూ తమ ప్రధానమంత్రికి పాత స్నేహితుడని, మీరు అతనిని ప్రభుత్వంలో ఉంచగలిగితే చాలా మంచిదని పాకిస్తాన్ నుండి నాకు సందేశం వచ్చింది. అతను (సిద్ధూ) పని చేయకపోతే, మీరు అతనిని తొలగించవచ్చు” అని అప్పట్లో తనకు మెసేజీ వచ్చిందని కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి సీట్ల భాగస్వామ్యాన్ని ఖరారు చేయడానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిద్ధూను పంజాబ్ ప్రభుత్వం నుండి తొలగించిన అమరీందర్ సింగ్, సిద్ధూను కాంగ్రెస్ పంజాబ్ విభాగానికి అధిపతిగా చేయడాన్ని కూడా వ్యతిరేకించారు.

సిద్దూకు ఏ మాత్రం తెలివి లేద‌ని అన్నారు. అలాంటి అసమర్థ వ్యక్తిని పార్టీలో చేర్చుకోవద్దని తాను ఐదేండ్ల కింద‌టే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి స‌ల‌హా ఇచ్చాన‌ని అన్నారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న ప్రస్తుత సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీతో పాటు మరికొందరు కాంగ్రెస్‌ నేతల ప్రమేయం ఉన్నట్లు సమాచారం అందినప్పటికీ, పార్టీ పట్ల ఉన్న విధేయతతో వారిపై చర్యలు తీసుకోలేదని అమ‌రీంద‌ర్ సింగ్ అన్నారు. వారిపై చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అనుమ‌తించ‌లేద‌ని ఆరోపించారు.

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 65 స్థానాల్లో, అమరీందర్‌ సింగ్‌ నేతృత్వంలోని పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ 37 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కూటమిలోని మూడవ పార్టీ అకాలీదళ్‌ (సంయుక్త్‌) మరో 15 స్థానాల్లో బరిలోకి దిగనుంది. ఈ మేరకు సీట్ల సర్దుబాట్లు చేసుకున్నట్లు ఢిల్లీలో అమరీందర్‌ సింగ్‌, బీజేపీ చీఫ్‌ జెపి నడ్డా, శిరోమణి అకాలీదళ్‌ సంయుక్త్‌ చీఫ్‌ సుఖ్‌దేవ్‌ సింగ్‌ ధిండ్సా ప్రకటించారు.