పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో(పార్లమెంట్) మంగళవారం బడ్జెట్ సమావేశంలో ఆర్థిక శాఖ, ఇతర శాఖలకు చెందిన ఎంపీలు, ప్రతిపక్ష ఎంపీల మధ్య పెద్ద రచ్చనే చోటు చేసుకుంది. చేతికి ఏది దొరికితే దాన్ని ఒకరిపై ఒకరు విసిరేసుకున్నారు. పుస్తకాలు, పేపర్లు గాల్లోకి ఎగరడమే కాకుండా ఇష్టమొచ్చినట్లు తిట్టుకున్నారు. లైవ్‌లో ఇదంతా దేశ ప్రజలు చూశారు. అధికార పిటిఐకి చెందిన ఎంపీ అలీ నవాజ్ అవాన్, ప్రతిపక్ష పిఎంఎల్-ఎన్ కి చెందిన ఎంపీ రోహాలీ అస్ఘర్ ల మధ్య మొదలైన గొడవ.. పార్లమెంట్‌లో రచ్చకు దారి తీసింది. ఇక రెండు వర్గాలుగా మారి ఇష్టం వచ్చినట్లు తిట్టుకున్నారు. వరుసగా రెండు రోజులు ఇలాగే రచ్చ సాగింది.
రెండోరోజు ప్రతిపక్షానికి చెందిన ఎంపీ షరీఫ్ అధికార పక్షాన్ని దుమ్మెత్తిపోశాడు. మీరు ప్రామిస్ చేసిన కోటి ఉద్యోగాలు ఎక్కడ, విదేశాల నుంచి తెప్పిస్తామన్న 3000 బిలియన్ డాలర్లు ఎక్కడ అని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇమ్రాన్ ఖాన్ కు మాటలు చెప్పడం తప్ప చేతల్లో చూపించడం కుదరదని విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత బడ్జెట్ ప్రతులు, పుస్తకాలు గాల్లోకి ఎగిరాయి. అధికార, ప్రతిపక్షాల ఎంపీలు తిట్టుకుంటూనే ఉన్నారు.
ట్రెజరీ సభ్యులు భారీగా శబ్దం చేయడం మొదలుపెట్టారు. ఒకరినొకరు తిట్టడం ప్రారంభించారు. శాసనసభ్యులు బడ్జెట్ కాపీలను విసిరికొట్టారు. మా మీద విసురుతారా అని మిగిలిన వాళ్లు కూడా తిట్లు మొదలుపెట్టారు. వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం పలువురు సీనియర్ నేతలు కూడా చూస్తూ ఉండిపోయారు అంతే..! ఫెడరల్ మంత్రి షా మహమూద్ ఖురేషి కూడా తన సీటు దగ్గర నిలబడి, గందరగోళాన్ని చూస్తూ ఉండిపోయారు. ఈ గొడవ ఫలితంగా సెషన్‌ను బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. “జాతీయ అసెంబ్లీ 2021 జూన్ 16 బుధవారం మధ్యాహ్నం 2:00 గంటలకు మరోసారి సమావేశానికి వాయిదా పడింది” అని పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఒక ట్వీట్‌లో చెప్పుకొచ్చింది. పార్లమెంటు సభ్యులు ఒకరిపై ఒకరు దాడికి గురిచేసే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జియో న్యూస్ కథనాల ప్రకారం, పాకిస్తాన్ అసెంబ్లీలో ట్రెజరీ సభ్యులు వికృత రీతిలో ప్రవర్తించారు. ఎంపీ షరీఫ్‌ను తీవ్రంగా విమర్శించారు. అతనిపై వేధింపులకు కూడా దిగారు. ట్రెజరీ సభ్యుల రౌడీ ప్రవర్తన పాకిస్తాన్ దేశ ప్రజలు చూసారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అవినీతిని నిర్మూలించాలన్న వాదనలు అబద్ధమని షరీఫ్ పాకిస్తాన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ నేడు అవినీతితో బాధపడుతోందని విమర్శించారు. ఈ రోజు జరిగింది దేశం మొత్తం చూసింది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఫాసిస్ట్, బూతుల పార్టీలా తయారవ్వడం దురదృష్టకరం అని ట్వీట్ చేశారు. స్పీకర్ అసద్ ఖైజర్ శాసనసభ్యులను అరవడం మానుకోవాలని, ప్రతిపక్ష నాయకుడిని తన అభిప్రాయాన్ని పూర్తి చేయడానికి అనుమతించాలని కోరారు. అయితే, ఆయన అభ్యర్థనను ఎవరూ పట్టించుకోలేదు.