International

తాలిబాన్ల గురించి పాకిస్తానీ మినిస్టర్ షేక్ రషీద్ వ్యాఖ్యలు విన్నారా..?

తాలిబాన్లకు పాకిస్తాన్ కు ఉన్న సంబంధం గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటూ ఉంది. ఇప్పటికే తాలిబాన్లు పాకిస్తాన్ తమకు రెండో ఇల్లు వంటిదని చెప్పుకున్నారు. ఇక పాకిస్తాన్ నాయకులు కూడా తాలిబాన్లపై తమ ప్రేమను చూపిస్తూ వస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం తాలిబానీ నాయకులకు సంరక్షణగా ఉందని పాకిస్థాన్ మంత్రి షేక్ రషీద్ ఒక టీవీ కార్యక్రమంలో ఒప్పుకున్నారు. “మేము తాలిబాన్ నాయకుల సంరక్షకులు. మేము వారిని చాలాకాలం చూసుకున్నాము. వారు పాకిస్తాన్‌లో ఆశ్రయం, విద్య మరియు నివాసాన్ని పొందారు. మేము వారి కోసం ప్రతిదీ చేశాము” అని రషీద్ బహిరంగంగా ప్రకటించాడు.

తాలిబాన్లను స్వాగతించి, యుఎస్‌ను తీవ్రంగా విమర్శించారు రషీద్. గత వారం జరిగిన మరో ఇంటర్వ్యూలో కూడా పాకిస్తాన్ చాలాకాలంగా అమెరికా దళానికి ఆశ్రయం ఇవ్వడాన్ని తాము ఇష్టపడలేదని అన్నారు. భారతదేశంలో హిందువులను మాత్రమే చంపి, ముస్లింలను ఆదుకునే ‘స్మార్ట్ బాంబులు’ అభివృద్ధి చేసే సాంకేతికత పాకిస్తాన్ వద్ద ఉందని గతంలో రషీద్ చేసిన వ్యాఖ్యలను ఎవరూ మరచిపోలేదు.

జిహాదీ సంస్థతో ఎలాంటి సంబంధం లేదన్న ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అబద్ధాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ ను తాలిబాన్లు సొంతం చేసుకోవడంతో.. పాకిస్తాన్ తాలిబాన్ల సహాయంతో కశ్మీర్‌ను జయించాలనే కలలు తెరపైకి వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ యొక్క తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ నాయకురాలు నీలం ఇర్షాద్ షేక్ ఇటీవల ‘తాలిబన్లు మాతో ఉన్నారు.. వారు కశ్మీర్‌ని గెలవడంలో సహాయపడతారని’ పాకిస్తాన్ న్యూస్ ఛానెల్‌లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే..!

తాలిబాన్లకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన పాకిస్తాన్:

ఆఫ్ఘనిస్తాన్‌కు మద్దతుగా ఇస్లామాబాద్ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి చెప్పుకొచ్చారు. “ప్రపంచ సమాజం ఆఫ్ఘనిస్తాన్‌తో నిమగ్నమై ఉండడం అత్యవసరం, పరిస్థితిని స్థిరీకరించడానికి మరియు ఆఫ్ఘన్ ప్రజలకు ఆర్థికంగా సహాయం చేయడానికి, మానవతా సహాయం అందించడం కొనసాగించడానికి” సిద్ధంగా ఉన్నామని ఖురేషి తాలిబాన్ల విషయంలో వ్యాఖ్యలు చేశారు. ఇక పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా ఇటీవలి ఇంటర్వ్యూలో తాలిబాన్లను ‘సాధారణ పౌరులు’ అని పోల్చారు. తాలిబాన్ అధికారంలోకి రావడంతో ఆఫ్ఘన్ ప్రజలు బానిసత్వ గొలుసులను విచ్ఛిన్నం చేశారని జిహాదీ చర్యలను కూడా ఇమ్రాన్ ఖాన్ సమర్థించారు.

తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పాకిస్తాన్‌తో తమ అనుబంధాన్ని బయట పెట్టారు. “ఆఫ్ఘనిస్తాన్ తన సరిహద్దులను పాకిస్థాన్‌తో పంచుకుంటుంది. మతం విషయానికి వస్తే మేము సాంప్రదాయకంగా సమన్వయంతో ఉన్నాము, రెండు దేశాల ప్రజలు ఒకరితో ఒకరు కలిసిపోతారు. కాబట్టి మేము పాకిస్తాన్‌తో సంబంధాలను మరింత దృఢపరుచుకోవడం కోసం ఎదురు చూస్తున్నాము, ”అని ముజాహిద్ అన్నారు. భారతదేశంతో కూడా మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాము అని చెప్పుకొచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ten + nine =

Back to top button