Sports

సెమీ ఫైనల్ లో పాకిస్తాన్ ను మట్టి కరిపించిన ఆస్ట్రేలియా..!

ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ లో ఆసీస్ అద్భుతమైన విజయం అందుకుంది. అచ్చం మొదటి సెమీ ఫైనల్ లో జరిగినట్లుగా న్యూజిలాండ్ ఎలాగైతే విజయాన్ని కైవసం చేసుకుందో.. అచ్చం అలాగే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ను ఆఖరి వరకూ తీసుకుని వెళ్లిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. షాహీన్ షా అఫ్రీదికి 19వ ఓవర్లో చుక్కలు చూపించి విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ లో కివీస్ తో తలపడనున్నారు. న్యూజిలాండ్-పాకిస్తాన్ ఒక్కసారి కూడా టీ20 ప్రపంచ కప్ గెలవలేదు. దీంతో కొత్త ఛాంపియన్ అవతరించనున్నారు.

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా పాకిస్తాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్, వన్ డౌన్ బ్యాట్స్ మన్ ఫకార్ జమాన్ అర్ధసెంచరీలు సాధించారు. రిజ్వాన్ 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. ఫకర్ జమాన్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 55 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ బాబర్ అజామ్ 39 పరుగులు సాధించాడు. ఆసీస్ ఫీల్డర్లు పలు క్యాచ్ లు వదిలి పెట్టారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 2, కమిన్స్ 1, జంపా 1 వికెట్ తీశారు.

పాక్ విసిరిన 177 పరుగుల లక్ష్యాన్ని కంగారూలు 19 ఓవర్లలోనే ఛేదించారు. మాథ్యూ వేడ్ కేవలం 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. ఆసీస్ జట్టు 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ మెరుపు ఇన్నింగ్స్ తో మరో ఓవర్ మిగిలుండగానే గెలుపు తీరాలకు చేరింది. లక్ష్య ఛేదనలో ఆసీస్ అంత గొప్పగా మొదలు పెట్టలేదు. షాహీన్ షా అఫ్రీది అద్భుతమైన బంతితో కెప్టెన్ ఫించ్ ను ఎల్బీడబ్ల్యూ గా పెవిలియన్ పంపాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ మాత్రం తడబడకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంపైర్ తప్పిదానికి బలయ్యాడు. షాదాబ్ బౌలింగ్ లో కీపర్ క్యాచ్ పట్టగా, అంపైర్ అవుటిచ్చాడు. అయితే రివ్యూ కోరకుండానే వార్నర్ పెవిలియన్ చేరాడు. టెలివిజన్ రీప్లేలో బంతి బ్యాట్ కు తగల్లేదని స్పష్టమైంది. మిచెల్ మార్ష్ 28, స్టీవ్ స్మిత్ 5, మ్యాక్స్ వెల్ 7 పరుగులు చేశారు. ఆసీస్ విజయానికి 2 ఓవర్లలో 22 పరుగులు అవసరం కాగా, షహీన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో వేడ్ చితక్కొట్టాడు. హ్యాట్రిక్ సిక్సులతో పాక్ కు విజయాన్ని దూరం చేశాడు. స్టొయినిస్ (31 బంతుల్లో 40 పరుగులు) కూడా 2 ఫోర్లు, 2 సిక్సులు బాది ధాటిగా ఆడాడు. వేడ్, స్టొయినిస్ దూకుడుగా ఆడడంతో చివరి 5 ఓవర్లలో ఆసీస్ 62 పరుగులు సాధించింది.పాకిస్థాన్ బౌలర్లలో స్పిన్నర్ షాదాబ్ ఖాన్ 4 వికెట్లు తీశాడు. ఈ నెల 14న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ తో తలపడనుంది.

Related Articles

Back to top button