చైనా సహాయంతో పాకిస్థాన్ వ్యాక్సిన్ తయారు చేసింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మంగళవారం నాడు పాకిస్థాన్ చేసింది. ఈ వ్యాక్సిన్ కు ‘పాక్ వ్యాక్'(PakVac) అనే పేరును పెట్టింది. త్వరలోనే ఈ వ్యాక్సిన్ ను పెద్ద ఎత్తున తయారు చేస్తామని డాక్టర్ ఫైజల్ సుల్తాన్ చెప్పుకొచ్చారు. పాక్ వ్యాక్ ను తయారు చేయడానికి సహాయపడిన చైనాకు ధన్యవాదాలు తెలిపారు డాక్టర్ ఫైజల్ సుల్తాన్. పాకిస్థాన్ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వ్యాక్సిన్ ను తయారు చేయడం ఎంతో గర్వంగా ఉందని.. రా మెటీరియల్స్ నుండి వ్యాక్సిన్ ను తయారు చేయడం సాధారణ విషయం కాదని సుల్తాన్ చెప్పుకొచ్చారు. చైనాకు చెందిన ‘క్యాసినో’ వ్యాక్సిన్ కు మార్పులు చేసి.. పాక్ వ్యాక్ ను తయారు చేశారు. పాకిస్థాన్ లో దీన్ని ‘పాక్ వ్యాక్’ గా అమ్మనున్నారు.
ఈ వ్యాక్సిన్ తయారీకి చైనా నుండి ముడిసరుకులు పాకిస్థాన్ అందుకుంది. మే నెల మొదటి వారంలోనే పాకిస్థాన్ కు చైనా నుండి సహాయం అందింది. తమకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపింది పాకిస్థాన్. పాకిస్థాన్ ప్రభుత్వం పలు పరీక్షలు నిర్వహించి వ్యాక్సిన్ ను ప్రజలకు అందించబోతోంది. త్వరలోనే పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది పాకిస్థాన్ కు చాలా ముఖ్యమైన రోజు అంటూ ప్రభుత్వ పెద్దలు తెలిపారు.
చైనా తయారుచేసిన సినోవాక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అనుమతి మంజూరు చేసింది. 18 ఏళ్లకు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వొచ్చని.. తొలి డోసు అనంతరం 2 నుంచి 4 వారాలకు రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుందని సినోవాక్ బయోటెక్ సంస్థ చెప్పింది. డబ్ల్యూహెచ్ఓ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇతర దేశాల్లోనూ సినోవాక్ ను వినియోగించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూహెచ్ఓ అమలు చేస్తున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యాచరణ కొవాక్స్ లోనూ సినోవాక్ కు స్థానం దక్కనుంది.
మరో వైపు చైనా వ్యాక్సిన్ల విషయంలో అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. చాలా దేశాలు చైనా వ్యాక్సిన్ కు తమ దేశాల్లో అనుమతి ఇవ్వమని తెలిపాయి. వ్యాక్సినేషన్ విషయంలో కూడా చైనా అబద్ధాలను చెబుతూ ఉంది. చైనా తయారు చేసిన వ్యాక్సిన్ ను అక్కడి ప్రజలకు పెద్ద ఎత్తున ఇచ్చేసినట్లు చెబుతున్నా.. ఇంకొన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్ల కోసం వందల మంది క్యూలలో నిలబడ్డారు. కరోనా మహమ్మారిని కంట్రోల్ చేశామని చైనా ప్రభుత్వం చెబుతున్నా.. పలు నగరాల్లో కరోనా కేసులు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయని తెలుస్తోంది. గ్వాంగ్జోవ్ లో కరోనా కేసుల ఉధృతి మొదలవ్వడంతో ప్రజలు వ్యాక్సిన్ సెంటర్లకు ఎగబడ్డారు. దీంతో ప్రజలు వీధుల్లోకి రావద్దని సూచించింది. కరోనా వైరస్ తిరిగి చైనాలో విజృంభిస్తూ ఉండడంతో ఆ దేశం తీసుకుని వచ్చిన వ్యాక్సిన్ గురించి తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. చైనా వ్యాక్సిన్లు కరోనాను కట్టడి చేస్తాయా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి.
ఇప్పుడు పాకిస్థాన్ చైనాను నమ్మి వ్యాక్సిన్ ను తయారు చేసింది. ఇటీవలే పాకిస్థాన్ పై కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపించింది. గత 24 గంటల్లో 1771 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని పాకిస్థాన్ ప్రభుత్వం చెబుతోంది. పాకిస్థాన్ లో ఇప్పటి వరకూ 9,22,824 కరోనా కేసులు నమోదయ్యాయని మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ సర్వీసెస్ డేటా చెబుతోంది.