More

  శ్రీలంక స్థితికి చేరుకుంటున్న పాకిస్థాన్

  శ్రీలంక పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. స్వాతంత్య్రం పొందాక గడ్డు పరిస్థితిని శ్రీలంక ఎదుర్కొంటూ ఉంది. ఇక పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కూడా గత కొన్నేళ్లుగా క్షీణిస్తూనే ఉంది. తాజాగా పాకిస్థాన్ కూడా శ్రీలంకలా తయారవుతూ ఉందని ఆర్ధిక నిపుణులు చెబుతూ ఉన్నారు. భారీగా నగదు కొరత ఉన్న పాకిస్థాన్.. ఇకపై తన పవర్ ప్లాంట్‌లకు ఇంధనం కోసం విదేశాల నుండి బొగ్గు సహజ వాయువును కొనుగోలు చేయలేని కారణంగా ఆ దేశంలోని ఇళ్లకు, పరిశ్రమలకు విద్యుత్తును నిలిపివేస్తోంది. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్ లో సహజ వాయువు, బొగ్గు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దీంతో పాకిస్థాన్ ప్రపంచ మార్కెట్ నుండి ఇంధనాన్ని సేకరించేందుకు చాలానే కష్టపడుతోంది. తొమ్మిది నెలల్లో పాకిస్తాన్ ఇంధన ధర రెండింతలు పెరిగాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న కారణంగా అదనపు అవసరాల కోసం పాక్ ఎక్కువ ఖర్చు చేయలేకపోయింది. దాదాపు 3,500 మెగావాట్ల విలువైన విద్యుత్ సామర్థ్యం కలిగిన ప్లాంట్ మూసివేయబడిందని కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆర్థిక మంత్రిగా ఎంపిక చేసిన మిఫ్తా ఇస్మాయిల్ ట్విట్టర్ పోస్ట్‌లో తెలిపారు. ఇంధన కొరత కారణంగా ఏప్రిల్ 13 నాటికి మూసేశామని తెలిపారు.

  పాకిస్థాన్ స్పాట్ మార్కెట్ నుంచి ఇంధనాన్ని సేకరించేందుకు కష్టాలు పడుతోంది. గత తొమ్మిది నెలల్లో అక్కడ ఇంధన ధరలు రెండింతలు పెరిగి 15 బిలియన్ డాలర్లకు చేరాయి. విదేశీ మారకపు నిల్వల కొరతతో అదనపు సరఫరా కోసం ఎక్కువగా ఖర్చు చేయలేకపోతోంది. ఏప్రిల్ 13 నుంచి పాక్ లో 7,000 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇందులో 3,500 ఇంధన కొరత కాగా, మిగతా సగం సాంకేతిక లోపంతోనూ నిలిపివేశామని మిఫ్తా ఇస్మాయిల్ చెప్పారు. 7,000 మెగావాట్ల అనేది దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తంలో దాదాపు ఐదో వంతు అని కరాచీలోని ఆరిఫ్ హబీబ్ లిమిటెడ్ పరిశోధనా విభాగం అధిపతి తాహిర్ అబ్బాస్ అన్నారు.

  రాజకీయ సంక్షోభం తర్వాత ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడయ్యాక కొత్త ప్రధాని షరీఫ్‌కు ఈ విద్యుత్ సంక్షోభం ఇప్పటికే కఠినమైన ఆర్థిక సవాలునువిసురుతోంది. ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన పేద దేశంగా పాకిస్థాన్ ఇప్పటికే పేరు తెచ్చుకోగా.. పెరుగుతున్న ఇంధన ఖర్చుల కారణంగా ఆ దేశ ఆర్థిక శాఖ తీవ్రంగా దెబ్బతింది. ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన పాక్.. ధరల పెరుగుతుండటంతో తీవ్రంగా ఇబ్బందులకు గురవుతోంది. పాక్‌కు చాలా ఏళ్లుగా సహజ వాయువు సరఫరా చేస్తున్న సంస్థలు.. గత కొన్ని నెలలుగా ఆర్డర్లను రద్దు చేశాయి. స్పాట్ మార్కెట్ నుండి ఆరు ఎల్‌ఎన్‌జి కార్గోలను కొనుగోలు చేయడానికి దేశం ఆదివారం టెండర్‌ను విడుదల చేసింది, అయితే అందుకోసం పాక్ ప్రభుత్వానికి వందల మిలియన్ల డాలర్లు ఖర్చు అవుతుంది. “గ్లోబల్ డైనమిక్స్ ఇప్పటికీ అదే విధంగా ఉన్నందున పాక్ ఆర్ధిక పరిస్థితి సమీప కాలంలో మారదు,” అని పాకిస్తాన్ కువైట్ ఇన్వెస్ట్‌మెంట్ కో రీసెర్చ్ హెడ్ సమీవుల్లా తారిక్ అన్నారు. రాబోయే రోజుల్లో పాక్ కు ఎన్నో కష్టాలు రాబోతున్నాయని, శ్రీలంకలా పాక్ మారడానికి ఎక్కువ సమయం తీసుకోదని అంటున్నారు.

  Trending Stories

  Related Stories