ప్రపంచకప్ టోర్నమెంట్ లో భారత్ పై పాకిస్తాన్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. మ్యాచ్ మొదలైనప్పటి నుండి పాకిస్తాన్ జట్టు దూకుడుగా ఆడింది. భారత్ భారీ స్కోరు సాధించడానికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు.. అలాగే భారత బౌలింగ్ ను పాక్ ఓపెనర్లు సమర్థంగా ఎదుర్కొన్నారు. ఎటువంటి చెత్త షాట్లు కూడా ఆడకుండా.. క్యాచ్ లకు అవకాశం ఇవ్వకుండా లక్ష్యాన్ని చేధించారు. ప్రపంచకప్‌లో పాక్ ఎప్పుడూ భారత్‌ను ఓడించలేదు. ఈ మ్యాచ్ లో 13 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో గెలిచారు.
భారత్ నిర్దేశించిన 152 పరుగుల విజయలక్ష్యాన్ని మరో 13 బంతులు మిగిలుండగానే ఛేదించింది. భారత ఆటగాళ్లు ఆపసోపాలు పడి నమోదు చేసిన పరుగులను, పాక్ ఓపెనర్లు ఇద్దరే ఛేదించారు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహ్మద్ రిజ్వాన్ 55 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేయగా, కెప్టెన్ బాబర్ అజామ్ తన క్లాస్ రుచి చూపిస్తూ 52 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 68 పరుగులు చేశాడు. వరల్డ్ కప్ చరిత్రలో పాక్ పై భారత్ కు ఇది అత్యంత ఘోర పరాజయం. ఈ రెండు జట్లు వరల్డ్ కప్ లో తలపడడం ఇది 13వ సారి కాగా, గతంలో 12 పర్యాయాలు భారత జట్టే నెగ్గింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. పాక్ పేసర్ షహీన్ అఫ్రిది ఆరంభంలోనే రోహిత్ శర్మ (0), కేఎల్ రాహుల్ (3) లను అవుట్ చేయడంతో భారత శిబిరంలో తీవ్ర నిరాశ నెలకొంది. ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్ ఒక సిక్సర్ బాదినప్పటికీ.. పెద్ద ఇన్నింగ్స్ ఆడడంలో విఫలమయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (57), రిషబ్ పంత్ (39) రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. జడేజా 13 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్య 11 పరుగులు చేసి అవుటయ్యాడు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 3, హసన్ అలీ 2, షాదాబ్ ఖాన్ 1, హరీస్ రవూఫ్ 1 వికెట్ తీశారు.