More

    మళ్లీ ‘గ్రే’ లిస్టులోనే పాక్..!
    దిమ్మదిరిగే షాకిచ్చిన FATF

    ప్రపంచ దేశాలు నిందిస్తున్నాయి. అగ్రరాజ్యాలు తప్పుబడుతున్నాయి. సరిహద్దు దేశాలు చీకొడుతున్నాయి. అయినా, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న రీతిలో ప్రవర్తిస్తోంది ఉగ్రవాదదేశం పాకిస్తాన్. టెర్రరిస్ట్ ఫ్యాక్టరీగా మారిన ఆ దేశానికి.. అంతర్జాతీయ సమాజం మరోసారి గట్టి షాక్ ఇచ్చింది. అసలే పీకల్లోతు అప్పులతో కొట్టుమిట్టాడుతున్న ఉగ్రవాద దేశానికి.. ఫైనాన్సియల్ టాస్క్ ఫోర్స్ గూబగయ్యిమనేలా సమాధానం చెప్పింది. ఉగ్రవాదులకు నిధులివ్వొద్దని ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెట్టిన పాకిస్తాన్ ను.. ‘గ్రే’ లిస్ట్ లోనే కొనసాగించాలని నిర్ణయించింది.

    ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్.. పాకిస్తాన్ ను 2018లో తొలిసారి గ్రే లిస్టులో పెట్టింది. 2019 చివరి నాటికి ఉగ్రవాదులకు నిధుల ప్రవాహాన్ని,. మనీ లాండరింగ్‌ను నిలువరించాలని డెడ్‌లైన్ విధించింది. కానీ, పాకిస్తాన్ అందులో విఫలం కావడంతో గ్రే జాబితాలోనే కొనసాగిస్తూ వస్తోంది. ఎఫ్‌ఏటీఎఫ్‌ ఎన్నిసార్లు డెడ్ లైన్లు విధించినా పాక్ వైపు నుంచి పెద్దగా ఆశించిన చర్యలేవీ కనిపించలేదు. చివరిసారిగా 2020 అక్టోబర్ లో సమావేశమైన ఎఫ్‌ఏటీఎఫ్‌.. పాకిస్తాన్‌ను ఫిబ్రవరి 2021 వరకూ గ్రే జాబితాలోనే కొనసాగించాలని నిర్ణయించింది. కానీ, ఈ డెడ్ లైన్‌‌ కూడా ముగుస్తున్నప్పటికీ పాక్ ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోలేదు. ఈ నేపథ్యంలో మరోసారి పాక్‌ను గ్రే జాబితాలో కొనసాగించాలని ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్ణయించింది. మొత్తం 27 అంశాల విషయంలో జూన్, 2021ని కొత్త డెడ్‌ లైన్‌గా నిర్ణయించింది. ఇప్పటికైతే 24 అంశాలను పాక్ పరిష్కరించగలిగిందని.. మరో మూడు అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. కొత్త డెడ్ లైన్ పూర్తయ్యే లోగా మొత్తం టార్గెట్స్‌ను పూర్తి చేయాలని సూచించింది. అప్పటివరకూ పాకిస్తాన్ గ్రే లిస్టులోనే కొనసాగనుంది.

    జీ7 సభ్యదేశాల చొరవతో 1989లో ఫ్రాన్స్ కేంద్రంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. ప్రసుత్తం ఇందులో 38 సభ్య దేశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మనీలాండరింగ్, ఆర్థిక నేరాలపై ఎప్పటికప్పుడు యాక్షన్ ప్లాన్ రూపొందించడం ఎఫ్ఏటీఎఫ్ విధి. ముఖ్యంగా ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుతున్న దేశాలపై ఇది ఆర్థిక ఆంక్షలు విధిస్తుంది. నేర తీవ్రతను బట్టి ఆయా దేశాలను గ్రే, బ్లాక్ లిస్టుల్లో పెడుతుంది. గ్రే లిస్టులో ఉన్న దేశానికి ప్రపంచ దేశాల నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం లభించదు. అప్పులివ్వడానికి ముందుకు రావు. దీంతో అవి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతాయి.

    గ్రే లిస్టు నుంచి బయటపడాలంటే.. ఎఫ్ఏటీఎఫ్ విధించే షరతులను అమలు చేయాల్సివుంటుంది. కానీ, పాకిస్తాన్ మాత్రం ఎన్ని అవకాశాలిచ్చినా.. దుర్వినియోగం చేస్తూ వస్తోంది. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందిస్తూనేవుంది. పాకిస్తాన్ లోని కరుడుగట్టిన ఉగ్రవాదులకు అండగా నిలుస్తోంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పెరిగిపోవాడానికి కారణమవుతోంది. దీంతో ప్రతీసారి ఎఫ్ఏటీఎఫ్ ఆగ్రహానికి గురవుతోంది. అయినప్పటికీ.. పాకిస్తాన్ ను బ్లాక్ లిస్ట్ లో చేర్చకుండా.. గ్రే లిస్టులోనే కొనసాగిస్తూ ఎఫ్ఏటీఎఫ్ ఇప్పటికే పలుమార్లు అవకాశం ఇచ్చింది. అయినా, ఉగ్రవాద దేశం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. ఈసారి కూడా గ్రే లిస్ట్ షరుతులను అమలు చేయకపోతే.. బ్లాక్ లిస్ట్ లో పెట్టే అవకాశం లేకపోలేదని ఆర్థిక నిపుణులు అంచనా వస్తున్నారు. అదే జరిగితే, పాకిస్తాన్ మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోక తప్పదు. ఇప్పటికే గ్రే లిస్ట్ లో పాకిస్తాన్.. ఏటా సుమారు 73 వేల కోట్లు నష్టపోతున్నట్టు అంచనా.

    Trending Stories

    Related Stories