More

    శత్రు దేశంలో హింసాత్మక ఘటనలు.. అల్లర్లతో అట్టుడుకుతున్న పాక్..!

    శత్రు దేశంలో పరిస్థితి మరింత దిగజారింది. ఆర్ధిక సంక్షోభమే కాదు.. రాజకీయ సంక్షోభం కూడా మరింత ముదిరింది. ఐతే తాజాగా పాకిస్తాన్ లో హింసాత్మక పరిస్థితులు ఏర్పడ్డాయి. పాకిస్తాన్-ఇ-తెహ్రీక్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీసులు, భద్రత సిబ్బందితో ఘర్షణకు దిగారు. రాళ్లు రువ్వారు. వారిపై దాడులకు పాల్పడ్డారు. మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పార్టీ.. పాకిస్తాన్-ఇ-తెహ్రీక్. ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేయడానికి పోలీసులు లాహోర్ లోని ఆయన నివాసానికి చేరుకోవడంతో పీటీఐ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. తీవ్రంగా ప్రతిఘటించారు. ఫలితంగా ఆయన నివాసం ఉన్న జమాన్ పార్క్ తో పాటు నగర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు, భద్రత బలగాలను వారు అడుగడుగునా అడ్డుకున్నారు. ఆయన ఇంటికి వెళ్లే మార్గాలన్నింటినీ మూసివేశారు. రోడ్లపై బైఠాయించారు. పీటీఐ కార్యకర్తలు భారీగా గుమికూడారు. పోలీసు వాహనాలను ముందుకు కదలనివ్వలేదు. దీనితో ఆయన ఇంటికి చేరడానికి పోలీసులకు కష్టమైంది. ఇక పీటీఐ కార్యకర్తలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. కొన్ని చోట్ల గాల్లోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ- వారు ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. తమ దాడులను మరింత తీవ్రతరం చేశారు. చేతికి అందిన వస్తువులన్నింటినీ పోలీసులపైకి విసిరివేశారు.

    ఈ ఘర్షణల్లో ఇస్లామాబాద్ డిప్యూటీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ షెహజాద్ బుఖారి గాయపడ్డారు. ఆయనను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు జరిపిన లాఠీఛార్జీలో పలువురు పీటీఐ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అంబులెన్సుల రాకపోకలతో ఆ ప్రదేశం మొత్తం బీభత్సంగా తయారైంది. మరోవైపు తనను అరెస్ట్ చేయడం ఖాయమంటూ తెలిసిన వెంటనే ఇమ్రాన్ ఖాన్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పోలీసులు తనను బంధించడానికి వచ్చారని, తనను జైలులో పెట్టినా, ప్రాణం తీసినా హక్కుల కోసం పోరాడాలని ఆయన పీటీఐ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

    అల్లా తనకు అన్నీ ఇచ్చారని, తాను న్యాయం కోసం పోరాడుతున్నానని అన్నారు. తన జీవితం అంతా పాకిస్తాన్ ప్రజల కోసమే ధారపోశానని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. దీన్ని కొనసాగిస్తానని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ అనే నాయకుడు ప్రాణాలతో లేకపోయినా సరే.. దీనికి వ్యతిరేకంగా పాకిస్తాన్ పోరాడాలని సూచించారు. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించొద్దని అన్నారు.

    ఐతే ఈ ఘర్షణలు ఒక్క లాహోర్ కే పరిమితం కాలేదు. కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, ముల్తాన్, క్వెట్టాల్లో కూడా పీటీఐ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు. రహదారులను దిగ్బంధించారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పలుచోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఫ్లెక్సీలను తగులబెట్టారు. దీంతో పాక్ లో పరిస్థితులు మరింత దిగజారాయి.

    Trending Stories

    Related Stories