అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పాకిస్థాన్ ఒక దేశం నుంచి అప్పు చేస్తూ మరో దేశానికి దాన్ని చెల్లిస్తోంది. ఎక్కువ వడ్డీలు చెల్లించాల్సి రావడంతో అప్పులు పెరుగుతున్నాయి. తాజాగా ఇతర దేశాల్లో ఉన్న పాకిస్థాన్ ఆస్తులను అమ్మే వరకూ పరిస్థితి వచ్చింది.
గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు పడుతున్న దేశాలలో అగ్రగామిగా పాకిస్తాన్ ఘనత దక్కించుకుంది. సాయం అందించాలనుకునే భారత్ ను దొంగదెబ్బ తీయాలనుకోవడం.. జిత్తులమారి చైనాతో కలిసి దోస్త్ మేరా దోస్త్ అంటూ ఊరేగడం వంటివి చేసిన పాక్ కు నిజానిజాలు ఇప్పుడు తేటతెల్లమవుతున్నాయి. మత మౌఢ్యం తలకెక్కి హిందూ దేశం పై కక్షగట్టి ఎందరో మన జవానుల ఉసురుపోసుకుంది ఆ దేశం.. అయినా అన్నీ మరిచి ఎన్నో మార్లు స్నేహ హస్తం చాచింది భారత్. కానీ ఒడ్డుచేరాక తెప్పతగలబెట్టే దిగజారుడు గుణం కలిగిన పాకిస్తాన్ బుద్ధి ఎప్పుడూ కుక్క తోక వంకరే. మతం మతం మతం.. అదేమన్నా ఇప్పడు కూడు పెడుతుందా.. అప్పులు తీరుస్తుందా.. మత పిచ్చితోనే మనబోటి దేశాలను కాదనుకుని ఇప్పుడు అన్నమో రామచంద్రా అనే స్థితికి చేరుకుంది. ఈ మాటలు ఏవో అలా వ్యాఖ్యానించినవి కావు. పాకిస్తాన్ అధికారికంగా వెల్లడించిన గణాంకాలే ఆ దేశ దుస్థితికి అద్దం పడుతున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే..
2019 డిసెంబర్ నాటికి పాకిస్థాన్ అప్పులు 40.94 ట్రిలియన్ రూపాయలుగా ఉన్నాయి. ఈ సంవత్సరం గడువు లోనే పాకిస్థాన్ అప్పులు 45 ట్రిలియన్లకు పెరగడం గమనార్హం. ఈ లెక్కలు ఏవో కాకి లెక్కలు అస్సలు కాదు. పాకిస్థాన్ సెంట్రల్ బ్యాంక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్ ఆర్థిక శాఖ రిపోర్ట్ కూడా దీన్ని బలపర్చింది. తాజాగా పార్లమెంట్ లో ఆ దేశ ఆర్థిక మంత్రి దేశానికి ఉన్న అప్పుల గురించి వెల్లడించారు. ఈ అప్పులన్నింటినీ పాకిస్థాన్ లో ఉన్న 21.66 కోట్ల మంది కి సమానంగా పంచితే ఒక్కొక్కరికీ లక్షా 75 వేల రూపాయల అప్పు ఉన్నట్లుగా తేలుతుంది.
ఈ అప్పులు ఇప్పుడు కొత్తగా చేసినవా? అంటే కొన్ని పాత అప్పులు.. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా మారిన తర్వాత చేసిన అప్పులు మరికొన్ని అని చెప్పుకోవాలి. అయితే పాకిస్థానీ న్యూస్ పేపర్ ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ కథనం ప్రకారం ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రి గా ఎన్నికయ్యాక ఈ అప్పులు 46 శాతం పెరిగాయట. ఇంతకుముందు కూడా పాకిస్థాన్ పరిస్థితి పెద్ద గొప్పగా ఏమీ లేకపోయినా ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ పాలనలో మరింత దిగజారిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కరోనా వల్ల ఆర్థిక భారం ఎక్కువైంది. ఆ మేరకు అప్పులు కూడా పెరిగాయి. మిగిలిన దేశాలన్నింటితో పోల్చితే పాకిస్థాన్ లో లాక్ డౌన్ చాలా తక్కువ కాలం కొనసాగింది.
తమ దేశం పేద దేశం కాబట్టి ఆర్థిక వ్యవస్థ పై భారం పడకూడదని చెబుతూ ఇమ్రాన్ లాక్ డౌన్ ని ఎత్తేశారు. అయితే ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయింది. గతంలో ఆర్థిక శాఖ చెప్పిన వివరాల ప్రకారం పాకిస్థాన్ ప్రభుత్వం తాను రూపొందించుకున్న ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ క్రెడిట్ లిమిట్ చట్టాన్ని అతిక్రమించింది. 2005 లో ఈ చట్టాన్ని రూపొందించారు. దీనికి ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ కంటే ద్రవ్య లోటు 4 శాతం కంటే ఎక్కువగా ఉండకూడదు. కానీ ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో ఈ ద్రవ్యలోటు 8.6 శాతంగా ఉంది. ఇది నిర్ణయించిన రేటుకు రెట్టింపు కంటే ఎక్కువ కావడం విశేషం.
గతంలో ఆర్థిక లోటు గురించి ప్రభుత్వం ఆఫీసర్లకు కూడా ఎలాంటి సమాచారాన్ని అందించలేదు. కానీ తాజాగా పరిస్థితి విషమించడంతో ప్రజలందరికీ పరిస్థితిని వివరించింది పాకిస్థాన్ ప్రభుత్వం. ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ప్రతి పౌరుడు తన వంతుగా ప్రయత్నించాలని వెల్లడించారు కానీ అసలు ఆర్థిక పరిస్థితి గురించి పూర్తి వివరాలను మాత్రం బయటపెట్టలేదు. కేవలం ఓ చిన్న రిపోర్ట్ లో ఆర్థిక వ్యవస్థ నష్టాల్లో ఉంది. ద్రవ్యలోటు 8.6 శాతంగా ఉందని వెల్లడించారే కానీ మిగిలిన వివరాలు అస్సలు వెల్లడించలేదు. చివరకు అన్ని అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో.. వాటిని ఎందుకు ఉపయోగించారో.. తిరిగి ఎందుకు చెల్లించలేకపోయారో వంటి వివరాలను కూడా ఇమ్రాన్ ప్రభుత్వం ప్రజలకు చెప్పకపోవడం విచారకరం. 2018 మధ్య నాటికి పాకిస్థాన్ కి ఉన్న అప్పుల విలువ 24.9 ట్రిలియన్ రూపాయలు. అప్పుడు ఈ అప్పును ప్రజలకు సమానంగా పంచితే లక్షా ఇరవై వేల రూపాయలు వచ్చేది.
ఇప్పుడు అప్పులు పెరిగాయి కాబట్టి పెరిగిన జనాభా లెక్కన తీసుకున్నా లక్షా డెబ్భై ఐదు వేల అప్పు తేలడం గమనార్హం. రెండేళ్లలో ఒక్కొక్కరిపై సగటున 55 వేల రూపాయల అప్పు పెరగడం పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితిని వివరిస్తోంది. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పాకిస్థాన్ ఒక దేశం నుంచి అప్పు చేస్తూ మరో దేశానికి దాన్ని చెల్లిస్తోంది. ఎక్కువ వడ్డీలు చెల్లించాల్సి రావడంతో అప్పులు పెరుగుతున్నాయి. తాజాగా ఇతర దేశాల్లో ఉన్న పాకిస్థాన్ ఆస్తులను అమ్మే వరకూ పరిస్థితి వచ్చింది. ఇతర దేశాలకు చెందిన మైనింగ్ కంపెనీలు తమ దేశంలో బంగారాన్ని తవ్వుకోవచ్చని అంగీకరించిన పాకిస్థాన్ అగ్రిమెంట్ అయ్యాక మనసు మార్చుకొని వారికి అనుమతిని నిరాకరించింది. అగ్రిమెంట్లను క్యాన్సిల్ చేసింది. దీనిపై కంపెనీలు కోర్టుకి వెళ్లగా పాకిస్థాన్ ఈ కేసును కూడా ఓడిపోయింది.
ప్రస్తుతం ఆయా మైనింగ్ కంపెనీల నష్టాలను భరించేందుకు పాకిస్థాన్ వారికి ఆ మొత్తాన్ని చెల్లించాలని కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ మొత్తం 8.5 బిలియన్ డాలర్లు. ఒకవేళ పాకిస్థాన్ ఈ మొత్తాన్ని చెల్లించలేకపోతే ఇతర దేశాల్లో పాకిస్థాన్ ప్రభుత్వానికి ఉన్న లగ్జరీ హోటల్స్ వేలానికి పెట్టే అవకాశం ఉంది. దీన్ని ఆపాలంటే కోర్టు చెప్పిన మొత్తాన్ని ఇమ్రాన్ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ నష్టాల్లో ఉండగా ఇమ్రాన్ ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయలను చెల్లించడం కష్టంగా మారవచ్చు. ఈ మొత్తం పాకిస్థాన్ జీడీపీలో రెండు శాతం. కాబట్టి కోర్టు పాక్ ఆస్తులను వేలం వేసే పరిస్థితి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఇది పాక్ దౌర్భాగ్యకర పరిస్థితి. మరికొన్ని మతోన్మాద దేశాలు ఏకమై సాయం చేసినా తేరుకోని స్థితికి చేరుకుంటున్న పాక్ కు భవిష్యత్తులో పరిష్కార మార్గాలు ఏ ఏ రూపాన కనిపిస్తాయో.. చూడాలి. అలా జరగకపోతే పాక్ లో ఆకలి చావులకు సమయం దగ్గరపడినట్టేననేది పరిశీలకుల మాట.