More

    టీ20 ప్రపంచకప్ కు ముందు పాకిస్తాన్ క్రికెట్ లో ఊహించని ముసలం

    టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్‌ జట్టుకు భారీ షాక్ త‌గిలింది. హెడ్‌ కోచ్‌ మిస్సా ఉల్ హ‌క్‌, బౌలింగ్‌ కోచ్‌ వ‌కార్ యూనిస్‌లు కోచింగ్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటున్నట్లు సోమవారం ప్రకటించారు. పాక్‌ ప్రపంచకప్‌ జట్టును ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇద్దరు కోచ్‌లు రాజీనామా చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో గతంలో కూడా ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను, ఆరోగ్య సమస్యలను చూపించి తప్పుకుంటున్నట్లు హెడ్‌ కోచ్‌ మిస్సా ఉల్ హ‌క్‌, బౌలింగ్‌ కోచ్‌ వ‌కార్ యూనిస్‌లు తెలిపారు. త్వరలో న్యూజిలాండ్‌తో జ‌రగబోయే సిరీస్‌ల‌కు వీరి స్థానాల్లో తాత్కాలిక కోచ్‌లుగా స‌క్లెయిన్ ముస్తాక్‌, అబ్దుల్ రజాక్‌ల‌ను నియ‌మించిన‌ట్లు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ప్ర‌క‌టించింది.

    టీ 20 ప్రపంచ కప్‌కు ఒక నెల ముందు తమ బాధ్యతల నుండి వైదొలగడంతో పాక్ క్రికెట్ అభిమానులు కూడా షాకయ్యారు. మిస్బా మరియు వకార్ రాజీనామా చేశారని, పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు, సక్లైన్ ముస్తాక్ మరియు అబ్దుల్ రజాక్ ప్రస్తుతానికి తాత్కాలిక కోచ్‌లుగా ఉంటారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. సెప్టెంబర్ 13 నుండి పాక్ క్రికెట్ బోర్డు కొత్త ఛైర్మన్ గా మాజీ టెస్ట్ కెప్టెన్ రమీజ్ రాజాను రానుండడంతో హెడ్‌ కోచ్‌ మిస్సా ఉల్ హ‌క్‌, బౌలింగ్‌ కోచ్‌ వ‌కార్ యూనిస్‌లు కోచింగ్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్నట్లు పాక్ మీడియా చెబుతోంది.

    రమీజ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో తాను మిస్బా మరియు వకార్ పాకిస్తాన్ జట్టుకు ఉత్తమ కోచ్‌లుగా భావించనని చెప్పుకొచ్చాడు. సోమవారం ప్రకటించిన పాక్ ప్రపంచ కప్ జట్టు ఎంపిక ప్రక్రియలో కూడా రమీజ్ ప్రమేయమున్నట్లు తెలుస్తోంది. “బయో-బబుల్ వాతావరణంలో నేను నా కుటుంబానికి దూరంగా గణనీయమైన సమయాన్ని గడపాల్సి ఉంటుందని భావించి, నేను కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను” అని మిస్బా ఒక ప్రకటనలో తెలిపారు.

    మధ్యాహ్నం 1 గంట సమయంలో 15 మంది సభ్యుల పాక్‌ బృందాన్ని పీసీబీ ప్రకటించింది. బాబర్‌ అజమ్‌ కెప్టెన్‌గా.. ఐదుగురు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌, ఇద్దరు వికెట్‌ కీపర్స్‌, నలుగురు ఆల్‌రౌండర్స్‌, నలుగురు ఫాస్ట్‌ బౌలర్స్‌ ఉన్నారు. ఫఖర్‌ జమన్‌, ఉస్మాన్‌ ఖాదీర్, షాహనవాజ్‌ దహానిలు రిజర్వ్‌ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు. సీనియర్‌ ఆల్‌రౌండర్‌ షోయబ్‌ మాలిక్‌, మరో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌లకు చోటు దక్కలేదు.

    Related Stories