More

  ఉగ్రభూతానికి అగ్ర దేశాల ఊడిగం..! త్వరలో FATF నుంచి బయటికి పాక్..!!

  పాకిస్థాన్ కు ఈ వారం చాలా ముఖ్యమైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2018లో FATF గ్రే లిస్ట్ లోకి ప్రవేశించిన ఉగ్రవాద దేశం,.. అదే లిస్ట్ లో కొనసాగుతుందా..? లేక బయటపడుతుందా..? అన్నది కొద్దిరోజుల్లో తేలిపోతుంది. దీనికి సంబంధించిన సమావేశం అక్టోబర్ 20, 21 తేదీల్ల పారిస్‎లో.. సింగపూర్‎కు చెందిన టి. రాజా కుమార్ అధ్యక్షతన జరగనుంది. అసలే ఎప్పుడూ అప్పులతో, పెదరికంతో, ఆకలి కేకలతో అలమటించే పాకిస్థాన్ పరిస్థితి,.. FATF గ్రే లిస్ట్ లోకి వెళ్లిన తర్వాత మరింత దుర్భరంగా తయారైంది. గ్రే లిస్ట్ లో ఉన్న కారణంగా ఐఎంఎఫ్, ఏషియన్ డెవలప్‎మెంట్ బ్యాంక్, యూరోపియన్ యూనియన్, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు పుట్టడం కష్టమవుతోంది. అందుకే, FATF నుంచి బయటకి రావడానికి పాకిస్థాన్ మల్ల గుల్లాలు పడుతోంది. గ్రే లిస్ట్ నుంచి బయటకి రావడానికి FATF ప్రతిపాదిత 34 యాక్షన్ ఐటమ్స్‎ను సంతృప్తి పరిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అంతేకాదు, గ్రే లిస్ట్ నుంచి బయటకి రావడానికి గత జూన్‎లో జరిగిన FATF ప్లీనరీ మీటింగ్ ముందు.. హడావుడిగా ఉగ్రవాది సాజిద్ మీర్‎ను అరెస్ట్ చేసింది పాకిస్తాన్. 2008 ముంబై దాడుల మాస్టర్ మైండ్స్‎లో ఒకడైన సాజిద్ అరెస్ట్ ద్వారా.. తాము FATF యాక్షన్ ఐటమ్స్‎ను సంతృప్తి పరుస్తున్నామన్న మెసేజ్ ఇచ్చింది. జైష్-ఏ-మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ఆఫ్ఘనిస్తాన్‎లో ఉన్నాడాని కూడా చెప్పింది. దీంతో పాకిస్థాన్ FATF నుంచి బయటకి రావడం దాదాపు ఖాయమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

  ఏంటి పాకిస్థాన్‎ను పొగుడుతున్నానని అనుకుంటున్నారా..? పొగడటం లేదు. పశ్చిమ దేశాలు, పాకిస్థాన్ మిత్ర దేశాలు దాని గురించి చేస్తున్న ప్రచారం గురించి చెబుతున్నానంతే. పశ్చిమ దేశాలు పాకిస్థాన్‎ను FATF నుంచి బయటకి తేవడానికి కంకణం కట్టుకున్నాయి. అందుకే, మసూద్ అజహర్ పాకిస్తాన్ లోనే ఉన్నాడని తెలిసినా అమెరికా సహా, యూరప్ దేశాలు చూసీ చూడనట్టు వ్యవహరించాయి. దీంతో మసూద్ అజహర్ పాకిస్థాన్‎లో ఉన్నాడని.. తమ దేశంలో లేడని తాలిబాన్లు మొత్తుకుంటున్నా వినే నాధుడు కరువయ్యాడు. పాకిస్థాన్ లాంటి దేశంలో శిక్ష పడిన ఖైదీకి జైలు జీవితం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అయినా దానిని పరిగణలోకి తీసుకుని పాకిస్థాన్ మనీ లాండరింగ్ చేయడంలేదని, తీవ్రవాదులకు సహకరించట్లేదని.. అసలు పాకిస్థాన్ పూర్తిగా మారిపోయి నయా పాకిస్థాన్ గా మారిపోయిందనే భ్రమను కల్పించే ప్రయత్నమ చేస్తున్నాయి. వడ్డించే వాడు మనవాడైతే చివర్లో ఉన్నా కూడా కడుపు నిండుతుందన్నట్టు.. పాకిస్థాన్ తో దోస్తీ కొన్ని దేశాలకు అవసరం కాబట్టి.. దాని మీద ఈగ వాలనీయడం లేదు. అసలు పాకిస్తాన్ ను ఎవరు కాపాడుతున్నారు..? ఎందుకు..? పాకిస్థాన్ లాంటి దేశాన్ని కాపాడితే వాళ్లు ఒనగూరే ప్రయోజనమేంటి..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  ముందుగా అమెరికా గురించి మాట్లాడుకుందాం. అమెరికా, పాకిస్థాన్ సంబంధాలు ఇప్పటివి కాదు. దేశ విభజన తర్వాత భారత్ సోవియట్ కు దగ్గరైతే.. పాకిస్థాన్ అమెరికాకు దగ్గరైంది. ఎంతలా దగ్గరైందంటే.. 1971లో బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ పట్టు కోల్పోకూడదని.. మన మీదకి న్యూక్లియర్ వెస్సల్స్ ను కూడా పంపింది. కానీ, సోవియట్ రాకతో అమెరికా వ్యూహం ఫలించలేదు. కాలక్రమేణా మనం అమెరికా కూడా దగ్గరవుతూ వచ్చాం. ఆర్ధికంగా, రక్షణ పరంగా ఎన్నో ఒప్పందాలు చేసుకుంటూ ఒక బలమైన భాగ్యమస్వామ్యం ఏర్పరుచుకున్నాం. అయితే ఇదంతా తెర ముందే. తెర వెనక కథ వేరు. రాజకీయాల్లో ఎప్పుడూ కనపడేది, జరిగేది ఒకటి కాదు. మనం అమెరికా ఎంత బలమైన భాగస్వాములమని గొప్పలు చెప్పుకున్నా.. రెండు దేశాల మధ్య ఎప్పటికీ ఏదో ఒక విషయంలో గోడవలు ఉంటూనే ఉంటాయి. దీనికి ప్రధాన కారణం, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న స్వాతంత్ర్య విధానం. భారత్ ఇదివరకట్లా ఎవ్వరి ఒత్తిళ్లకు తలొగ్గట్లేదు. రష్యా ఉక్రెయిన్ విషయంలోనూ భారత్ స్వప్రయోజనాలకే పెద్దపీట వేయడం మనం చూశాం. రష్యా నుంచి చమురు తీసుకునే విషయంలో భారత్ మీద ఎంత విష ప్రచారం చేసినా,.. భారత్ ఏమాత్రం తలొగ్గలేదు. మనకి లాభదాయకమైన రష్యా చమురు తీసుకుని అమెరికా దాని భాగస్వాములకి షాక్ ఇచ్చాం. అంతే కాదు, వాళ్ళు ఒకటంటే, మనం పది అంటున్నాం. దీంతో ఇది వరకట్లా భారత్ మీద పెత్తనం చేయలేమని,.. ఒత్తిడికి గురి చేసి లొంగతీసుకోలేమని అర్ధం అయ్యింది. అందుకే పాకిస్థాన్ ను వాడుకుని భారత్ లో కల్లోలం సృష్టించి ఆర్ధికంగా ఎదగకుండా అడ్డుకోవాలని కుట్రలు పన్నుతోంది. పాకిస్థాన్ తో F-16 అప్ గ్రేడ్ చేయడం లాంటివి చేస్తోంది. ఇటీవల పాకిస్థాన్ లోని అమెరికా రాయబారి పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‎కి వెళ్ళి దానిని ఆజాద్ కశ్మీర్ అని పెద్ద దుమారానికి తెర లేపాడు.

  ఇక జర్మనీ విషయానికి వస్తే.. యూరోపియన్ యూనియన్‎లో అత్యంత ధనిక దేశం. ఒక పక్కన కోవిడ్ వలన రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల అంధకారం లోకి వెళ్తుంటే.. ఇదే సమయంలో భారత్ సుస్థిరమైన అభివృద్ధిని కనబర్చింది. అదీకాకుండా తొందర్లోనే భారత్ ఆర్థిక వ్యవస్థ జర్మనీ అధిగమించనుందన్న గణాంకాలు వెలువడుతున్నాయి. దీంతో ఆర్థిక ప్రగతిని జర్మనీ తట్టుకోలేకపోతోంది. అందుకే, కావాలని కశ్మీర్ విషయాన్ని రాజేస్తోంది. అంతేకాదు, పాకిస్థాన్‎ను FATF నుంచి బయటకు తేవాలని గట్టిగా ప్రయత్నిస్తున్న దేశాలలో జర్మనీ ఒకటి. అందుకే జుబైర్ అరెస్ట్ అయినప్పుడు.. భారత్ లో పత్రికా స్వేచ్ఛ అవసరమంటూ చిలక పలుకులు పలికింది.

  ఇక యూకే విషయానికి వస్తే భారత్ ని మూడు ముక్కలుగా విడగొట్టినా, ట్రిలియన్ డాలర్లు దోచుకు వెళ్ళినా తృప్తిగా లేనట్లుంది. 1947 తర్వాత నుంచి కూడా పాకిస్థాన్ తోనే సన్నిహితంగా ఉంటూ ఉగ్రవాద దేశాన్ని కాపాడుతూ వస్తోంది. 1971 యుద్ధంలో అమెరికాతో పాటు కలిసి భారత్ మీద దాడి చేయడానికి వచ్చింది యూకే. ఇలాంటివి యూకే గురించి చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. మన దేశంలో మిషనరీస్ ఆఫ్ చారిటీ అక్రమాలపై విచారణ జరుగుతన్న సమయంలో.. ఇదే విషయంపై ఆగమేఘాల మీద పార్లమెంటులో చర్చించి భారత్ పై ఒత్తిడి తెచ్చింది యూకే. దీంతో భారత్ కాస్త వెనక్కి తగ్గి మిషనరీస్ ఆఫ్ చారిటీస్ కి పర్మిషన్ రెన్యువల్ చేయాల్సి వచ్చింది. ఇది భారత్ పై ఒత్తిడి తేవడం కాదా..?

  ఇక, రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలయినప్పటి నుంచి ఉక్రెయిన్ కు పశ్చిమ దేశాల నుంచి విపరీతంగా ఆయుధాలు అందుతున్న సంగతి మనకు తెలిసిందే. అందులో భాగంగానే యూకే తన ఆయుధాలు పాకిస్థాన్ హెలికాప్టర్ల ద్వారా పంపిస్తున్న విషయం బయటకి వచ్చింది. దీనిబట్టి ఈ రెండు దేశాల మధ్య మైత్రి ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. అంతే కాదు, ఈ మధ్య యూకేలోని లీసెస్టర్ లో హిందువుల మీద దాడి జరిగితే యూకే ప్రభుత్వం ఎలా స్పందించిందో మనం చూశాం. భారత్ విషయంలో మైనారిటీ మానవ హక్కుల గురించి గొంతు చించుకునే యూకే తమ దేశంలోనే ఉంటున్న మైనారిటీలను గాలికొదిలేసింది.

  ఇక ఇటలీ విషయనికి వస్తే ఏ యూరోపియన్ దేశం కూడా అమ్మనన్ని ఆయుధాలు ఇటలీ.. పాకిస్థాన్ కు అమ్ముతోంది. పాకిస్థాన్ ఆ ఆయుధాలు ఎవరి మీద ఉపయోగిస్తుందో ప్రత్యేకంగా చెప్పనసరం లేదు కదా..! ఇలా చెప్పుకుంటూ పోతే పాకిస్థాన్ కు చాలా దేశాలు వెన్ను దన్ను ఇస్తూ దానిని కాపాడుతున్నాయి. మామూలుగా ఉగ్రవాదం మీద యుద్ధం చేస్తున్నామని చిలకపలుకులు పలికే పశ్చిమ దేశాలు.. పాకిస్థాన్ లాంటి దేశానికి సహాయం చేసి ఏం చెప్పదలుచుకున్నాయి..? 9/11 దాడుల తర్వాత ఒసామా బిన్ లాడెన్ మీద పగా తీర్చుకోవడానికి అమెరికా సుమారు దశాబ్దం పాటు ఆఫ్ఘనిస్తాన్ లో మారణ హోమం సృష్టించింది. మరోవైపు పాకిస్థాన్ లాడెన్ కు తన దేశంలో ఆశ్రయం ఇచ్చింది. ఇది తెలిసి కూడా అమెరికా పాకిస్థాన్ తో స్నేహం చేస్తోందంటే ఉగ్రవాదం పైన అమెరికా స్టాండ్ ఎంటో అర్ధమవుతోంది.

  ‘బ్లీడ్ ఇండియా బై థౌజండ్ కట్స్’ అనేది పాకిస్థాన్ సిద్ధాంతం. విడిపోయినప్పటి నుంచి భారత్ మీద కుతంత్రాలు చేస్తూనే ఉంది. దీనికి అమెరికా లాంటి దేశాలు ప్రత్యక్ష, పరోక్ష సహాయం చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు భారత్ ఇంతకుముందులా బలహీనమైన దేశం కాదు. కాబట్టి ఈ పశ్చిమ దేశాలకు పాకిస్థాన్ అవసరం వచ్చింది. భారత్ క్రమ క్రమంగా ఎదుగుతూ వస్తోంది. ఇప్పటికే యూకేని అధిగమించిన భారత్, త్వరలో జర్మనీని దాటడంతో పాటు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా.. ఎదగబోతోందని ఆర్ధిక విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అంతేకాదు, భారత్‎పై వేలెత్తిచూపేవాళ్లను అంతర్జాతీయ వేదికలపై తూర్పారబట్టకుండా వదలడం లేదు. ఈ విషయంలో మన విదేశాంగ మంత్రి జైశంకర్.. విదేశీ శక్తిలకు తగిన రీతిలో జవాబు చెబుతున్నారు.

  భారత్ ఇలా మునుపటికంటే ధృడంగా తయారవుతోంది కాబట్టి.. విదేశీ శక్తులు మన మీద వీలైనన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నాయి. ఉగ్రవాదులపై ఎలాంటి చర్యలు తీసుకోకున్నా.. కావాలని ఆ దేశాన్ని FATF నుంచి బయటకి తేవాలని ప్రయత్నిస్తున్నాయంటే.. ఆ దేశాల దుర్బుద్ధిని మనం అర్ధం చేసుకోవచ్చు. అయితే, ఇలాంటి కుట్రలు మోదీ ప్రభుత్వానికి అర్థం కావని అనుకోవడం పొరపాటే అవుతుంది.

  Trending Stories

  Related Stories