International

తదుపరి ప్రవక్త తానేనని అన్న మహిళ.. పాకిస్తాన్ కోర్టు విధించిన శిక్ష ఏమిటంటే..?

పాకిస్తాన్ శిక్షాస్మృతి (పిపిసి) సెక్షన్ 295 సి కింద దైవదూషణ ఆరోపణలపై ముస్లిం మహిళకు పాకిస్థాన్ సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. స్థానిక మసీదుకు చెందిన క్వారీ ఇఫ్తిఖర్ అహ్మద్ రజా అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు ఆ మహిళపై 2013 సెప్టెంబర్ 2 న నిష్టర్ కాలనీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సల్మా తన్వీర్ అనే మహిళ తన సొంత ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపాల్. తదుపరి ప్రవక్త తానే అని చెప్పుకునే సందేశాలను కలిగి ఉన్న ఫోటోకాపీలను ఆమె పంచినట్లు ఆరోపించబడింది.

మహిళ న్యాయవాది అయిన మియాన్ ముహమ్మద్ రంజాన్ సంఘటన గురించి మాట్లాడుతూ ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో ఆమె మానసిక స్థితి సరిగా లేదని తెలిపారు. అంతేకాకుండా ఫోటోకాపీలు తారుమారు చేయబడ్డాయని కూడా వాదించారు. అయితే స్థానిక మత పెద్ద మాత్రం మహ్మద్ ప్రవక్తను ఆమె దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కేసును విచారిస్తున్న జిల్లా అదనపు సెషన్స్ కోర్టు జడ్జి మన్సూర్ అహ్మద్ తీర్పును వెలువరించారు. ఇస్లాంలో చివరి ప్రవక్త మహ్మద్ ప్రవక్త కాదని ఆమె దైవదూషణకు పాల్పడ్డారని అన్నారు. ఆమెకు మరణశిక్ష విధిస్తున్నామని దాంతో పాటు 5 వేల పాక్ రూపీల జరిమానాను వేస్తున్నామని తీర్పునిచ్చారు.

ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని ఆమె తరఫు న్యాయవాది వాదించినా.. పంజాబ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ మాత్రం ఆమె ఆరోగ్యం అంతా బాగానే ఉందంటూ మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో ఆమెకు కోర్టు శిక్షను ఖరారు చేసింది. న్యాయమూర్తి మాట్లాడుతూ భౌతిక సాక్ష్యాలు ఆ మహిళ స్వయంగా వ్రాసినట్లు రుజువు చేశాయని.. ఆమె అరెస్టయ్యే ముందు స్కూలు నడుపుతుండేదని.. దీంతో ఆ మహిళకు చట్టపరంగా పిచ్చి లేదని న్యాయమూర్తి నిర్ధారించారు. ఆమె చేసిన నేరాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నామని అన్నారు. పాక్ తెచ్చిన వివాదాస్పద దైవదూషణ చట్టం కింద 1987 నుంచి ఇప్పటిదాకా 1,472 మందికి శిక్షలు విధించారు.

Related Articles

Back to top button