టోక్యో ఒలింపిక్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. భారత్ కు అథ్లెటిక్స్ లో గోల్డ్ అందించాడు. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను స్వర్ణం గెలిచిన రోజున, తన జావెలిన్ ఎక్కడ ఉందో గుర్తించలేకపోయానని.. దీంతో తాను కాస్త ఆందోళన చెందినట్లు కూడా వెల్లడించాడు.
తాను ఫైనల్‌కు సిద్ధమవుతున్న సమయంలో సడెన్‌గా తన జావెలిన్ కనిపించకుండా పోయిందని అతను చెప్పాడు. ఆ జావెలిన్‌ను పాకిస్తాన్ కు చెందిన అర్షద్ నదీమ్ తీసుకెళ్లాడని నీరజ్ అన్నాడు. ఫైనల్ ప్రారంభమయ్యే ముందు నేను జావెలిన్ కోసం చూస్తున్నాను. కానీ అది దొరకలేదు. అయితే అది అర్షద్ నదీమ్ చేతుల్లో కనిపించింది. నా జావెలిన్‌తో అతడు అటూ ఇటూ తిరుగుతున్నాడు. అది చూసి.. భాయ్ ఆ జావెలిన్ ఇవ్వు. అది నాది. నేను ఫైనల్లో దానినే విసరాలి అని అడిగాను. దీంతో అర్షద్ దానిని తిరిగి ఇచ్చేశాడు అని నీరజ్ చెప్పుకొచ్చాడు. ఈ గందరగోళం వల్లే తాను తన తొలి త్రోను హడావిడిగా విసరాల్సి వచ్చిందని నీరజ్ తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు. “తుది రౌండ్ ప్రారంభంలో నా జావెలిన్ కోసం వెతుకుతున్నా.. కానీ దానిని గుర్తించలేకపోయాను.. అకస్మాత్తుగా పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ తన జావెలిన్ ను తీసుకుని తిరుగుతూ కనిపించాడు. ఆ జావెలిన్ తోనే పోటీకి దిగాలి.. తనకు తిరిగి ఇవ్వమని నదీమ్‌ని కోరాను. నదీమ్ దానిని తిరిగి ఇచ్చాడు.. దీని కారణంగా, మొదటి త్రోలో నేను తొందరపాటుతో కనిపించాను” అని చోప్రా చెప్పుకొచ్చాడు.
నదీమ్ దగ్గర నుండి జావెలిన్ తీసుకుంటున్న వీడియో గమనించవచ్చు:
చోప్రా అర్షద్ నదీమ్‌ని సంప్రదించి తన జావెలిన్‌ను వెనక్కి తీసుకోవడం వీడియోలో చూడవచ్చు. నీరజ్ ఆ తర్వాత తన జావెలిన్‌ను దగ్గరగా పరిశీలించి త్రో కోసం వెళ్లాడు. త్రో తర్వాత అతని బాడీ లాంగ్వేజ్ చూస్తే తాను అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయానని నిరాశ చెందినట్లు కనిపించింది. ఈ క్లిప్ చాలా చిన్నదిగా ఉంది. వాస్తవానికి ఏమి జరిగి ఉందో.. అర్షద్ నదీమ్ దగ్గర నీరజ్ చోప్రా జావెలిన్ ఎందుకు ఉందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఒలింపిక్స్ లో ఫైనల్స్ కు ముందు ఒక భారతీయ అథ్లెట్ జావెలిన్‌తో పాకిస్థాన్ అథ్లెట్ ఏమి చేస్తున్నాడనే దానిపై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలకు దారితీసింది. ఒలింపిక్స్‌లో నీరజ్ అవకాశాలను దెబ్బతీసే క్రమంలో నదీమ్ జావెలిన్‌ను ట్యాంపరింగ్ చేశాడా అని చాలామంది ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు.
నీరజ్ చోప్రా గోల్డ్ గెలవగానే పలువురు పాకిస్తాన్ కు చెందిన సెలెబ్రిటీలు, క్రీడాకారులు.. భారత ప్రభుత్వం నీరజ్ చోప్రా శిక్షణకు పెట్టిన ఖర్చు.. అతడి ప్రాక్టీస్ కోసం చేసిన ఏర్పాట్లను చెబుతూ ఇరు దేశాల ప్రభుత్వాల్లో ఉన్న తేడాలను ఎత్తి చూపారు. పాకిస్తాన్ ప్రభుత్వం అథ్లెట్లకు ఏ మాత్రం సదుపాయాలను కల్పించలేకపోయిందని ఆ దేశ వాసులే విమర్శలు గుప్పించారు. నదీమ్ కు కనీసం సదుపాయాలను కల్పించడంలో పాక్ ప్రభుత్వం విఫలమవ్వగా.. నీరజ్ చోప్రాకు వివిధ దేశాల్లో ప్రాక్టీస్ కు భారత ప్రభుత్వం అవకాశం కల్పించిందని చెప్పుకొచ్చారు.
గోల్డ్ మెడల్ గెలిచి వచ్చినప్పటి నుంచీ నీరజ్ సన్మాన కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడు అనారోగ్యానికి కూడా గురయ్యాడు. మెడల్ గెలవగానే ఇలా సెలెబ్రేషన్స్ లో మునిగిపోవడం కూడా సరైనది కాదని నీరజ్ చెప్పుకొచ్చాడు. నెల రోజుల తర్వాత అందరూ సైలెంట్ అయిపోయి.. కనీసం పట్టించుకోరని అన్నాడు. స్పోర్ట్స్‌కు ఎప్పుడూ ఇదే విధమైన అటెన్షన్ ఉండాలని చెప్పాడు. అన్నీ ఒక సిస్టమాటిక్ గా జరగాలని నీరజ్ కోరాడు.