International

పంజ్ షీర్ వ్యాలీపై పాకిస్తాన్, తాలిబాన్ల దాడి

పంజ్ షీర్ వ్యాలీని సొంతం చేసుకోడానికి తాలిబాన్లు చేసిన ప్రయత్నం విజయవంతమైందని కథనాలు వస్తున్నాయి. తాలిబాన్లకు పాకిస్తాన్ కూడా చేయి కలపడంతో పంజ్ షీర్ తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆదివారం నాడు పంజ్‌షీర్ లోని రెసిస్టెన్స్ దళాలపై పాకిస్తాన్, తాలిబాన్లు కలిసి దాడి చేసినట్లు తెలుస్తోంది. పంజ్ షీర్ ప్రాంతంపై పాకిస్తాన్ వైమానిక దళం డ్రోన్‌లతో బాంబు దాడి చేసినట్లు జర్నలిస్టులు తెలిపారు. దాడికి స్మార్ట్ బాంబులను ఉపయోగించారని నివేదికలు సూచిస్తున్నాయి. “నాకు కొన్ని సెకన్ల పాటు శాటిలైట్ ఇంటర్నెట్ వచ్చింది. పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా పంజ్ షీర్ పై బాంబు దాడులు జరుగుతున్నాయి. మాపై ఐఎస్ఐ ప్రత్యక్ష దండయాత్ర చేస్తోంది. మా పౌరులు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. కొన్ని రోజుల్లో మీరు నా నుండి ఏదీ వినకపోతే ఇది ఎప్పటికీ నా చివరి ట్వీట్ కావచ్చు, ” పంజ్‌షీర్‌లో ఫ్రంట్‌లైన్స్‌లో పోరాడుతున్న సైనికుడు ట్వీట్ చేశాడు.

ఆఫ్ఘనిస్తాన్ వార్తా సంస్థలో పని చేసే జర్నలిస్ట్ ఎలియాస్ నవాందీష్ పంజ్ షీర్ ప్రావిన్స్‌పై ఆకాశం నుండే కాకుండా భూమిపై నుండి కూడా దాడులు జరుగుతున్నాయి అని ట్వీట్ చేశారు. పంజ్‌షీర్‌లో తాలిబాన్ తీవ్ర దాడులు చేస్తున్నప్పుడు, పాకిస్థాన్ ఐఎస్ఐ చీఫ్ కాబూల్‌లో ఉన్నాడని.. ఈ పరిణామాలన్నీ ప్రపంచం చూస్తోందని స్థానికులు చెబుతున్నారని నవాందీష్ ట్వీట్ చేశారు.

ఘనీ స్థానంలో ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ తనను తాను ఆపద్ధర్మ దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. సలేహ్ పంజ్ షీర్ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చారు. తాలిబాన్లు కాబూల్ లో కాలుమోపాక దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన 10 వేల మంది పంజ్ షీర్ లోయకు తరలి వచ్చారని, వారంతా ఇప్పుడు మసీదులు, పాఠశాలలు, ఆసుపత్రుల్లో తలదాచుకుంటున్నారని వెల్లడించారు. వారందరికీ ఆహారం అందించడం కష్టసాధ్యంగా ఉందని, ఆకలి, పోషకాహార లోపంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అమృల్లా సలేహ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అమ్రుల్లా సలేహ్ ఇంటిపై దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, సలీహ్ తన ఇంటిపై హెలికాప్టర్ దాడి చేయడంతో ఆయన్ను సురక్షిత ప్రాంతానికి తరలించారని అంటున్నారు. అహ్మద్ మసూద్ కూడా సురక్షితంగా ఉన్నారని చెప్పారు. ఒకవేళ తాలిబన్ల దాడిలో తాను గాయపడితే తన తలకు గురిపెట్టి రెండు రౌండ్లు కాల్పులు జరపాలని సలేహ్ ఇప్పటికే తన అంగరక్షకుడికి స్పష్టం చేశారు. మరణించేందుకైనా సిద్ధం తప్ప, తాలిబన్ల ముందు ఎప్పటికీ తలవంచేది లేదని అన్నారు.

రెసిస్టెన్స్ ఫ్రంట్ అధికార ప్రతినిధి మరియు ప్రసిద్ధ జర్నలిస్ట్, పంజ్‌షీర్‌లో తాలిబాన్‌లతో పోరాడుతున్న ఫహీం దస్తీ సెప్టెంబర్ 5 న జరిగిన పోరాటంలో మరణించారు. ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన మరో సీనియర్ సభ్యుడు జనరల్ అబ్దుల్ వుడోద్ జారా కూడా మరణించాడు. పంజ్‌షీర్ రెసిస్టెన్స్ నాయకుడు అహ్మద్ మసౌద్ మేనల్లుడే అబ్దుల్ వుడోద్ జారా.

ఆఫ్ఘ‌న్‌లో పరిస్థితులపై భార‌త విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా స్పందించారు. భార‌త్ లేవనెత్తుతున్న ఆందోళనల పట్ల సానుకూలంగా స్పందిస్తామని తాలిబాన్లు చెప్పారట. ఆఫ్ఘ‌న్‌లో పాకిస్తాన్ చర్యలను భారత్ తో పాటు అమెరికా గమనిస్తున్నాయని తెలిపారు. ఆఫ్ఘ‌న్‌లో పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని.. ఆ దేశం ప‌ట్ల‌ అమెరికా వేచి చూసే ధోరణిని అవలంబిస్తోందని తెలిపారు. భారత్ కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తోందని చెప్పారు. ఆఫ్ఘ‌న్‌లో ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయ‌ని, వాటి ప‌ర్య‌వ‌సానాలు ఎలా ఉంటాయో గమనిస్తున్నామని తెలిపారు. ఆఫ్ఘ‌న్‌ ఉగ్రవాదుల‌ అడ్డాగా మారుతుందేమోనన్న విష‌యంపై మాత్రం భారత్ వ్య‌క్తం చేస్తోంది. ఆఫ్ఘ‌న్‌లో ఎన్నో శక్తులకు పాక్‌ అండగా నిలిచిందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఆంక్షల జాబితాలో ఉన్న జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్ర‌ సంస్థలు ఆఫ్ఘ‌న్‌లోకి స్వేచ్ఛగా ప్రవేశిస్తున్నాయని తెలిపారు. వారి కదలికలపై నిఘా ఉంచామని చెప్పారు. ఆ దేశం నుంచి ఎలాంటి ఉగ్ర కార్యకలాపాలు జ‌రిగినా ఆ బాధ్య‌త‌ తాలిబాన్లదేన‌ని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

one × five =

Back to top button