More

  కశ్మీర్‎లోకి స్టికీ బాంబ్స్..
  చైనా ప్రోద్బలంతో పాక్ కొత్త పన్నాగం..!

  పాకిస్తాన్ ను గుడ్డిగా నమ్మడం ఎంత పొరపాటో మరోసారి రుజువైంది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ విషయంలో కలిసినట్టే కలిసి చెయ్యిచ్చింది. మొన్నటికిమొన్న రెండు దేశాలు చర్చించుకొని కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఇది జరిగి వారం కూడా గడవకముందే.. పాకిస్తాన్ తన వక్రబుద్ధి ప్రదర్శించింది. అసలు భారత్ ప్రతిపాదనకు పాక్ తలూపినప్పుడే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడే అవే అనుమానలు నిజమవుతున్నాయి. కాల్పుల విరమణకు ఒప్పుకుని.. మరో రూట్లో కుట్రలకు తెరతీసింది పాకిస్తాన్. కాల్పులు లేకపోయేసరికి ఇప్పుడు బాంబులు విసురుతోంది. ఈ విషయంలో కొత్త పంథాను ఎంచుకుంది.

  డ్రోన్ల ద్వారా కశ్మీర్ భూభాగంలో ‘స్టికీ బాంబు’లను వదులుతోంది పాకిస్తాన్. మామూలు బాంబుల కంటే ఈ స్టికీ బాంబులు చాలా ప్రమాదకం. ఎందుకంటే వీటిలో అయస్కాంతాలు ఉపయోగించడం వల్ల వీటిని ట్రైన్లు, బస్సుల లాంటి వాటిలో అమర్చి ఈజీగా పేల్చేసే అవకాశం వుంది. ఉగ్రవాదులు దూరం నుంచే రిమోట్ల ద్వారా ఈ స్టికీ బాంబులను పేల్చవచ్చు. గతంలో అప్ఘనిస్థాన్ లో ఇదే తరహా బాంబులతో ముష్కరులు మారణ హోమం సృష్టించారు. ఈ బాంబులు ఐఈడీ లాగే ఉన్నా వాటికంటే కాస్త చిన్నగా ఉంటాయి. ఐఈడీ అంటే ఇంప్రూవైస్డ్ ఎక్స్ ప్లాయిటేటివ్ డివైజెస్. వీటిని రోడ్డు పక్కన ఏదైనా వస్తువులో అమర్చి పెడతారు. వీటిపై ఎవరైనా కాలు పెడితే చాలు.. వెంటనే ఆ బాంబు పేలుతుంది. స్టికీ బాంబ్ దీని కంటే ఎంతో ప్రమాదకరమైనది. ఎందుకంటే దీన్ని ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసే వీలుంటుంది. ఈ బాంబ్ ని కావాల్సిన ప్రదేశంలో అమర్చి రిమోట్ కంట్రోల్ ద్వారా దాన్ని ఆపరేట్ చేసే వీలుంటుంది.

  కశ్మీర్ లో సోదాలు నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు ఈ స్టికీ బాంబ్స్ కుప్పలు తెప్పలుగా దొరుకుతున్నాయి. వీటిని పాకిస్థానీ టెర్రరిస్టులు అప్ఘనిస్తాన్ తాలిబన్ల సాయంతో ఈ బాంబులు కాశ్మీర్ లో విడిచి ప్రాణ నష్టం కల్పించేందుకు ప్రయత్నిస్తోందేమో అని అధికారులు అనుమానిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత భద్రతను కట్టుదిట్టం చేశారు. దీని ఫలితంగా అక్కడ ప్రస్తుతం ఎలాంటి హింసాత్మక చర్యలు జరగట్లేదు. అయితే ఈ శాంతికి భంగం కల్పించేందుకు తీవ్రవాదులు ఈ బాంబుల ద్వారా ప్రయత్నిస్తున్నారేమో అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి భద్రతా బలగాలు.

  అసలు ఈ బాంబులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఆయా ప్రదేశాలకు వాటిని ఎవరు తెచ్చి విడిచి పెడుతున్నారు వంటి విషయాలన్నింటినీ పరిశీలిస్తున్నారు. డ్రోన్ల ద్వారా లేదా భారత్ నుంచి పాక్ కి తవ్వుతున్న కొన్ని సొరంగాల ద్వారా వీటిని దేశంలోకి తీసుకువస్తున్నట్లు భద్రతా అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ఈ సొరంగాలు బయట పడుతున్న కొద్దీ వాటిని మూసేస్తూ ఆ ప్రదేశాల్లో భద్రతను మరింత పెంచుతున్నారు. ఈ స్టికీ బాంబ్ లు ఏ వాహనానికైనా సులువుగా అతుక్కుపోతాయి. అందుకే ఇకపై ప్రైవేట్ వాహనాలకు ఆర్మీ వాహనాలకు మధ్య దూరం కొనసాగించాలని.. అలాగే ఆర్మీ వాహనాల చుట్టూ కెమెరాల ద్వారా ఇలాంటి బాంబులు అతుక్కుంటే తెలుసుకునేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు డ్రోన్ల ద్వారా అనుమానం ఉన్న ప్రదేశాల్లో గస్తీ కొనసాగించనున్నారు.

  ఇదిలావుంటే, ఈ స్టికీ బాంబుల కుట్ర వెనుక చైనా హస్తం వుందోమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బీజింగ్ ప్రోద్బలంతోనే పాకిస్తాన్ స్టికీ బాంబులు వదులుతోందని రక్షణ రంగ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఇటీవలి కాలంలో చైనా కుట్రలను భారత్ అడుగడుగునా అడ్డుకుంటోంది. సరిహద్దుల్లో తన కుయుక్తులు పారకపోయేసరికి.. తన మిత్రదేశం పాకిస్తాన్ ను భారత్ పైకి ఎగదోస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఇలా పాకిస్తాన్ బోర్డర్ లో ఉద్రిక్తతలను పెంచి.. మళ్లీ లద్దాక్ లో లాడాయి మొదలు పెట్టాలని చూస్తోంది జిత్తులమారి డ్రాగన్.

  Trending Stories

  Related Stories