14 ఏళ్ల బాలికను పెళ్లాడిన పాకిస్తానీ ఎంపీ

0
856

ఓ పాకిస్తానీ పార్లమెంటు సభ్యుడు చేసిన పాపపు పని.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. రిటైర్ కావాల్సిన వయసులో పెళ్లి చేసుకున్నాడు. అదేంటి ఏజ్ ఎక్కువైనంత మాత్రాన పెళ్లి చేసుకోవద్దా..? అని మీరు ప్రశ్నించవచ్చు. చేసుకోవచ్చు తప్పులేదు. తనకంటే ఐదారేళ్లు చిన్నవయసులో ఉన్న మహిళను పెళ్లాడొచ్చు. కానీ, మౌలానా సలాహుద్దీన్ అయూబీ అనే 50 ఏళ్ల ఎంపీ.. మైనార్టీ కూడా తీరని ఓ పద్నాలుగేళ్ల బాలికను ఇస్లామాబాద్ లో పెళ్లి చేసుకున్నాడు. ఇది తప్పు కదా..? జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం నేత అయిన నడివయసు నాయకుడు చేసిన పనికి అంతా దుమ్మెత్తిపోస్తున్నారు. సలాహఉద్దీన్ చేసిన ఘనకార్యం స్థానిక ‘డాన్’ పత్రికలో ప్రచురితమైంది. దీంతో పాక్‌తో పాటు పలు దేశాల్లో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. తనకంటే నాలుగింతలు చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే వార్త సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.

సలాహుద్దీన్ వివాహం చేసుకున్న బాలిక.. స్థానిక జుగూర్ ప్రభుత్వం బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకుంటోంది. ఆ పాఠశాల రికార్డుల ప్రకారం.. ఆ బాలిక 2006 అక్టోబర్ 28న జన్మించినట్లు గా నమోదయ్యింది. దీని ప్రకారం ఆ బాలిక ఇంకా మైనరే. పాకిస్తాన్ లో అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాలిక వివాహ వయస్సు 16. కానీ, 14 ఏళ్లకే సలాహుద్దీన్ ఆ బాలికను వివాహం చేసుకున్నాడు. దీంతో ఎంపీ చేసిన పనికి పాకిస్తాన్ లో మహిళా సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన ఎంపీ ఇలా తప్పుడు పని చేస్తే ఎలా అంటూ తిట్టిపోస్తున్నారు. చ‌ట్టాలు సామాన్యుల‌కే త‌ప్ప‌ రాజ‌కీయ‌ నాయ‌కులకు పట్టవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సలాహుద్దీన్ ఘనకార్యంపై స్థానిక మహిళా సంక్షేమ స్వచ్ఛంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పాకిస్తాన్ పోలీసులు బాలిక పెళ్లి ఉదంతంపై దర్యాప్తు చేశారు. అయితే తాము ఈ పెళ్లి చేయలేదని, తమకు పెళ్లితో ఎలాంటి సంబంధం లేదని బాలిక తల్లిదండ్రులు అఫిడవిట్ సమర్పించి పోలీసులకు షాకిచ్చారు. అయితే, పాక్ ఎంపీ బాలికను నిజంగానే పెళ్లాడినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీనిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిగొచ్చిన బాలిక తండ్రి.. తమ కూతురికి 16 ఏళ్ల వయసు నిండే వరకు తాము అత్తింటికి పంపించమని పోలీసులకు హామీ ఇచ్చాడు.

పాకిస్తాన్ చట్టాల ప్రకారం 16 యేళ్లకంటే తక్కువ వయసుండి వివాహం చేసుకుంటే అది చెల్లదు. అంతేకాదు ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన శిక్షలు అమలు చేస్తారు. మొత్తంమీద సాక్షాత్తూ ఎంపీనే చట్టానికి విరుద్ధంగా మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న ఘటన పాకిస్థాన్ దేశంలో చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి, ఈ యాభయేళ్ల పొలిటికల్ పెళ్లి కొడుక్కి ఏ శిక్ష విధిస్తారో.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

five × one =