సంక్షోభంలో శ్రీలంక తర్వాత పాకిస్తాన్‎దే స్థానం..!

0
883

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, అంతర్జాయ పరిణామాలతో మన మార్కెట్లు విలవిలలాడుతున్నాయి. కానీ పొరుగునున్న పాకిస్థాన్‌తో పోల్చుకుంటే మెరుగ్గానే ఉన్నాయి. శ్రీలంక తరువాత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రెండో ఆసియా దేశం పాకిస్థాన్‌.

తాజా స్టాక్‌ మార్కెట్ల పరిస్థితులను పరిశీలిస్తే శ్రీలంక కంటే దాయాది దేశ స్టాక్‌ మార్కెట్లు దారుణంగా మారాయి. పాక్‌ స్టాక్‌ మార్కెట్లు ఏకంగా 6 లక్షల 95వేల కోట్ల రూపాయలను నష్టపోయింది. దాదాపు లక్షా 35 కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి. ఆ దేశ చరిత్రలోనే అత్యంత దారుణ ఆర్థిక పతనం ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి కారణం పాకిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభం, సీపెక్‌ ప్రాజెక్టులే కారణమని విశ్లేషిస్తున్నారు.

రాజకీయ, ఆర్థిక సంక్షోభం.. పొరుగు దేశం పాకిస్థాన్‌ను నిండా ముంచుతున్నాయి. ద్రవ్యోల్బణం రాకెట్‌ కంటే వేగంగా దూసుకుపోతోంది. అంతే వేగంగా విదేశీ మారక నిధులు పడిపోతున్నాయి. పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్సోభం కన్నా.. రాజకీయ ఘర్షణలే ఆందోళనకరంగా మారాయి. ప్రస్తుత సంక్షోభానికి ఇమ్రాన్‌ ఖాన్ పీటీఐ ప్రభుత్వమే కారణమని ప్రధాని షెహబాజ్‌ షరీఫ్ ఆరోపిస్తున్నారు. బాగున్న పరిస్థితులను పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ షరీఫ్‌-పీఎంఎల్‌ఎన్ ప్రభుత్వమే మరింత దారుణంగా మార్చిందని మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం 24 వేల 900 కోట్ల డాలర్ల విదేశీ రుణాలు పాక్‌ చెల్లించాల్సి ఉంది. ఇది శ్రీలంక, నేపాల్‌, ఆఫ్ఘానిస్థాన్ దేశాల మొత్తం జీడీపీ కంటే అధికం. పాకిస్థాన్‌ ఎంత సంక్షోభంలో కూరుకుపోయిందో చెప్పడానికి ఇది చాలు. ఈ అప్పులకు ఇమ్రాన్ ఖాన్‌ కారణమంటూ ప్రస్తుత ప్రభుత్వం విమర్శిస్తోంది. ఇమ్రాన్ ఖాన్‌ ప్రభుత్వం చేసిన విపరీతమైన అప్పులతోనే ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొన్నదని ఇన్‌ఫర్మేషన్ మరియమ్‌ ఔరంగజేబ్‌ ఆరోపించారు.

మరోవైపు దేశంలో ప్రజలు టీ ఎక్కువ తాగేస్తున్నారని, ఇక నుంచి ప్రతిరోజూ 1-2 కప్పులు తక్కువ టీ తాగాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే పాక్ కూడా మరో శ్రీలంక అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రణాళికా విభాగం మంత్రి అహసన్ ఇక్బాల్ తాజాగా ఒక ప్రకటన చేశారు. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ ప్రజలు సుమారు రూ.83.88 బిలియన్ రూపాయల విలువ చేసే టీ తాగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. అంతకుముందు ఏడాది, అంటే 2020-2021లో ఇది రూ.70.82 బిలియన్లుగా ఉండేది. ఇలా టీ వినియోగం పెరగడాన్ని ప్రస్తావించిన ఇక్బాల్.. దేశం అంతా తాగే టీని 1-2 కప్పులు తగ్గించుకోవాలని కోరారు. ఎందుకంటే మనం తాగే టీని అప్పు మీద దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు.

ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయి ఉన్న పాక్‌పై మరింత భారం పెరగకుండా ఉండాలన్నా, తమ దేశం మరో శ్రీలంక కాకూడదన్నా కఠిన నిర్ణయాలు తప్పవని ఇటీవలే కొందరు నిపుణులు హెచ్చరికలు చేశారు. ఈ క్రమంలోనే దేశంలోని దుకాణ దారులు కూడా రాత్రి 8.30లోపు షాపులు మూసేయాలని, ఇలా చేస్తే చాలా విద్యుత్ శక్తి ఆదా అవుతుందని పాక్ ప్రభుత్వం ఇటీవలే కోరింది. ఇప్పుడు టీ కూడా తగ్గించుకోవాలని అనడంతో నెటిజన్లు మండి పడుతున్నారు. నిజంగానే ఈ మాట అడుగుతున్నారా? మేం అంత వెర్రివాళ్లమని అనుకుంటున్నారా? అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. తాము ఇలాంటి పనులు చెయ్యలేమని మరికొందరు కరాఖండీగా చెప్పేస్తున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

three × five =