More

    విచ్చలవిడిగా కెనడా డబ్బు..? ‘ఖలిస్తాన్’ కుట్రకు కొత్త ఊతం..!

    ఎట్టకేలకు పంజాబ్ రాజకీయ సంక్షోభం ముగిసింది. రాందాసియా సిఖ్ పంత్ కు చెందిన చరణ్ జిత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఆయాచితంగా దక్కింది. ఐక్యత కన్నా స్వపక్షంలోని విరోధమే కాంగ్రెస్ పార్టీకీ మేలు చేయడం ఒక వైచిత్రి. పరస్పర వైరుధ్యాలు, ఘర్షణల పరంపరలోనే కాంగ్రెస్ పార్టీ పుట్టి, పెరిగి, పతన తీరాలకు చేరింది.

    చన్నీముఖ్యమంత్రి అయ్యారో లేదో జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లైంగికదాడి ఆరోపణలున్న వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడం సిగ్గుచేటని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సహజంగానే రేఖా శర్మ ఆరోపణలను పట్టించుకోలేదు.

    భారతదేశ రాజకీయాల్లో నేరారోపణలూ, పోలీసు కేసులు లేని నేతలు దుర్బిణి వేసి గాలిస్తే తప్ప దొరకరు. కాబట్టి ఆ విషయంలో చరణ్ జిత్ సింగ్ చన్నీని క్షమించవచ్చు. కానీ, ఇరు వర్గాల మధ్య అంతర్గత పోరును పరిష్కరించే క్రమంలో తీసుకున్న నిర్ణయాన్ని భారతదేశ రాజకీయాల్లో చారిత్రక నిర్ణయమని పాత్రికేయులు కీర్తించడం దివాళాకోరుతనం కాకపోతే మరేమిటి!

    పంజాబ్ సంక్షోభానికి కారణాలు బయటపెట్టకుండా దాటవేత ధోరణి అవలంబించిన కాంగ్రెస్, సాధారణంగా అధికార వర్గాల్లో ఉండే శరామామూలు వైరుధ్యాలనే ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. కేప్టెన్ అమరీందర్ సింగ్ కు కోటరీ ఉందనీ, అందరూ కలిసే వీలు లేకుండా పోయిందనీ, నమ్మకస్తులను సైతం దూరం పెట్టారని..ఇలాంటివేవో ఆరోపణలు వినిపించాయి. నిజానికి సిద్దూ, కేప్టెన్ ల మధ్య రాజకీయ ఘర్షణకు మూలాలు వేరు. పాకిస్థాన్, కశ్మీర్ అనుకూల ప్రతికూల ప్రకటనల పర్వమే ముఖ్యమంత్రి మార్పునకు కారణమైంది.

    పంజాబ్ లో కాంగ్రెస్ చేసింది ప్రయోగమా? పంజాబ్ సంక్షోభానికి అసలు కారణాలేంటి? కేప్టెన్ అమరీందర్ సింగ్ పాకిస్థాన్ వ్యతిరేక వ్యాఖ్యలే కాంగ్రెస్ అధిష్ఠానానికి కోపం తెప్పించాయా? పాకిస్థాన్ అనుకూల, ఖల్సా మద్దతు దారైన నవజోత్ సింగ్ సిద్దూకు ఉన్న కెనడా ఖలిస్థాన్ లింకులేంటి?

    పంజాబ్ కు యూరప్ దేశాల్లో స్థిరపడిన పంజాబీల నుంచి నిధులు అందుతున్నాయా? ‘‘conflict-generated diaspora’’ అంటే ఏంటి? సిద్దూ ముఖ్యమంత్రి అయితే దేశభద్రతకు నష్టం వస్తుందా? 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం పాల్గొన్న కేప్టెన్ అమరీందర్ సింగ్…పంజాబ్ మిలటరీ చరిత్ర గురించి రాసిన పుస్తకాలేంటి?

    ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను తెలియజేసే ప్రయత్నం చేస్తాను.

     ‘పంజాబ్ క్రైసిస్ మేనేజెమెంట్’ను ప్రయోగమనీ, దేశంలో ఈ తరహా ప్రయోగాన్ని భవిష్యత్తులో కాంగ్రెస్ చేయనుందా అంటూ..రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాల్యారిష్టాలు దాటని కొంతమంది జర్నలిస్టులు సంక్షోభ పరిష్కరానికి ‘ప్రయోగమని’ నామకరణం చేశారు. దళిత ముఖ్యమంత్రి అనే చారిత్రక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు కేవలం ఏడాది ముందు ఎందుకు తీసుకుందో అనేది మాత్రం చెప్పరు.

    2017లో జరిగిన ఎన్నికల్లో గెలిచినప్పుడు రాజీవ్ ప్రాపకంలో నేతగా ఎదిగినవాడు కాబట్టి కేప్టెన్ అమరీందర్ సింగ్ ను సీఎంను చేసి, విభేదాలు భగ్గుమన్న తర్వాత పరస్పర పోటీని తట్టుకోలేక, అనివార్య పక్షంలో చరణ్ జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్, పంజాబ్ చరిత్రలో దళితుణ్ని సీఎం చేసింది తామేననడం హాస్యాస్పదం కాకపోతే మరేమిటి? పంజాబ్ చరిత్రలో కాంగ్రెస్ లేదంటే అకాలీదళ్ ప్రభుత్వాలే కదా ఇన్నాళ్లూ ఉన్నాయి.

    కేవలం ఒక్కసారి అకాలీ-జనతా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడే కదా…జీర్ణించుకోలేక బింద్రన్ వాలేను ప్రోత్సహించి మారణహోమానికి కారణమైందీ, పంజాబీల విశ్వాస ప్రతీక స్వర్ణమందిరాన్ని పేల్చివేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇందిర హత్య ఎందుకు జరిగిందో చరిత్ర మరిచిపోతుందా? దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో కాంగ్రెస్ నేత హెచ్.కే.ఎల్ భగత్ నేతృత్వంలోని మూకలు…వెంటాడీ మరీ సిక్కులను చంపిన గతాన్ని పంజాబీలు మరిచిపోతారా? కేవలం పంజాబ్ ముఖ్యమంత్రి పదవి కోసమే కదా ఇన్ని వరుస దుర్ఘటనలు జరిగాయి..ఆ ఐదేళ్లూ వదులుకుని ఉంటే చరిత్ర మరోలా ఉండే వీలుండేది కదా…!

    ఏ మచ్చ మాసిపోవాలని మన్మోహన్ సింగ్ ను ప్రధానిని చేసిందో ప్రపంచానికి తెలియదా? పంజాబ్ లో 32శాతం దళిత జనాభా ఉందని 2011 జనాభా లెక్కలు తేల్చాయి. నిజానికి అంతకు ముందు కూడా అటుఇటుగా దళితులే అధికంగా ఉన్నారనే విషయం అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ కు తెలియదా? చరిత్రను మరిచిపోయి కాంగ్రెస్ పై పొగడ్తలు కురిపిస్తే…మాడుపగిలిపోయి అవమానం మిగలదా? సీనియర్ పాత్రికేయులు సైతం గతాన్ని మరిచిపోయి కాంగ్రెస్ ను పొగడటం పతనావస్థకు నిదర్శనం కాదా?

    సరే! దీన్ని వారి విజ్ఞతకు వదిలేద్దాం…

    కేప్టెన్ అమరీందర్ సింగ్-నవ్ జోత్ సింగ్ సిద్దూల మధ్య అగాధం ఎక్కడ మొదలైందో చూద్దాం…

    కేప్టెన్ అమరీందర్ సింగ్ సైన్యంలో పనిచేసినవాడు కాబట్టి తరచూ పాకిస్థాన్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఒకానొక సందర్భంలో సిద్దూ అనుచరుడు ప్యారేలాల్ గార్గ్ పొరుగుదేశం పాకిస్థాన్ పై కేప్టెన్ అనుచిత వ్యాఖ్యలు తగదంటూ ప్రతివిమర్శలకు దిగాడు. మరో సందర్భంలో పంజాబ్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మల్వీందర్ సింగ్ మాలీ తన ఫేస్ బుక్ పోస్ట్ లో ‘జమ్మూ-కశ్మీర్’ ప్రత్యేక దేశమంటూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో కేప్టెన్ కు చిర్రెత్తుకొచ్చింది.

    ప్యారేలాల్ గార్గ్, మల్వీందర్ సింగ్ మాలీల జాతివ్యతిరేక వ్యాఖ్యలను బహిరంగంగానే ఖండించాడు. వీరిద్దరూ నవ్ జోత్ సింగ్ సిద్దూ వ్యక్తిగత సలహాదారులు కావడంతో వివాదం మొదలైంది. కేప్టెన్ ఖండనపై సిద్దూ బహిరంగంగా స్పందించకపోయినా…అమరీందర్ కు వ్యతిరేకంగా అసంతృప్త ఎమ్మెల్యేలను పోగేయటం మొదలుపెట్టాడు. 24 మంది ఎమ్మెల్యేలు కలిసి ఆగస్ట్ 24న 10 జన్ పత్ కువెళ్లి ముఖ్యమంత్రి అమరీందర్ పై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

    ఎన్నికలు దగ్గరపడటం, పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడం, పార్టీ అంతర్గత విభేదాలు బహిర్గతం కావడం…పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మార్పు నిర్ణయాన్ని వేగవంతం చేసింది. కాంగ్రెస్ లోని ఈ పరస్పర కాట్లాటలే చరణ్ జిత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రి కావడం కారణం తప్ప కాంగ్రెస్ కు దళితుణ్ని ముఖ్యమంత్రిని చేయాలన్న ఆదర్శం కాదు.

    అంతేకాదు, గతంలో కేప్టెన్ అనుంగు అనుచరులుగా ఉన్న సుఖ్ జిందర్ రాంధ్వా, ప్రగాత్ సింగ్ లాంటి వారు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో మరోవివాదానికి తావివ్వకూడదని…మధ్యే మార్గంగా చన్నీని ఎంపిక చేసింది కాంగ్రెస్.

    కాంగ్రెస్ పతనం 90ల తర్వాత కాదు, నిజానికి 1967 నాటికే మొదలైంది. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ప్రొఫెసర్ Robert L. Hardgrave ఏషియన్ సర్వే జర్నల్ లో రాసిన ‘‘The Congress in India — Crisis and Split’’ వ్యాసంలో కాంగ్రెస్ పతనానికి రెండు కారణాలను గుర్తించారు.

    ఈ రెండు కారణాలను ఇప్పటికీ కాంగ్రెస్ కు అన్వయించడం…ఆ పార్టీ స్తబ్దతకు తార్కాణం. ఆ మూడు కారణాలేంటో చూద్దాం… 1. The obsolescence of congress political machine which rested on the support of wealthy peasants and land owners, and 2. Widening economic disparities of the nation, reflecting the gap between congress policy and effective implementation. 1967 ఎన్నికల్లో సగం రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరాజయం పాలైన ఉదాహరణను తీసుకుని హార్డ్ గ్రేవ్ ఈ పరిశీలన చేశాడు.

    సంపన్న రైతులు, భూస్వాముల మద్దతుపై ఆధారపడ్డ కారణంగానే కాంగ్రెస్ రాజకీయ యంత్రాంగానికి కాలం చెల్లించదనీ, దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతకూ కాంగ్రెస్ విధానాలకు మధ్య ఎడం రావడం, విధానాల అమలు పటిష్ఠంగా లేకపోవడమని తేల్చాడు. చీలిక గతంలోనేకాదు, తాజాగా గ్రూప్-23 ఉదాహరణ ఉండనే ఉంది.

    ఈ రెండు పరిశీలనలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకుని ఉంటే ఈపాటికి పతన వేగం కాస్తయినా మందగించేది. హార్డ్ గ్రేవ్ గతంలోనే పేర్కొన్నట్టూ సంపన్న రైతుల మద్దతు కారణంగానే మొన్నటి ఢిల్లీ రైతుల ఆందోళన నడిచింది. సంపన్న రైతులను చేరదీసి అధికార పక్షంపై ఉసిగొల్పడం కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ లోనే ఉంది.

    ఎన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ కేప్టెన్ కొన్ని కీలక సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు ఆయన గత చరిత్రను రద్దు చేసేవే అని గమనించాలి.  1971 ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్న సైనికుడిగా, భారత మిలట్రీ చరిత్ర రచనలో తనదైన పాత్ర పోషించిన కేప్టెన్ అమరీందర్ సింగ్ పౌరసత్వ చట్టసవరణ సందర్భంలో, 370 అధికరణం రద్దు సమయంలో మాత్రం ఫక్తు కాంగ్రెస్ నేతగానే వ్యవహరించాడు.

    సీఏఏ, 370 రద్దు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ వ్యాఖ్యానించాడు. పంజాబ్ చరిత్రలో మానని గాయంగా మిగిలిపోయిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’ కారణమైన పార్టీ, బింద్రన్ వాలే అనబడే Frankenstein ను సృష్టించిన కాంగ్రెస్ లో కొనసాగడం కేప్టెన్ ను విఫల జాతీయవాదిగా నిలబెట్టాయి.

    ఇక ఢిల్లీ రైతుల ఆందోళనల వెనుక ఉన్న కుట్రను చూద్దాం…

    వ్యవసాయరంగంలో సంస్కరణల కోసం కేంద్రం తెచ్చిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానాల నుంచి పెద్ద ఎత్తున సంపన్న రైతులు ఖరీదైన ట్రాక్టర్లు, విలాసవంతమైన ఏర్పాట్లతో రాజధానిలోకి దిగారు. హరిత విప్లవం తర్వాత సహజంగానే పంజాబీ మోతుబరి రైతులు కోట్లకు పడగెత్తారు.

    దీంతో పాటు 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ ప్రావిన్స్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత పంజాబ్ సహా అనేక ప్రాంతాల నుంచి విదేశాలకు వలసలు పెరిగాయి. నాటి పంజాబ్ రాజు రాజా దులీప్ సింగ్ బ్రిటన్ లో పర్యటించాడు. దీంతో పంజాబ్ ప్రజలు విదేశాలకు వలస వెళ్లడం మొదలైంది. 1950ల తర్వాత ఇది మరింత తీవ్రమైంది. ‘Go West, young man’ అనేమాట పంజాబ్ లో విస్తృతంగా వినిపించడానికి కారణం ఈ వలసలే. యూ.కే, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా తక్కువ పరిమాణంలో గ్రీస్, ఇటలీ దేశాల్లో కూడా పంజాబీ డయాస్ఫొరా పెరిగిపోయింది.

    ఈ వలసలే 1979-84 ఖలిస్థాన్ ఉద్యమానికి బాసటగా నిలిచాయి. బయటి దేశాల నుంచి నిధులు సమకూరాయి. ఇక్కడి నిర్బంధం నుంచి తప్పింకున్న ఖల్సా నేతలు అనేక మంది బయటి దేశాలకు పారిపోయి పంజాబీ డయాస్ఫొరా ప్రోత్సాహంతో విదేశాల నుంచి ఖలిస్థాన్ నినాదాన్ని వినిపించడం మొదలుపెట్టారు.

    ఢిల్లీ రైతుల ఆందోళనలు జరిగిన సందర్బంలో కూడా విదేశాల్లోని పంజాబీలు మద్దతు ప్రదర్శనలు నిర్వహించారు. కోట్లాది విరాళాలు ఆందోళనకారులకు పంపారు. నెలల తరబడి ఢిల్లీలో ఉండటానికి కారణం ఈ నిధులే. మరోసారి పంజాబ్ లో ఖలిస్థాన్ ఉద్యమం రావడానికి పంజాబీ డయాస్ఫొరా సహకరించే అవకాశాలను నిరాకరించలేం. దీన్నే పొలిటికల్ సైంటిస్టులు ‘‘conflict-generated diaspora’’గా పేర్కొన్నారు.  

    సిద్దూ లాంటి వారు పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే…ఖలిస్థాన్ ఉద్యమానికి ఊపు రావడం ఖాయమంటారు పరిశీలకులు. సిద్దూ 2018లో ఖలిస్థాన్ ఉద్యమ నాయకుడు గోపాల్ సింగ్ చావ్లాతో కలిసిన సందర్భాన్ని మరిచిపోకూడదు.

    లాహోర్-అమృత్ సర్ ల మధ్య ఉన్న చారిత్రక గ్రాండ్ ట్రంక్ రోడ్డు ఉంది. పాకిస్థాన్ –పంజాబ్ ల మధ్య కేవలం 30 నుంచి 40 కిలోమీటర్ల దూరమే ఉంది. పంజాబ్ రాజకీయ సంక్షోభం ఖలిస్థాన్ ఉద్యమానికి ఆజ్యం పోస్తే…పొరుగున పాకిస్థాన్ అందుకు సాయం చేస్తుంది. ‘‘conflict-generated diaspora’’ ఆర్థిక దన్ను ఉండనే ఉంది. ఇదీ పొంచి ఉన్న ప్రమాదం.

    ఎన్ని విమర్శలు ఉన్నా కేప్టెన్ అమరీందర్ సింగ్ సైనిక జీవితాన్ని తిరస్కరించలేం. పటియాల రాజవంశానికి చెందిన అమరీందర్‌ సింగ్‌ డిగ్రీ చదువు తర్వాత సైన్యంలో చేరారు. ఆయన తండ్రి, తాతలు కూడా సైన్యంలో పనిచేశారు.  1971లో పాక్‌తో జరిగిన యుద్దంలో అమరీందర్ సింగ్  పాల్గొన్నారు. అంతే కాదు,

    1. Saragarhi And The Defence Of The Samana-ఈ పుస్తకం ఆధారంగానే అక్షయ్ కుమార్ ‘కేసరీ’ అనే హిందీ సినిమా తీశారు.

    2. The Monsoon War: Young Officers Reminisce – 1965 India–Pakistan War

    3. Honour and Fidelity: India’s Military Contribution to the Great War 1914-18

    4.  The Last Sunset: The Rise and Fall of the Lahore Durbar ….లాంటి కీలకమైన పుస్తకాలు రాశారు.

    కొసమెరుపు: కేప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరతారనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. బీజేపీ కూడా కేప్టెన్ గతాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహ్వానించే అవకాశాలూ లేకపోలేదు. కేప్టెన్ బీజేపీలో చేరితే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్, బీజేపీల మధ్య ఉత్కంఠ రేపే త్రిముఖ పోటీలో దళితులు, జాట్ల ఓట్లు ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య చీలిపోయి…బీజేపీ గట్టెక్కుతుందా? లేదా కాంగ్రెస్ మూడో స్థానంలోకి పోయి బీజేపీ రెండో స్థానంలో నిలబడుతుందా? మొత్తంగా కాంగ్రెస్ ఒకనాటి లాహోర్ దర్బార్ లోని అమృత్ సర్ పార్శ్వాన్ని ఖాళీ చేయాల్సి రావచ్చు!  ఏది జరిగినా…మొత్తంగా చిత్రం ఆసక్తికరమే!

    Related Stories