మరోసారి భారత భూభాగంలో పాక్ డ్రోన్స్ కనిపించాయి. శనివారం అర్ధరాత్రి పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ సెక్టార్‌లోని భారత భూభాగంలో పాకిస్థాన్ డ్రోన్ ఎగురుతున్నట్లు గుర్తించారు. వెంటనే సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) కాల్పులు జరపడంతో అది వెనక్కి వెళ్ళిపోయింది. ధీండా బోర్డర్ అవుట్‌పోస్ట్ సమీపంలో భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్‌ను గుర్తించిన బిఎస్ఎఫ్ జవాన్లు 46 రౌండ్లు కాల్చినట్లు బిఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్, గురుదాస్‌పూర్ సెక్టార్ ప్రభాకర్ జోషి తెలిపారు. BSF దళాల కాల్పుల తర్వాత డ్రోన్ తిరిగి పాకిస్థాన్‌కు పారిపోయిందని ఆయన తెలియజేశారు. అనుమానాస్పద వస్తువులు కనపడతాయేమోనని ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. గత కొంతకాలంగా పాకిస్థాన్ నుండి డ్రోన్స్ మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలు మోసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే.. ఎప్పటికప్పుడు భారత సైన్యం పాక్ డ్రోన్స్ ను అడ్డుకుంటూ ఉంది.