More

  అప్పు దొరక్క పీకల్లోతు కష్టాల్లో పాక్..! ఆస్తులు అమ్మకుంటున్న ఉగ్రదేశం..!!

  ఉగ్రదేశానికి కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఆర్థికంగా పాకిస్తాన్ క్షిణించిపోతోంది. ప్రభుత్వాన్ని నడపడమే కష్టంగా మారుతోంది. ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ లో దుర్భర పరిస్థితులు తలెత్తుతున్నాయి.

  గతంలోనూ అనేక ప్రభుత్వ ఆస్తులు అమ్ముకున్న పాక్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశాన్ని సమస్యల నుంచి బయటపడేసేందుకు విదేశాలకు ఆస్తులు అమ్ముకుంటోంది. ఆస్తులు విక్రయించేందుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తూ అత్యవసరంగా ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం. అన్ని ప్రక్రియలను పక్కనపెట్టి.. రెగ్యులేటరీ తనిఖీలను సైతం తొలగించింది. ఎగవేతదారు అనే ముద్ర పడకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ మీడియా చెబుతోంది. ఇంటర్‌ గవర్నమెంటల్‌ కమర్షియల్‌ ట్రాన్సాక్షన్స్‌ ఆర్డినెన్స్-2022ను తాజాగా ఫెడరల్‌ క్యాబినెట్‌ ఆమోదించింది. దేశంలోని ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ సంస్థల షేర్లను విదేశాలకు విక్రయించటంపై దాఖలయ్యే పిటిషన్లు విచారించకుండా కోర్టులకు సైతం అవకాశం లేదని అక్కడి మీడియా వెల్లడించింది.

  చమురు, గ్యాస్‌ కంపెనీలు, ప్రభుత్వ అధీనంలోని విద్యుత్తు కేంద్రాల్లో వాటాను యూఏఈకి విక్రయించేందుకు ఈ అత్యవసర ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు. సుమారు 2 బిలియన్ల నుంచి 2.5 బిలియన్ల డాలర్లు వీటి ద్వారా పొందాలని భావిస్తోంది పాకిస్థాన్‌ ప్రభుత్వం. ఈ ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. గతంలోనూ రుణాలు చెల్లించే స్థితిలో పాకిస్థాన్‌ లేకపోవటం వల్ల కొత్త రుణాలు ఇచ్చేందుకు యూఏఈ ఈ ఏడాది మే నెలలో తిరస్కరించింది. అయితే.. తమ కంపెనీలు పాక్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాలని తెలిపింది. మరోవైపు.. దేశంలోని ఏదైన సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు సుమారు 471 రోజుల సమయం పడుతుందని పాకిస్థాన్‌ ఆర్థిక మంత్రి మిఫ్తాహ్‌ ఇస్మాయిల్‌ ఇటీవల పేర్కొనటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. నిధుల సేకరణకు ప్రభుత్వం రోజుల వ్యవధిలోనే ఒప్పందాలు పూర్తి చేయాలని సూచించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుంచి 1.17 బిలియన్‌ డాలర్ల రుణాలు పొందటంలో విఫలమైంది. ఆర్థిక అంతరాన్ని తగ్గించేందుకు మిత్ర దేశాల నుంచి 4 బిలియన్‌ డాలర్లు సేకరించాలని ఐఎంఎఫ్‌ సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆస్తులను విక్రయించి నిధులు సమీకరించేందుకు పాకిస్థాన్‌ ప్రయత్నిస్తోంది. అయితే.. ఈ ఆర్డినెన్స్‌పై పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ ఇంకా సంతకం చేయకపోవటం గమనార్హం.

  గతంలోనూ పాకిస్తాన్ ప్రభుత్వ ఆస్తులను అమ్ముకుంది. జాతీయ రహదారులను సైతం వేలం వేసే స్థాయికి దిగజారింది. అయితే పాకిస్తాన్‌పై విదేశీ రుణాలు చెల్లించాల్సిన బాధ్యత ఉంది. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించని వారిని ఎగవేతదారుగా పిలుస్తారు. ఒకసారి డీఫాల్టర్‌గా గుర్తింపు వస్తే ఆ దేశానికి అంతర్జాతీయ స్థాయిలో రేటింగ్ పడిపోతుంది. కొత్త రుణాలు పుట్టడం చాలా కష్టం అవుతుంది. అందుకే పాకిస్తాన్ డీఫాల్టర్‌గా మారుతుందనే భయాల మధ్య అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పాకిస్తాన్ ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన బాండ్లను అమ్ముతున్నారు. దీనివల్ల వాణిజ్య లోటు కొంత తగ్గింది. కానీ, కేవలం ఐఎంఎఫ్ మద్దతు కూడగట్టడం ద్వారానే పరిస్థితుల్లో మార్పులు రావని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ కరెంట్ ఖాతా లోటు 4 బిలియన్ డాలర్లు. ఇలాంటి పరిస్థితి తలెత్తడం పాకిస్తాన్ చరిత్రలోనే మొదటిసారి. ఇలాంటి సమయంలో పాకిస్తాన్‌కు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, కొత్త యూరోబాండ్, సౌదీ అరేబియా, చైనాల నుంచి సహకారం అవసరమని నిపుణులు చెబుతున్నారు.

  Trending Stories

  Related Stories