Special Stories

నిజమైన దేశభక్తుల చేతుల్లో వికసిస్తున్న ‘పద్మం’..!

రాష్ట్రపతి భవన్‎లోని చారిత్రక దర్బార్ హాల్. పద్మ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. దేశంలోనే మోస్ట్ పవర్ లీడర్లయిన రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతి కొలువుదీరివున్నారు. అతిరథ మహారథులు ఆసీనులయ్యారు. చుట్టూ విద్యుత్ బల్బులు, మీడియా కెమెరాల ఫ్లాష్ లైట్లతో దర్బార్ హాలంతా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. పేర్లను పిలవగానే పద్మ అవార్డుకు ఎంపికైన ప్రముఖులంతా.. ఒక్కొక్కరుగా వచ్చి రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డులు అందుకుంటున్నారు. ఇంతలో హరేకల హాజబ్బ పేరు ప్రకటించారు. అందరిలోనూ ఆశ్చర్యం. ఎప్పుడూ వినని పేరది. అంతా ఒక్కసారిగా రెడ్ కార్పెట్ వైపు చూశారు. తెలుపు రంగు లుంగీ, తెల్ల చొక్కా, మెడలో ఓ కండువాతో.. కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేని 68 ఏళ్ల ఓ బక్కపలుచని మనిషి.. అమాయకమైన చూపులతో నడుచుకుంటూ రాష్ట్రపతి వద్దకు వచ్చాడు. పద్మశ్రీ అవార్డు అందుకుని అంతే అమాయకత్వంతో తిరిగి వెళ్లి తన స్థానంలో కూర్చున్నాడు.

సీన్ కట్ చేస్తే, కొంతసేపటి తర్వాత,… తులసీ గౌడ పేరును అనౌన్స్ చేశారు. అందరిలోనూ మళ్లీ అదే ఆశ్చర్యం..! అంతా ఓసారి రెడ్ కార్పెట్ వైపు చూశారు. అచ్చమైన గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ.. ముతక చీరలో 72 ఏళ్ల అవ్వ దర్శనమిచ్చింది. ప్రొటోకాల్స్ కూడా తెలియని ఆ మాతృమూర్తి వడివడిగా వచ్చి రాష్ట్రపతికి పాదాభివందనం చేయబోయింది. వద్దని వారించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. ఆవిడకు పద్మ పురస్కారాన్ని అందించారు. హరేకల హాజబ్బ, తులసీ గౌడ మాత్రమే కాదు.. కృష్ణమ్మళ్ జగన్నాథన్, దళవాయి చలపతిరావు, రహీబాయి సొమె పొపెరె, మాతా మంజమ్మ జగతి.. ఇలా.. జన బాహుళ్యానికి తెలియని వాళ్లెందరో ఈసారి పద్మ అవార్డులు అందుకున్నారు.

ఇంతకీ ఎవరు వీరంతా..? రాజకీయవేత్తలు కాదు, ఆర్థికవేత్తలు అంతకన్నా కాదు. నటులు కాదు, సంగీత విద్వాంసులు కూడా కాదు. మరి ఎవరు..? ఇంతటి సాధారణ వ్యక్తులకు ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు ఎలా వరించాయి..? దర్బార్ హాల్ లోని ప్రముఖులతో పాటు.. టీవీల్లో లైవ్ చూస్తున్న వారందరి మదిలోనూ ఇవే ప్రశ్నలు. వీరంతా.. దేశభక్తిలో, సామాజిక సేవలో తరిస్తున్న మానవతావాదులు. సామాన్యుల రూపంలో కనిపిస్తున్న అసామాన్యులు. దేశానికి వీరు చేస్తున్న సేవలు అసామాన్యం. ప్రతిష్టాత్మక పౌర పురస్కారానికి నిజమైన అర్హులు.

ఇంతకీ వీరు సమాజానికి చేస్తున్న సేవలు ఎలాంటివో తెలుసుకుందాం. ముందుగా.. హరేకల హాజబ్బ. ఉన్నవాడు సాయం చేస్తే.. పెద్ద గొప్పేం కాదు. కానీ, లేనివాడు సాయం చేస్తే మాత్రం.. అది చాలా గొప్ప విషయం. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలంటే.. మనం కోటీశ్వరులం కానవసరం లేదని.. తోటి వారి కష్టాన్ని చూసి స్పందించే హృదయం ఉంటే చాలని నిరూపించాడు కర్నాటకకు చెందిన హరేకల హజబ్బ. రోడ్డుపక్కన సంత్రాలు అమ్ముకుని జీవించే హాజబ్బ తన ఊరి పిల్లల పాలిట దైవం అయ్యాడు. వారికోసం ఏకంగా పాఠశాల నిర్మించి విద్యాదానం చేస్తున్నాడు. కొన్ని వందలమందిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నాడు. పదవతరగతి వరకు వున్న ఆ స్కూల్ లో చదువుకోవడానికి ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన పనిలేదు. హాజబ్బ అసామాన్య సేవా గుణాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది.

హాజబ్బ సేవాతత్పరుడిగా మారడం వెనుక పెద్ద కథే వుంది. మంగుళూరుకు చెందిన హరేకల హజబ్బ స్థానికంగా ఉన్న సెంట్రల్‌ మార్కెట్‌లో సంత్రాలు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫారిన్‌ దంపతులు హజబ్బ దగ్గరకు వచ్చి.. కిలో సంత్రాలు ఎంత అని ఇంగ్లీష్‌లో అడిగారు. హాజబ్బకు కన్నడ, మాతృభాష అరబ్బీ తప్ప మరో భాష రాదు. అందుకే ఆ ఫారిన్‌ దంపతులు అడిగిన ప్రశ్నకు అతను సమాధానం చెప్పలేకపోయాడు. ఆ దంపతులు హాజబ్బను చూసి ఎగతాళిగా నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

ఫారిన్ దంపతులు చేసిన అవమానం హాజబ్బను చాలా కుంగదీసింది. ఇంగ్లీష్‌ రాకపోవడం వల్లే తాను ఇలా అవమానాలు పొందాల్సి వచ్చిందని భావించాడు. తన గ్రామంలోని పిల్లలు ఎవరు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోకుండా చూడాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. కానీ, తన గ్రామంలో మంచి స్కూల్‌ లేకపోవడం.. మదర్సాలో అరబ్బీ తప్ప మరో భాష నేర్పకపోవడం హాజబ్బను కలవరపరిచింది. దీంతో తానే స్వయంగా ఓ స్కూల్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. కానీ, అది అనుకున్నంత సులభంగా జరగలేదు. ఎన్నో అవమానాలు.. అడ్డంకులు ఎదుర్కొన్నాడు. వాటన్నింటిని అధిగమించి.. 1999, జూన్‌లో తన కలని నిజం చేసుకున్నాడు.

అప్పటి వరకు తాను పొదుపు చేసుకున్న ఐదువేల రూపాయలతో సొంతంగా కొంత భూమి కొనుగోలు చేసి.. పాఠశాల నిర్మాణం ప్రారంభించాడు. ప్రభుత్వం, దాతల సాయంతో అలా 2001 జూన్‌ నాటికి 8 తరగతి గదులు, రెండు మరుగుదొడ్లతో స్కూలు నిర్మాణం పూర్తయింది. పట్టువదలని విక్రమార్కుడిలా పాఠశాల నిర్మించాలనే తన కల నెరవేర్చుకున్నాడు. హాజబ్బ అంతటితో ఆగలేదు. మరో పదేళ్లు కష్టపడి 2012 నాటికి పదవ తరగతి వరకు విస్తరించాడు. ప్రాథమిక పాఠశాల పక్కనే ఉన్నత తరగతి విద్యార్థుల కోసం మరో బిల్డింగ్‌ నిర్మించాడు. ప్రస్తుతం తన గ్రామంలో ప్రీ-యూనివర్శిటీ కాలేజీని ప్రారంభించే యోచనలో వున్నాడు హజబ్బ. రెక్కాడితేగాని డొక్కాడని హాజబ్బ ఎందరో భావి భాతర పౌరులను తీర్చిదిద్దుతున్నాడు. పద్మ పురస్కారం అందుకోవడానికి ఎంతకన్నా అర్హత ఏం కావాలి..? కొసమెరుపు ఏమిటంటే.. అవార్డు ద్వారా లభించే మొత్తాన్ని కూడా పాఠశాల అభివృద్ధి కోసమే వినియోగిస్తానని చెప్పడం హాజబ్బ సేవాతత్పరతకు నిదర్శనం.

మరో వికసిత పద్మం తులసీ గౌడ. కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలుకా హొన్నాలి గ్రామంలో హలక్కీ అనే గిరిజన కుటుంబంలో జన్మించారు. ఆమె జన్మించిన రెండేళ్లకే తండ్రి మరణిచారు. దీంతో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూలీ పనికి వెళ్లేవారు. ఆ తర్వాత 12 ఏళ్ల వయసులోనే గోవింద గౌడ అనే వ్యక్తితో ఆమెకు వివాహ జరిగింది. అయితే వివాహమైన రెండేళ్లకే భర్త కూడా మరణించడంతో ఆ బాధ నుంచి బయట పడేందుకు అడవిలో గడుపుతూ.. చెట్లతో స్నేహం చేయడం మొదలు పెట్టారు. అలా ఆమెకు తెలియకుండానే మొక్కలపై ప్రేమను పెంచుకుంది. నిత్యం చెట్లతో ఉండడంతో అది గమినించిన అటవీ శాఖ అధికారులు తులసికి తాత్కాలిక ఉద్యోగిగా నియమించుకుని కొన్నేళ్ల తర్వాత పర్మినెంట్‌ చేశారు. 14 ఏళ్లు ఉద్యోగం చేసిన తర్వాత ఉద్యోగ విమరణ పొందారు. అయితే చెట్లతో ఆమె బంధాన్ని మాత్రం తెంపుకోలేక పోయారు. ఇప్పటికీ మొక్కలు నాటుతూనే ఉన్నారు. నాటడమే కాకుండా వాటిని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు.

ఇలా తులసి తన అరవై ఏళ్ల జీవితంలో నలభై వేల మొక్కలు నాటి ఏకంగా ఓ వన సామ్రాజ్యాన్నే సృష్టించారు. ఇలా పర్యవరణానికి ఎనలేని కృషి చేసిన, చేస్తోన్న తులసి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తులసిని పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. తులసమ్మ చదువుకోకపోయినా చెట్ల గురించి ఎంతో అవగాహన ఉంది. చెట్లను ఎప్పుడు నాటాలి..? ఎన్ని నీళ్లు పోయాలి..? వాటి ఔషధ గుణాలు ఏంటి అన్న విషయాన్ని సులభంగా చెప్పేస్తారామె. శాస్త్రవేత్తలు కూడా ఆమె విజ్ఙానాన్ని చూసి అబ్బుర పడుతుంటారు. ఇక పర్యావరణవేత్తలైతే ఆమెను ‘ఎన్‌సైక్లోపిడియా ఆఫ్‌ ఫారెస్ట్‌’గా పిలుస్తారు. ఒక్క మొక్క నాటితేనే.. దాంతో సెల్ఫీ దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసుకునే వారున్న ఈ రోజుల్లో.. 40 వేల మొక్కలు నాటి కూడా.. ఎంతో నిరాడంబరంగా ఉన్న తులసమ్మ.. వన దేవత అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

తులశమ్మ వనదేవత అయితే.. ఈ రహీబాయి సోమా పొపేరే మాత్రం ప్రకృతిమాత. పురుగుమందులు, రసాయనిక ఎరువులతో కలుషితమవుతున్న భూమాతను రక్షించేందుకు ఆమె తన జీవితాన్ని ధారపోస్తున్నారు. హైబ్రిడ్ విత్తనాలకు వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం చేస్తూ.. సంప్రదాయ సేంద్రీయ విత్తనాలను కాపాడుతూ.. అన్నదాతకు అండగా నిలుస్తున్నారు రహీబాయి. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా అకోలా తాలూకాలో వున్న మారుమూల కొంభల్నే.. 57 ఏళ్ల రహీబాయి స్వగ్రామం. స్థానిక మహాదేవ్ కోలి గిరిజన తెగకు చెందిన రహీబాయి.. పేదరికం కారణంగా చదువుకోలేకపోయారు. పదేళ్ల వయసు నుంచే వ్యవసాయ కూలీగా, గోవుల కాపరిగా పనిచేస్తూ కుటుంబానికి అండగా నిలిచారు. 17 ఏళ్ల వయసులో సోమా పోపేరేతో వివాహం జరిగింది. వ్యవసాయమే వారి కుటుంబానికి జీవనాధారం. నిరక్షరాస్యురాలైనప్పటికీ.. వ్యవసాయ జీవ వైవిధ్యం, అటవీ ఆహార వనరులు, సంప్రదాయ వ్యవసాయ పద్దతులపై స్వీయ అనుభవంతో పట్టుసాధించారు.

పురస్కారాలు మంచివే.. కానీ, చేస్తున్న పని అంతకన్నా మంచిదని చెబుతారు రహీబాయి. స్థానిక విత్తనాలు, మొక్కల పెంపకం వంటి.. వ్యవసాయ పద్దతులను తన తండ్రి వద్దనుంచి నేర్చుకున్నారామె. మొదట్లో అందరిలాగే.. రహీబాయి కూడా హైబ్రిడ్ విత్తనాలను వాడేవారు. కానీ, ఎప్పుడైతే తన పిల్లలు తరుచూ అనారోగ్యానికి గురవుతుండటాన్ని గమనించిన ఆమె.. తాము తింటున్న ఆహారంలోనే ఏదో లోపముందని గుర్తించారు. పురుగుమందులు, రసాయినక ఎరువులతో పండించిన ఆహారం తీసుకోవడం వల్లే అనారోగ్యానికి గురవుతున్నట్టు గమనించారు. అప్పుడే ఆమెలో మార్పు మొదలైంది. హైబ్రిడ్ విత్తనాలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. సంప్రదాయ సేంద్రీయ విత్తనాలపై దృష్టిసారించారు. వ్యవసాయ జీవ వైవిధ్యం, అటవీ ఆహార వనరులపై స్వీయ అనుభవంతో పట్టుసాధించారు. చిన్నప్పుడు తండ్రివద్ద నేర్చుకున్న వ్యవసాయ విజ్ఞానంతో.. హైబ్రిడ్ డవిత్తనాలకు స్వస్తి పలికి.. రెండు దశాబ్దాల క్రితం సేంద్రీయ వ్యవసాయం ప్రారంభించారు. సొంతంగా బ్లాక్ బెర్రీ నర్సరీని పెంచారు. స్థానిక స్వయం సహాయక బృందాలకు.. తాను పండించిన సేంద్రీయ విత్తనాలను అందజేశారు. బంధువులు, తెలిసినవాళ్లకు ఇవే విత్తనాలు బహుమతిగా ఇవ్వడం ప్రారంభించారు. మహారాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సేంద్రీయ విత్తనాల ఉపయోగాన్ని విడమరచి చెప్పారు.

బ్లాక్ బెర్రీతో ప్రారంభైన రహీబాయి సేంద్రీయ వ్యవసాయం.. వరి ధాన్యం, రకరకాల కూరగాయల వరకు విస్తరించింది. ఒక్క అకోలా జిల్లాలోనే 210 మంది వ్యవసాయదారులు.. రహీబాయి విత్తనాలను వాడుతున్నారంటే.. ఆమె ఎంత పాపులర్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. రహీబాయి వద్ద దాదాపు 200 రకాల సేంద్రీయ విత్తనాలతో ఇప్పుడో సీడ్ బ్యాంకే వుంది. వీటిలో 30 రకాల కూరగాయలు, 11 రకాల వరి ధాన్యం వున్నాయి. ఇవేకాండా ఔషధ మొక్కలు, పప్పుదినుసులు కూడా వున్నాయి. ఆమె పాపులారిటీ ఇప్పుడు మహారాష్ట్ర దాటి ఇతర రాష్ట్రాలకు వ్యాపించింది. ఎన్నో రాష్టాల్లో పర్యటించిన రహీబాయి.. సేంద్రీయ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా రహీబాయిని ముద్దుగా ‘బీజ్ మాతా’ అని పిలుస్తారు. అంటే విత్తన మాత అని అర్థం. అక్షర జ్ఞానం లేకున్నా.. అంతరించిపోతున్న సంప్రదాయ వ్యవసాయానికి ఊపిరిపోస్తున్నారు రహీబాయి. పద్మ పురస్కార అమె చేతుల్లో ఒదగడానికి ఇంతకన్నా కారణం ఏముంటుంది. నిజానికి, పద్మ అవార్డు స్వీకరించడానికి ముందే.. ఆమె అంతర్జాతీయ కీర్తి గడించారు. రహీబాయి జీవిత చరిత్రపై తీసిన 3 నిమిషాల షార్ట్ ఫిల్మ్ కు 72వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో థర్డ్ ప్రైజ్ దక్కింది.

వీరే కాదు.. సమాజసేవకు జీవితాన్ని అంకితం చేసిన పలువురు సామాన్యులను పద్మ పురస్కారాలు వరించాయి…. అహింసావాదం ద్వారా మారుమూల గ్రామాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం నింపుతున్న కృష్ణమ్మళ్ జగన్నాథన్. గ్రామీణ కళకు ప్రాణం పోస్తున్న.. తోలు బొమ్మలాట కళాకారుడు, మన తెలుగువాడు అనంతపురం జిల్లాకు చెందిన దళవాయి చలపతి రావు…. దళిత సమాజ అభివృద్ధికి పాటుపడుతున్న ఆచార్య ఎం.కె. కుంజోల్ వంటివాళ్ళు పద్మ పురస్కారాలు స్వీకరించారు. ఇంకా.. మట్టే ఎరువుగా, మట్టే పురుగు మందుగా సేంద్రీయ విధానంలో వ్యవసాయం చేస్తూ.. అంతర్జాతీయ పేటెంట్ పొందిన తొలి భారతీయ రైతు, తెలంగాణ రైతు బిడ్డ.. చింతల వెంకట్ రెడ్డికి కూడా పద్మశ్రీ పురస్కారం దక్కింది. గత పదేళ్లుగా అనేక రకాల సేంద్రీయ విత్తనాలను ‘నేషనల్ సీడ్ కార్పొరేషన్’తో పాటు ‘ఆంధ్రప్రదేశ్ సీడ్ కార్పొరేషన్’కు కూడా అందిస్తున్నారు చింతల వెంకట్ రెడ్డి. వీరీతో పాటు.. తొలిసారి ఓ ట్రాన్స్ జెండర్ కు కూడా పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది మోదీ ప్రభుత్వం. దశాబ్దాలుగా జానపద కళారూపాలను కాపాడుతున్న మాతా మంజమ్మ జొగతి పద్మ పురస్కారాన్ని దక్కించుకున్నారు.

ఒకప్పుడు పద్మ అవార్డులంటే.. అస్మదీయులు, తస్మదీయులకు మాత్రమే దక్కుతాయనే చెడ్డపేరు ఉండేది. కేవలం తమకు అనుకూలమైన వారికే పద్మాలు కేటాయిస్తారనే చెడ్డపేరును గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సొంతం చేసుకుంది. అయితే, కొన్నేళ్లుగా.. సరిగ్గా చెప్పాలంటే.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీయే సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మారుమూల ప్రాంతాలకు చెందిన వారికి.. జగమెరుగని అసామాన్యులకు కూడా పద్మ పురస్కారాలు అందుతున్నాయి. ఇలాంటి మంచి పరిణామం ఇకపై కూడా కొనసాగుతుందని ఆశిద్దాం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 − 5 =

Back to top button