More

    ఉదయం కాల్ రికార్డింగ్ లీక్.. సాయంత్రం కాంగ్రెస్ కు రాజీనామా

    హుజురాబాద్ లో కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ సీటు కూడా ఆయనకే దక్కుతుందనే ప్రచారం మొదలైంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా వచ్చిన నాటి నుంచి ఆయన పార్టీకి కొద్దిగా దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ నుంచి తనను టికెట్ రాదనే ఉద్దేశంతోనే ఆయన టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు సమాచారం. గతంలో ఓ కార్యక్రమంలో కేటీఆర్ ను కలిశారు కౌశిక్ రెడ్డి. ఈ సమయంలోనే అతడు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వచ్చాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు కౌశిక్ రెడ్డి. ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ చేతిలో ఓటమి చవిచూశారు. ఈరోజు ఉదయం నుండి ఓ కాల్ రికార్డింగ్ వైరల్ అవుతూ వచ్చింది. టీఆర్ఎస్ హుజురాబాద్ టికెట్ తనకే దక్కిందని సదరు కార్యకర్తతో చెప్పుకొచ్చాడు. యూత్ ను సమాయత్తం చేయాలని అందులో మాట్లాడడం గమనించవచ్చు. యూత్ కి ఎన్ని డబ్బులు కావాలో నేను చేసుకుంటా.. వారి ఖర్చులకు 3000, 4000, 5000 ఇస్తానంటూ ఆడియోలో ఉంది. ఇది మాదన్న పేట యువకునితో జరిపిన సంభాషణ అని పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచారం చేశాయి. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజి రెడ్డిని కలవాలని యువకుడితో కౌశిక్ రెడ్డి సూచించారు.

    హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ తనకే అంటూ ఆ ఆడియోలో కౌశిక్ రెడ్డి చెప్పడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పీసీపీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ, గత కొంత కాలంగా కౌశిక్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, టీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారని చెప్పారు. ఆయనపై పలు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఫోన్ సంభాషణపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించామని లేని పక్షంలో ఆయనపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించారు. ఇలాంటి చర్యలను సమర్థించబోమని.. కౌశిక్ రెడ్డికి ఇప్పటికే తమ పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసిందని.. అవసరమైతే కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని అన్నారు.

    తాజాగా కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా చేసిన లేఖ వైరల్ అవుతూ ఉంది. సోనియా గాంధీకి లేఖ రాశారు కౌశిక్ రెడ్డి. తాను పార్టీని వీడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీసు అందుకున్న 24 గంటల్లోనే కౌశిక్‌ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా ప్రకటన అనంతరం కౌశిక్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు నాకు సహకరించడం లేదు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా ఇతరులకు పదవులిస్తున్నారు. పార్టీ పదవుల విషయంలో నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కొందరు సీనియర్‌ నేతలు పార్టీకి నష్టం కల్గిస్తున్నారు. 50 కోట్ల రూపాయలు ఇచ్చి రేవంత్‌ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్‌ అయ్యారు. సీనియర్లను కాదని రేవంత్‌ రెడ్డికి టీపీసీసీ బాధ్యతలు అప్పగించడం నన్ను బాధించింది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ మనుగడ కష్టం’’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.

    Trending Stories

    Related Stories