More

    సరికొత్త చరిత్ర సృష్టించిన భారతీయ రైల్వే

    భారత్ లోని చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరత ఉన్న సంగతి తెలిసిందే..! అవసరాలకు తగ్గ ఆక్సిజన్ ను అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఆక్సిజన్ ను గమ్య స్థానాలకు తరలించడానికి భారతీయ రైల్వే కూడా ఎంతగానో శ్రమిస్తోంది.

    ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లు రైళ్లు ఎంతో మంది ప్రాణాలు కాపాడాయని రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ చెప్పుకొచ్చారు. సోమవారం ఉదయం వరకూ 10000 టన్నులకు పైగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను భారతీయ రైల్వే తరలించిందని సునీత్ శర్మ చెప్పారు. ఇదొక మెయిలు రాయని.. 10000 టన్నుల మార్కును అందుకోడానికి 160 ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పరుగులు తీశాయని ఆయన చెప్పారు. 600 ట్యాంకర్లు 13 రాష్ట్రాలలో ప్రయాణాలు చేశాయని అన్నారు. దేశ నలుమూలలకు ఇవి తిరిగాయని అన్నారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోడానికి భారతీయ రైల్వే సిద్ధంగా ఉందని సునీత్ శర్మ చెప్పుకొచ్చారు.

    తౌక్త తుఫాను సమయంలో కూడా భారతీయ రైల్వే తన ప్రయాణాన్ని చేసిందని.. ఇది ఎంతో గొప్ప విషయమని అన్నారు. గుజరాత్ నుండి ఢిల్లీ రీజియన్ కు పెద్ద గాలులు వీస్తున్న సమయంలో కూడా ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లు ప్రయాణం సాగించాయని అన్నారు. పంజాబ్ రాష్ట్రానికి కూడా తాము ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ద్వారా కావాల్సిన ఆక్సిజన్ ను అందించామని అన్నారు. సోమవారం సాయంత్రం 7 గంటలకు 41.07 టన్నుల ఆక్సిజన్ ఫిల్లౌర్ కు చేరుకుందని ఆయన అన్నారు. రైల్వేల ద్వారా 3734 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను ఢిల్లీ కి అందించామని, 2652 టన్నులు ఉత్తరప్రదేశ్ కు, 521 టన్నులు మహారాష్టకు, 1290 టన్నులు హర్యానా, 564 టన్నులు తెలంగాణకు ఇప్పటి వరకూ సరఫరా చేశామని అన్నారు. ఇంకా తమ సేవలను కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు.

    ప్రస్తుతానికి అవసరానికి సరిపడ్డా రైళ్లను నడుపుతూ ఉన్నామని తెలిపారు. రైల్వేలలో ఉన్న 4.32 లక్షల ఉద్యోగులకు వ్యాక్సిన్లు వేయించామని.. మిగిలిన వాళ్లకు కూడా వ్యాక్సిన్లను వేయించేలా చర్చలు జరుపుతూ ఉన్నామని శర్మ చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాల కోరికల మేరకు 348 ఐసోలేషన్ కోచ్ లను కూడా ఇండియన్ రైల్వే ఏర్పాటు చేసినదని అన్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలలో ఈ ఐసోలేషన్ కోచ్ లు ఉన్నాయని అన్నారు. భారతదేశంలో పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకూ రైల్వే విభాగం నిరంతరం పని చేస్తూనే ఉంటుందని శర్మ చెప్పుకొచ్చారు.

    Related Stories