మన న్యాయవ్యవస్థపై భారం ఎక్కువగా ఉంది: సీజేఐ ఎన్‌వీ రమణ

0
722

న్యాయమూర్తులు, భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడమే కాకుండా దేశంలో న్యాయవ్యవస్థలో ఖాళీలను భర్తీ చేయడానికి, దేశంలో న్యాయపరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి తాను ప్రయత్నాలు చేస్తున్నానని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్‌వీ రమణ శుక్రవారం అన్నారు. రెండు రోజుల తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ అధికారుల సదస్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడిన భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ మన న్యాయవ్యవస్థపై ఒత్తిడి ఉన్న సంగతి నిజమేనని అన్నారు.

సీజేఐ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఖాళీలను భర్తీ చేయడంతోపాటు న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. న్యాయవ్యవస్థపై భారం ఎక్కువగా ఉందని.. న్యాయమూర్తుల ఖాళీల భర్తీ చేయాడానికి తాను ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎన్‌వీ రమణ శుక్రవారం అన్నారు. కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న జ‌డ్జీల పెంపు ఎట్ట‌కేల‌కు పూర్త‌యింద‌ని సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ తెలిపారు. ఎక్కువ‌మంది జ‌డ్జీల‌ను నియ‌మించి న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను బ‌ల‌ప‌ర‌చాల‌ని భావించామని అన్నారు. గ‌త రెండేళ్ల‌లో ఎక్కువ మంది జడ్జీల నియామ‌కం జ‌రిగింద‌న్నారు. జిల్లా కోర్టుల్లో జ‌డ్జీల సంఖ్య పెంచుతున్నామని అన్నారు.

తెలంగాణ స్టేట్ జ్యూడీషియ‌ల్ ఆఫీస‌ర్స్ కాన్ఫ‌రెన్స్ స‌ద‌స్సు హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలో జరిగింది.ఈ సదస్సుకు సీజేఐ ఎన్వీ రమణ, హైకోర్టు సీజే జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, సీఎం కేసీఆర్‌, మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి హాజరయ్యారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత న్యాయాధికారుల సమావేశం జరగడం ఇదే తొలిసారని వెల్లడించారు. న్యాయవ్యవస్థను బలపరిచేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందన్నారు.

హైకోర్టులో ఇటీవల జడ్జీల సంఖ్య పెంచామని చెప్పారు. కేసుల త్వరితగతిన పరిష్కారానికి జడ్జిల పెంపు అవసరమన్నారు. ”మన న్యాయవ్యవస్థపై భారం ఉంది. ఇది వాస్తవం. కోర్టులలో పెండింగ్‌ కేసులు పెరిగాయి.. కారణాలు చాలానే ఉన్నాయి. దేశంలో అప్పీల్ వ్యవస్థ కారణంగా కేసుల పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతోంది”అని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (IAMC)ని ఏర్పాటు చేయాలనే తన కలను సాకారం చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎన్వీ రమణ ధన్యవాదాలను తెలిపారు.