More

  చమురు ఉత్పత్తి మా ఇష్టం..! మామీద మీ పెత్తనమేంది..? అమెరికాకు సౌదీ హెచ్చరిక..!

  అమెరికా ఆధిపత్య ధోరణిని సౌదీ మరోసారి ధీటుగా ప్రశ్నించింది. అమెరికా ప్రయోజనాల కోసం తాము పనిచేయట్లేదని బైడెన్ కు తేల్చిచెప్పింది. తమ ఉమ్మడి ప్రయోజనాలకు మాత్రమే ఒపెక్ దేశాలు కట్టుబడి ఉంటాయనీ,.. కేవలం ఒక్కదేశానికి మేలు చేయడానికి తాము నష్టపోలేమని ఖరాకండీగా చెప్పేసింది. ఈ విషయాన్ని సౌదీ అరేబియా విదేశాంగ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో ధృవీకరించింది. సౌదీ ఘాటు సమాధానానికి రష్యా-ఉక్రెయిన్ యుద్దమే కారణం. ఈ యుద్దంతో మింగలేక కక్కలేక అన్న చందంగా తయారైంది అమెరికా పరిస్థితి. ఈ గడ్డు పరిస్థితికి ముఖ్య కారణమేంటో తెలుసుకుందాం.

  కొద్దిరోజుల క్రితం ఆయిల్ సప్లై చేసే దేశాల ఒపెక్ కూటమి ఓ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశాల్లో కూటమి దేశాలు ముడి చమురుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ పై చర్చ జరుపుతుంటాయి. ప్రపంచదేశాలకు ఎంత వరకు చమురు అవసరమో అంతమాత్రమే సప్లై చేస్తాయి. ఒకవేళ డిమాండ్ కంటే ఎక్కువగా ముడి చమురు ఉత్పత్తి చేస్తే.. డిమాండ్ సప్లై చైన్ లో భాగంగా ముడి చమురు ధర పూర్తిగా పడిపోతుంది. అందుకే ఈ దేశాల కూటమి చర్చలు జరిపి.. డిమాండ్ కు తగ్గట్టు చమురు ఉత్పత్తి చేయాలని సమావేశంలో చర్చించుకుంటాయి. అయితే ఈ దేశాలపై అగ్రరాజ్యం అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని ప్రయత్నించింది. దీనికి కారణం, రష్యా ఉక్రెయిన్ యుద్దం నెలల తరబడి సాగడమే.

  యుద్ధం నేపథ్యంలో అమెరికా ఉక్రెయిన్ కు మద్దతిస్తూ రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించింది. దీంతో అమెరికాకు ప్రధాన ముడిచమురు ఎగుమతిదారైన రష్యా నుండి వచ్చే చమురు పూర్తిగా ఆగిపోయింది. ఈ పరిణామాలతో అమెరికాలో పెట్రోల్ రేట్లు గణనీయంగా పెరిగిపోయాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే దీనికి పరిష్కారంగా అమెరికా.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం ఆపి శాంతి చర్చలు జరపవచ్చు. ఈ చర్చలు సఫలమైతే రష్యా నుండి వచ్చే చమురును మళ్లీ పునరుద్దరించి ఆయిల్ ధరలను యధాతథ స్థితికి తీసుకురావచ్చు. అయితే దేశంలోని ఆయుధ లాబీలకు లొంగిపోయిన అమెరికా.. తన స్వార్థంతో ఆ ప్రయత్నమే చేయడంలేదు. యుద్దం ఎంత సుదీర్ఘకాలం కొనసాగితే తన ఆయుధ లాబీలకు అంతగా లాభం చేకూరుతుందనే ఆలోచనతో యుద్దాన్ని మరింత ఆజ్యం పోస్తోంది. ప్రజలు ఎంతగా ఇబ్బందులకు లోనైనా తన ఆయుధ లాబీలు లాభపడతారనే అమెరికా ఆలోచిస్తోంది.

  అదే సమయంలో ప్రజలకు ధరల భారం తగ్గించడానికి.. రష్యాను ఏమీ చేయలేక ఒపెక్ దేశాలను బెదిరించడం మొదలుపెట్టింది అమెరికా. తదుపరి సమావేశంలో చమురు ఉత్పత్తి పెంచాలనే హెచ్చరికలు జారీ చేసింది. కానీ,.. అమెరికా కుయుక్తులు తెలిసిన ఒపెక్ దేశాలు ఒక్క అమెరికా కోసం తమ ప్రయోజనాలను పణంగా పెట్టడానికి సిద్దమవ్వలేమని తేల్చి చెప్పేశాయి. డిమాండ్ కంటే ఎక్కువగా చమురు ఉత్పత్తి పెంచితే చమురు ధరలు తగ్గి అంతిమంగా ఒపెక్ దేశాలే నష్టపోతాయి. కాబట్టి,.. అమెరికా బెదిరింపులకు ఆయా దేశాలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఓపెక్ కూటమి జరిపిన సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగం తగ్గినట్లు గుర్తించడంతో,.. దాదాపు రెండు మిలియన్ బ్యారెళ్ళ చమురు ఉత్పత్తిని తగ్గించాలనే నిర్ణయం తీసుకున్నాయి.

  దీంతో అమెరికా ఆయా దేశాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఒపెక్ దేశాల కూటమిలో అగ్రదేశమైన సౌదీ.. రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తుందంటూ విమర్శించింది. ఆయా దేశాల వైఖరి ఇలాగే కొనసాగితే ఆంక్షలు విధించేందుకూ వెనకాడబోమని అగ్రరాజ్యం హెచ్చరించింది. దీంతో సౌదీ విదేశాంగశాఖ కూడా అదే స్థాయిలో సమాధానమిచ్చింది. కేవలం ఒక్క దేశానికి మేలు చేసేందుకు ఒపెక్ దేశాలన్నిటి ప్రయోజనాలను తాకట్టు పెట్టలేమని తేల్చి చెప్పింది. చమురు ఉత్పత్తిని తగ్గించాలనే నిర్ణయం కేవలం సౌదీ ఒక్కటే తీసుకున్నది కాదనీ,.. ఇది అన్ని ఒపెక్ దేశాలూ కలిసి తీసుకున్న నిర్ణయమనీ తెలియజేసింది.

  Trending Stories

  Related Stories