More

  ఇజ్రాయిల్ బెస్ట్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్..!
  ప్రపంచ దేశాలు షాక్..!!

  శత్రువు సిద్ధంగా లేనిసమయంలో.. ఊహించని విధంగా ఎదురుపడి.. దాడిచెయ్యి అంటాడు సున్జూ. యుద్ధరంగ నిపుణుడైన సున్జూ… All War Is Deception అంటే యుద్దానికి అర్థం మోసమేనని నిర్ధారించాడు. ఈ వాక్యాలకు సరిగ్గా సరిపోయే ఇజ్రాయిల్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ గురించి మీకు నేను వివరించబోతున్నాను. ప్రపంచంలో అంతకు ముందెవరు సాహసించని… ఆ తర్వాత ప్రయత్నించి ఎవరు విజయం సాధించని ఆపరేషనన్ ను ఇజ్రాయిల్ attempt చేసి విజయం సాధించింది. కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేస్స్ చరిత్రలో ఇజ్రాయిల్ మాత్రమే చేయగలదు అనేంతలా పేరుగడించిన ఈ మిషన్ పేరు.. ఆపరేషన్ థండర్ బోల్ట్. దీన్నే ఆపరేషన్ యోనాథన్ అనీ… ఆపరేషన్ ఎంటెబ్బే అని కూడా పిలుస్తారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. Saul David రాసిన Operation Thunderbolt… Simon Dunstan రాసిన Israel’s Lightning Strike – The Raid on Entebbe 1976 పుస్తకాల ఆధారంగా ఈ ఆపరేషన్ గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను.

  1976 జూన్ 27 వ తేదీన ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ నుంచి బయల్దేరిన ఎయిర్ ఫ్రాన్స్ 139 విమానం పారిస్ కు చేరుకోవాల్సి వుండగా.. ఏథెన్స్ దాటిన తర్వాత ఉగ్రవాదులు ఆ విమానాన్ని హైజాక్ చేసి ఉగాండాలోని ఎంటెబ్బే ఎయిర్ పోర్టులో దింపారు. పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలెస్టిన్ ఎక్స్ టర్నల్ ఆపరేషన్స్ ఉగ్రవాదా సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు.. జర్మన్ రెవల్యూషనరీ సెల్స్ కి చెందిన మరో ఇద్దరు ఉగ్రవాదులు ఈ హైజాక్ లో పాల్గొన్నారు. జూన్ 27వ తేదీ మధ్యాహ్నం 8:59 ని.లకు టెల్ అవీవ్ నుంచి 228 మంది ప్రయాణికులతో టేక్ ఆఫ్ అయిన విమానం సుమారు 11.30 గంటలకు ఏథెన్స్ కు చేరుకుంది. ఏథెన్స్ లో 38 మంది ప్రయాణికులు దిగిపోగా.. పారిస్ వెళ్లవలసిన 56 మంది ప్రయాణికులు ఆ విమానంలోకి బోర్డ్ అయ్యారు. అందులో ఇద్దరు జర్మన్ రివొల్యూషనరీ ఉగ్రవాదులు కూడా వున్నారు. టెల్ అవీవ్ లో ఎక్కిన ఇద్దరు PFLP-EO ఉగ్రవాదులకు వీరు తోడయ్యారు. ఏథెన్స్ నుంచి టేకాఫ్ అయిన విమానం వెంటనే సుమారు 12 గంటల 25 నిమిషాలకు విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు దారి మళ్లించి నేరుగా లిబియాలోని బెంఘాజీ ఎయిర్ పోర్టులో ముందు ల్యాండ్ చేశారు. అక్కడ సుమారు 7 గంటల పాటు విమానాన్ని ఉంచిన ఉగ్రవాదులు ఫ్లయిట్ లో ఇంధనాన్ని నింపుకుని.. తర్వాత 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు ఉగాండాలోని ఎంటెబ్బే విమానాశ్రయానికి తీసుకెళ్లారు. హైజాక్ కి గురైన ఆవిమానంలో 246 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. విమానాన్ని హైజాక్ చేసిన నలుగురు ఉగ్రవాదులకు ఎంటెబ్బేలో మరో నలుగురు జతకలిశారు. ఈ ఉగ్రవాదులకి ఉగాండా ప్రభుత్వం కూడా మద్దతివ్వడంతో ఆ దేశ సైన్యం కూడా ఉగ్రవాదులకు రక్షణగా నిలిచింది.

  ఎంటెబ్బే విమానాశ్రయంలో నిరుపయోగంగా ఉన్న ఒక భవనంలోకి ప్రయాణికులను తరలించిన ఉగ్రవాదులు తమ డిమాండ్లను ప్రకటించారు. ఇజ్రాయిల్ జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న 40 మంది, మిగతా దేశాల్లో ఖైదీలుగా ఉన్న 13 మంది.. మొత్తం 53 మంది పాలస్తీనా ఉగ్రవాదుల్ని విడుదల చేయాలనీ… 5 మిలియన్ డాలర్ల నగదు ఇవ్వాలని హైజాకర్లు షరతు విధించారు… లేదంటే ప్రయాణికులను ఒక్కొక్కరిని చంపుతామని బెదిరించారు. ఉగాండా అధ్యక్షుడు ఇడి అమీన్ సహకారంతోనే ఈ హైజాక్ జరిగిన నేపథ్యంలో దాదాపు ప్రతిరోజు ఇడి అమీన్ ఎంటెబ్బే విమానాశ్రయానికి వచ్చి పరిస్థితిని సమీక్షిస్తుండేవాడు. ఉగ్రవాదులకు ఒక దేశ ప్రభుత్వం సహకరించడమేంటి..? అన్న సందేహం రావొచ్చు… దీనికి సమాధానం కావాలంటే.. ఇజ్రాయిల్-ఉగాండాల మధ్య అంతకుముందు చోటు చేసుకున్న కొన్ని ఆసక్తి కరమైన పరిణామాలు తెలుసుకోవాలి. 1948 లో ఇజ్రాయిల్ ఏర్పడిన నాటి నుంచి ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలతో సత్సంబంధాలు నెరపుతూ వచ్చింది. అందులో భాగంగానే ఉగాండాకు కూడా ఇజ్రాయిల్ సహకరిస్తూ వచ్చింది. 1962 లో బ్రిటన్ ఏలుబడి నుంచి స్వాతంత్య్రం పొందిన ఉగాండాకు ఆ తర్వాత ఇజ్రాయిల్ సైనికపరంగా శిక్షణ ఇస్తూ వచ్చింది. ఆ సమయంలో ఉగాండా సైనిక విభాగాధిపతిగా ఇడి అమీన్ పనిచేశాడు. సైనికపరమైన దిగుమతుల్లో అవకతవకలు జరిగినట్లు ఇడి అమీన్ పై ఆరోపణలు వచ్చాయి.. దీంతో ఇడి అమీన్ సైనిక తిరుగుబాటు చేసి ఆ దేశాధ్యక్షుడిని తొలగించి సైనిక పాలన విధించాడు. 1971 జనవరి 25 వ తేదీన తనను తాను ఉగాండా నూతన అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు.

  అనంతరకాలంలో పూర్తీ స్థాయి నియంతలా మారిన ఇడి అమీన్.. సరిహద్దు దేశాలైన కెన్యా, టాంజానియాలతో దుందుడుకు చర్యలకు పూనుకున్నాడు. దీంతో ఇజ్రాయిల్ నిధులు ఇవ్వడం నిలిపి వేసింది. అంతేకాదు… అప్పటి దాకా ఉగాండాకి ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించవలసిందిగా ఇజ్రాయిల్ డిమాండ్ చేసింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఉగాండా అధినేత ఇడి అమీన్… సౌదీ అరేబియా, లిబియాలను శరణు కోరాడు. అయితే ఉగాండాకు సాయం చేయాలంటే.. ఆ దేశంలోని ఇజ్రాయిల్ పౌరులందరిని పంపించి వేయాలని.. ఇజ్రాయిల్ కి.. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తాము సాగిస్తున్న పోరులో కలిసి రావాలని ఇస్లామిక్ దేశాలు షరతు విధించాయి. తమతో కలిసి వస్తేనే ఉగాండాకు ఆర్థిక సాయం చేస్తామని ఇస్లామిక్ దేశాల కూటమి తేల్చడంతో ఇడి అమీన్ ఈ వర్గంలోకి వచ్చి ఉగ్రమూకలకు రక్షణ కల్పించాడు. ఎంటెబ్బేలోని ఎయిర్ పోర్టును అభివృద్ధి చేయడానికి గతంలో ఒప్పందం చేసుకున్న ఇజ్రాయిల్ ఆ తర్వాత దాన్ని రద్దు చేసుకుంది. కానీ, అదే పాత ఎయిర్ పోర్ట్ టెర్మినల్ లో తమ దేశ పౌరులను ఉగ్రవాదులు బందీలుగా ఉంచడం ప్రతీకారమో.. యాదృచ్చికమో..!

  ఇక మరోవైపు 1976, జూన్ 27 వ తేదీన విమానాన్నిహైజాక్ చేసిన ఉగ్రవాదులు… 28 వ తేదీ మధ్యాహ్నానికి ఉగాండా లోని ఎంటెబ్బే ఎయిర్ పోర్టుకు తీసుకొచ్చారు. జూన్ 29వ తేదీన మొత్తం ప్రయాణికుల నుంచి ఇజ్రాయిలీలను వేరుచేసిన ఉగ్రవాదులు జూన్ 30 వ తేదీన ఇజ్రయిలేతరుల్లో 48 మందిని విడుదలచేసారు. జులై 1వ తేదీన ఉగ్రవాదులతో ఇజ్రాయిల్ చర్చలు మొదలుపెట్టింది. ఆ పరిస్థితుల్లో ఉగ్రవాదుల డిమాండ్లకు అనుగుణంగా పాలెస్తీనా ఉగ్రవాదులను వదిలి వేయాలని ఇజ్రాయిల్ కాబినెట్ నిర్ణయిస్తున్నట్టు అనేక కథనాలు వెలువడ్డాయి. ఒకవైపు ఉగ్రవాదులతో చర్చలు జరుపుతూనే… ఇజ్రాయిల్ నిఘా విభాగం మొస్సాద్ ఎంటెబ్బేలోని పరిస్థితి పై సమాచారాన్ని సేకరించడం ఉదృతం చేసింది. ఉగ్రవాదులను విడుదల చేయడం మినహా వేరే అవకాశం లేదనే సంకేతాల్ని ఇజ్రాయిల్ ప్రభుత్వం ఇవ్వడంతో ప్రసార మాధ్యమాల్లో వచ్చిన ఈ కథనాల ఆధారంగా హైజాకర్లు ఇజ్రాయిల్ పౌరులను మినహాయించి… ఇతర దేశాలకు చెందిన 100 మంది ప్రయాణికులను విడుదల చేసారు. విడుదలైన వారిని ఫ్రాన్స్ ప్రత్యేక విమానంలో పారిస్ కి తరలించింది.

  ఉగ్రవాదుల చెరలో ఉన్న తమ దేశ పౌరులను విడిపించడానికి ఇజ్రాయిల్ అనేక ప్రయత్నాలు చేసింది. ఉగాండా అధినేత ఇడి అమీన్ తో చాలాకాలంగా సన్నిహిత సంబంధాలు నెరపిన ఇజ్రాయిల్ రక్షణరంగ మాజీ అధికారి బరుచ్ పలు దఫాలుగా అమీన్ తో చర్చలు జరిపారు. అటు ఈజిప్ట్ ప్రభుత్వం కూడా అనేక ప్రయత్నాలు చేసింది. విచిత్రంగా ఇజ్రాయిల్ కి బద్ద శత్రువైన PLO చైర్మన్ యాసిర్ ఆరాఫత్ సైతం ఒక దూతను పంపి ప్రయాణికులను విడిపించే ప్రయత్నం చేశారని.. అయితే ఉగ్రవాదులు అంగీకరించలేదని కొంతమంది చరిత్రకారులు చెప్తారు.

  మొత్తంగా ఇజ్రాయిల్ ప్రభుత్వం దౌత్య పరమైన ప్రయత్నాలు ఒకవైపు కొనసాగిస్తూనే.. మరోవైపు కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ పథక రచన చేయమని ఇజ్రాయిల్ డిఫెన్స్ విభాగాన్ని ఆదేశించింది. ఉగ్రవాదులు జులై 4 వ తేదీని చివరి గడువుగా ప్రకటించడంతో… వారు ఊహించని విధంగా మెరుపు దాడికి ప్లాన్ చేసింది IDF. జులై 3 వ తేదీ సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు ఈ రెస్క్యూ ఆపరేషన్ కు ఆమోదముద్ర వేసింది ఇజ్రాయిల్ ప్రభుత్వం. శత్రు మూకలకు ఏమాత్రం అనుమానం రాకుండా… ఈ రెస్క్యూ టీం సభ్యులు ఈ మిషన్ ని అత్యంత రహస్యంగా ఉంచారు.
  ఇక ఈ ఆపరేషన్ థండర్ బోల్ట్ ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం.

  ఎంటెబ్బే విమానాశ్రయంలో ఉగ్రవాదులు ప్రయాణికులను బందీలుగా ఉంచిన పురాతన భవనానికి సంబంధించిన సమాచారాన్ని.. ఉగ్రవాదులకదలికలు… ఉగాండా సైన్యం శక్తిసామర్ధ్యాలను బేరీజు వేసి వివిధ నిఘా విభాగాల ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి మొస్సాద్ ఇచ్చిన క్లియర్ డిటెయిల్స్ ప్రకారం ఈ ఆపరేషన్ కి పక్కా ప్లాన్ సిద్ధం చేసింది IDF.

  అయితే ఈ ఆపరేషన్ అమలుపరచడంలో ఒక అడ్డంకి ఎదురైంది. ఇజ్రాయిల్ నుంచి ఎంటెబ్బే విమానాశ్రయానికి 1918 నాటికల్ మైళ్ల దూరం వుంది. గాలిలోనే యుద్ధ విమానాల్లో ఇంధనం నింపే టెక్నాలజీ ఇంకా అప్పటికి అందుబాటులోకి రాలేదు. ఈ ఆపరేషన్ కోసం నిర్దేశించిన టీం వెళ్లి ప్రయాణికులను సురక్షితంగా తీసుకురావడానికి ఇజ్రాయిల్ హెర్క్యులస్ C – 130 విమానాన్ని, మరో మూడు బోయింగ్ జెట్స్ ని సిద్ధంచేశారు. C -130 ఆపరేషన్ టీమ్ ని, ప్రయాణికులను తీసుకురావడానికిగాను.. ఒక బోయింగ్ లో వైద్యులతో కూడిన మెడికల్ సామాగ్రిని…మరో జెట్ ఉగాండా సైన్యం ఎదురు దాడి చేస్తే వారిని నిలువరించడానికి తగ్గట్టు ప్లాన్ చేశారు. ఈ ఆపరేషన్ లో ఇజ్రాయిల్ నుంచి ఎంటెబ్బే వరకు, తిరిగి ప్రయాణికులతో ఇజ్రాయిల్ చేరుకునే విధంగా ఇంధనం తీసుకొచ్చి… ఆపరేషన్ జరిగే సమయంలో అదే ఇంధనాన్ని నింపుకుని వెనక్కి వెళ్లే విధంగా మరో విమానాన్ని సిద్ధం చేసారు. కానీ 1918 నాటికల్ మైళ్ల దూరంలోని ఎంటెబ్బే వరకు మిగతా మూడు విమానాలు వెళ్లి రావాలంటే మధ్యలో ఇంధనం నింపుకోవాల్సివస్తుంది. దీనికి మార్గమధ్యంలోని ఏదో ఒక దేశం సహకరించాలి. లేదంటే రెడ్ సీ గుండావెళ్లాల్సిఉంటుంది. సముద్రం గుండా వెళ్లి దాడిచేసి తిరిగి ప్రయాణికులతో రావడం చాలా రిస్క్ తో కూడుకున్న విషయం కాబట్టి విమానాల్లో వెళ్లడమే కరెక్ట్ అని నిర్ధారణకు వచ్చిన ఇజ్రాయిల్ ప్రభుత్వం కెన్యా ప్రభుత్వాన్ని సహకారం కోరింది. దీనికి కెన్యా ప్రధాని జొమోకెన్యట్టా ఓకేచెప్పడంతో ఇజ్రాయిల్ ఈ ఆపరేషన్ ను విజయవంతంగా అమలు పరచగలిగింది. ఇక ఆపరేషన్ కోసం మొత్తం 100 మందితో కూడిన గ్రౌండ్ టాస్క్ ఫోర్స్ ను మూడు టీమ్స్ గా విభజించారు.

  1. గ్రౌండ్ కమాండ్ కంట్రోల్ టీమ్
  2. అస్సాల్ట్ టీమ్
  3. సెక్యూరర్స్ టీమ్

  ఇజ్రాయిల్ ఆర్మీ నుంచి బ్రిగేడియర్ జనరల్ DAN SHOMRON, ఎయిర్ ఫోర్స్ నుంచి కల్నల్ AMI AYALON గ్రౌండ్ కమాండ్ కంట్రోలో టీమ్ ను లీడ్ చేశారు. వీరు ఈ ఆపరేషన్ కి సంబంధించిన కమ్యూనికేషన్స్, సపోర్ట్ సిస్టమ్ ను పర్యవేక్షించారు.

  కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ కోసం ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగం sayeret matkal కి చెందిన 29 మందిని అస్సాల్ట్ టీమ్ కి ఎంపిక చేశారు. ప్రస్తుత ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు సోదరుడైన లెఫ్టినెంట్ కల్నల్ యోనాతన్ నెతన్యాహు ఈ టీంని లీడ్ చేశారు. ఈ అస్సాల్ట్ టీమ్ ఉగ్రవాదులను, వారికీ రక్షణగా నిలిచిన ఉగాండా దళాలను మట్టుబెట్టడానికి ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించింది.

  ఇక మూడో విభాగమైన సెక్యూరర్స్ టీమ్ బందీలుగా ఉన్న తమ పౌరులను సురక్షితంగా అక్కడి నుంచి తప్పించడానికి నియమించారు. ఇందులో మొత్తం మూడు టీమ్స్ ఉన్నాయి. మొదటి టీం పారాట్రూపర్స్ విభాగం.. ప్రయాణికులను ఇజ్రాయిల్ C-130 యుద్ధ విమానం దాకా చేర్చడానికి వీలుగా రన్ వేను క్లియర్ గా వుంచుతూ ఎంటెబ్బేలోనే తమ విమానంలో ఇంధనం నింపే విధంగా పనిచేసింది. ఇక రెండో టీం IDF లోని GOLANI ఫోర్స్ లీడ్ చేసింది. ఇది ప్రయాణికులను సురక్షితంగా C – 130 యుద్ధ విమానం దాకా తీసుకురావడానికి నిర్దేశించింది.
  మూడో విభాగమైన sayeret matkal టీం… ఒకవేళ ఉగాండా యుద్ధవిమానాలు …ఎదురుదాడికి దిగితే వాటిని నిలువరించడానికి పనిచేసేలా మొత్తం ఈ ఆపరేషన్ థండర్ బోల్ట్ కి రూపకల్పన చేశారు.

  మొదటి విమానంలో వెళ్లిన అస్సాల్ట్ టీమ్ ఒక బ్లాక్ కలర్ mercedes benz car, రెండు land rover కార్లను కూడా తమతో తీసుకుని వెళ్ళింది. ఇజ్రాయిల్ హెర్క్యులస్ విమానం ల్యాండ్ అవ్వగానే నెతన్యాహు సారధ్యంలోని అస్సాట్ట్ టీమ్… ప్రయాణికులను బంధించిన టెర్మినల్ వరకు ఆ కార్లలోనే వెళ్లారు. ఉగాండా సైన్యానికి అనుమానం రాకుండా ఆ దేశ అధ్యక్షుడు ఇడి అమీన్ ఉపయోగించే కార్లను పోలిన వాటినే ఈ ఆపరేషన్ లో ఉపయోగించారు. అంటే దూరం నుంచి శత్రు సైన్యం ముందే ఎటాక్ చేయకుండా చిన్న చిన్న అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని దానికి అనుగుణంగా ప్లాన్ చేశారు. ముందే అనుకున్న ప్లాన్ ప్రకారం మొదటి విమానం ల్యాండ్ అయిన 6 నిముషాలకు మిగతా విమానాలు ల్యాండ్ అయ్యాయి. అస్సాల్ట్ టీమ్ ఉగ్రవాదులపై మెరుపుదాడి చేసి వారిని మట్టుబెట్టారు. వెంటనే ప్రయాణికులను అక్కడి నుంచి తరలించడానికి మిగతా బృందాలు రంగంలోకి దిగాయి. ఇలా రాత్రి సుమారు 11 గంటలకు మొదలైన ఈ ఆపరేషన్ 12:40 ని. లకు ముగిసింది. దాదాపు గంటన్నర వ్యవధిలో విజయవంతంగా పూర్తయిన ఈ ఆపరేషన్ చరిత్రలో నిలిచిపోయింది. మొత్తం 106 మంది ప్రయాణికుల్లో రెస్క్యూటీంకి , ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. అనారోగ్యం వల్ల ఎంటెబ్బేలోని హాస్పిటల్లో ఉన్న ఒక మహిళను ఆ దేశ సైన్యం తర్వాత హత్యచేసింది. ఇక అస్సాల్ట్ టీమ్ సారధ్యం వహించిన యోనాతన్ నెతన్యాహు ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించాడు… మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఆపరేషన్ జరుగుతున్న ఎయిర్ పోర్టు సమీపంలోనే ఉగాండా ఎయిర్ ఫోర్స్ కు చెందిన MIG ఫైటర్ జెట్ కూడా వుండటంతో ఆ దేశ వైమానిక దళం తమను వెంబడించే అవకాశం లేకుండా… వాటిని పూర్తిగా తగలబెట్టి రెస్క్యూ టీం వెనక్కి బయల్దేరింది. చరిత్రలో అంతకు ముందెన్నడూ ఈ స్థాయి కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ జరగలేదు. ఆ తర్వాత వేరెవరు ఇటువంటి ఆపరేషన్ లో పూర్తి విజయం సాధించలేదు. ఈ ఫీట్ జస్ట్ ఇజ్రాయిల్ కి మాత్రమే సాధ్యపడిందని వార్ ఎక్స్ పర్ట్స్ చెబుతుంటారు.

  ఉగ్రవాదులకు వెన్నుదన్నుగా ఒక దేశ ప్రభుత్వమే నిలిచినప్పటికీ… శత్రు భూభాగం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ … ప్రమాదపు తీవ్రత ఎంత ఎక్కువైనప్పటికీ… ప్రాణాలకు తెగించి తమ దేశ ప్రజలను కాపాడడం కోసం సిద్ధమైన ఆ వీర సైనికుల బృందానికి… ఉగ్రవాదంపై ఉక్కు పిడికిలి బిగించే ఆ దేశ ప్రభుత్వ చిత్తశుద్ధికి… నిజంగా సెల్యూట్ చేయాల్సిందే.

  Related Stories