International

మోదీబాటలో శ్రీలంక ప్రధాని విక్రమసింఘే..!

ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. భారత్ ఎప్పుడు ఏం చేస్తోంది.? దేశాభివృద్ధి కోసం మోదీ తీసుకుంటున్న నిర్ణయాలేంటి..? అనుసరిస్తున్న విధానాలు ఏంటి అనే విషయాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. ఆ దేశాల జాబితాలో ప్రధానంగా ఇస్లామిక్ కంట్రీస్ తోపాటు.. శ్రీలంక కూడా ఉంది.

నుపుర్ శర్మ వివాదానికి ముందు నుంచే మోదీ చమురు విషయంలో OIC దేశాల మీద ఆధారపడకుండా… చమురు దిగుమతుల విషయంలో రష్యాతో మరింత బలమైన స్నేహాబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇదే OIC కి జీర్ణం కావడంలేదు. అందుకే నుపుర్ శర్మ విషయంలో మోదీ సర్కార్ మీద ఒత్తిడి పెంచాయి. ఈ పరిణామాల తర్వాత.. ఇస్లామిక్ దేశాలతో దోస్తీ ఎప్పటికైనా ముప్పే అనే భావన అన్ని దేశాల్లోనూ పెరిగింది. అందుకే తీవ్ర సంక్షభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక కూడా ఇప్పుడు భారత్ బాటలో నడవాలని నిర్ణయించుకుంది. చమురు విషయంలో రష్యాతో చెలిమికి సై అంటోంది.

ఇందులో భాగంగానే.. శ్రీలంక ప్రధాని కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా నుంచి అదనపు చమురు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని రణిల్ విక్రమసింఘే స్పష్టం చేశారు. దీనికంటే ముందు తాము ఇతర ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచిస్తామన్నారు. ఉక్రెయిన్ పై యుద్ధానికి ప్రతీకారంగా.. పాశ్చాత్య దేశాలన్నీ రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులను తగ్గించుకోవాలని నిర్ణయించాయి. కానీ… భారత్, చైనా దేశాలు మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించుకోకపోగా.. మరింత పెంచుకున్నాయి.

అంతేకాదు.. చైనా నుంచి మరింత ఆర్థిక సాయాన్ని తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని విక్రమసింఘే ప్రకటించారు. భారత్ నుంచి ఇప్పటికే శ్రీలంక కొంత ఆర్థిక సాయాన్ని పొందింది. శ్రీలంకకు సాయం చేసే విషయంలో భారత్ చొరవను సైతం చైనా ప్రశంసించింది. శ్రీలంక ప్రస్తుత పరిస్థితిని స్వయంగా కొనితెచ్చుకున్నదేనని విక్రమసింఘే ప్రకటించారు. ఉక్రెయిన్ పై యుద్ధం ఈ సంక్షోభాన్ని మరింత పెంచిందన్నారు.

2024 వరకు ఆహార కొతర కొనసాగొచ్చని విక్రమసింఘే అభిప్రాయపడ్డారు. తమ దేశానికి గోధుమలను సరఫరా చేస్తామని రష్యా ఆఫర్ చేసినట్టు తెలిపారు. శ్రీలంక 51 బిలియన్ డాలర్ల విదేశీ రుణ భారాన్ని మోస్తోంది. విదేశీ మారక నిల్వలు పూర్తిగా ఖాళీ అవడంతో కనీస అవసరాలను కూడా దిగుమతి చేసుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇతర మార్గాల ద్వారా తమకు తగినంత ఆయిల్ లభించకపోతే తప్పనిసరిగా రష్యాను ఆశ్రయిస్తామని విక్రమసింఘే స్పష్టం చేశారు. చమురు కోసం రష్యా సాయం కోరడం మంచిదే కానీ.. ఇంత జరిగినా ఇంకా చైనా నుంచి సాయం కోరతామని విక్రమసింఘే చెప్పడంపై విశ్లేషకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకలో సంక్షోభానికి చైనా కూడా కారణమని అభిప్రాయపడుతున్నారు. చైనా నుంచి మరింత సాయం కోరడం విషయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

16 + 5 =

Back to top button