More

    చిరంజీవిపై ఊమెన్ చాందీ వ్యాఖ్యల ఫలితం.. ఎఐసిసి, ఎపిసిసిల డ్యామేజీ కంట్రోల్

    రాజకీయాలలోకి కొన్ని సంవత్సరాల కిందట వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీని పెట్టి ప్రజల్లోకి వెళ్లాలని అనుకున్నారు. కానీ ఆయన అనుకున్నట్లుగా రాజకీయాలు కలిసిరాలేదు. దీంతో ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆయన ఇటీవలి కాలంలో రాజకీయాలకు బాగా దూరం అయ్యారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత చిరంజీవి కేంద్ర మంత్రివర్గంలో చోటుదక్కించుకున్నారు. స్వతంత్ర హోదాలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజకీయాల్లో, కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి దూరమయ్యారు. వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నారు. అయితే ఊహించని విధంగా ఆయన పేరును కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయాల్లోకి లాగారు.

    కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ ఊమెన్ చాందీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగడం లేదని అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఏపీ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ఇప్పుడు కాంగ్రెస్ నేత కాదన్నారు. ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదన్నారు. పెట్రోల్‌ ధరలపై నిరసనలు చేపట్టాలని ఏఐసీసీ స్థాయిలో నిర్ణయించారని, జూలై 7 నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపడుతుందన్నారు చాందీ. ఈ కార్యక్రమాల్లో చిరంజీవి పాల్గొంటారా అంటూ పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. ఆయన పార్టీలో కొనసాగడం లేదన్నారు. తమ కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతున్నాయని అన్నారు.

    Apcc Press Note 29 06 2021

    అయితే ఊమెన్ చాందీ వ్యాఖ్యలకు డామేజ్ కంట్రోల్ పనిలో కాంగ్రెస్ పార్టీ పడింది. ఊమెన్ చాందీ వ్యాఖ్యానించారంటూ పలు మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలను పీసీసీ ఖండించింది. మెగాస్టార్ చిరంజీవి ముమ్మాటికీ కాంగ్రెస్ వాదేనని ఎఐసీసీ, ఏపీసీసీ స్పష్టం చేసింది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో లేరని చెప్పినట్లు ప్రచురితమైన వార్తలపై ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ మంగళవారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. చిరంజీవి తనకిష్టమైన సినీ రంగంలో బిజీగా ఉండడం వల్లనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని ఊమెన్ చాందీ చెప్పారని శైలజా నాథ్ అన్నారు. చిరంజీవి, ఆయన కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ వాదులని శైలజానాథ్ అన్నారు. చిరంజీవి కాంగ్రెస్ వాది కాదు, పార్టీలో లేరని వార్తలు రాయడం దారుణమని అన్నారు. భవిష్యత్తులో చిరంజీవి సేవలు పార్టీకి అందుతాయని ఆయన క్రియాశీలకంగా పాల్గొనే అవకాశం ఉందని అన్నారు.

    Trending Stories

    Related Stories